పాత పైపులైన్లకు కొత్త కనెక్షన్లు

ABN , First Publish Date - 2022-05-17T06:50:54+05:30 IST

మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని లక్ష్మక్కపల్లె ఎస్సీ కాలనీలో ప్రజలదాహార్తిని తీర్చేందుకు జలజీవన్‌ పథకం నిధులు మంజూరయ్యాయి.

పాత పైపులైన్లకు కొత్త కనెక్షన్లు
లీకేజీ పైపులను చూపిస్తున్న కాలనీ వాసులు

తర్లుపాడు, మే 16: మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని లక్ష్మక్కపల్లె ఎస్సీ కాలనీలో ప్రజలదాహార్తిని తీర్చేందుకు జలజీవన్‌ పథకం నిధులు మంజూరయ్యాయి. అయితే సదరు కాంట్రాక్టర్‌ గ్రామంలో ఉన్న పాతలైనుకే ట్యాప్‌లు బిగించి మసిబూసి మారెడుకాయ చేస్తున్నారని ప్రజలు ఆందోళన  వ్యక్తం చేశారు. 

జలజీవన్‌ మిషన్‌ పథకం కింద కాలనీలో మంచినీటి సరఫరా చేసేందుకు రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొత్తగా బోరు వేసి మోటరు బిగించి కాలనీ మొత్తం పైపులైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కొళాయి బిగించాల్సి ఉంది. అయితే సదరు కాంట్రాక్టర్‌ గతంలో ఉన్నలైనుకే ట్యాపులు బిగించి నామమాత్రంగా పనులు చేస్తున్నారు. పనుల పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించు కున్న దాఖలాలు లేవు. పాతపైపులైనుకే ట్యాప్‌లు బిగించడంతో లైన్లు లీకేజీ అవుతు న్నాయి. మురుగునీరు పైపుల్లోకి కొళాయిలోకి వస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.  సదరు కాంట్రాక్టర్‌ జలజవన్‌ మిషన్‌ పథకం పనులు నాసిరకంగా చేస్తున్నారని పల్లెనిద్రకు వచ్చిన అధికారులకు తెలిపినట్లు కాలనీ వాసులు పేర్కొన్నారు. గతంలో ఉన్న ట్యాంక్‌ కూడా పాచిపట్టి లోపల చెత్తాచెదారం నిండింది. దీంతో ట్యాంక్‌ వద్ద నీరు తెచ్చుకో లేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో నాణ్యమైన పైపులు వేసి సురక్షితమైన మంచినీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-17T06:50:54+05:30 IST