‘కొత్త’ కష్టం!

ABN , First Publish Date - 2020-06-04T09:26:56+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాలకు మళ్లీ కొత్తగా రంగులు వేయక తప్పేలా లేదు. ఇప్పటికే కార్యాలయాలకు వేసిన వైసీపీ జెండా ..

‘కొత్త’ కష్టం!

కార్యాలయాలకు రంగులు మార్చాలని సుప్రీం ఆదేశం

నాలుగు వారాలే గడువు

ఇక మార్పు చేయక తప్పని పరిస్థితి

నిధుల కోసం తలలు పటుకుంటున్న అధికారులు


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాలకు మళ్లీ కొత్తగా రంగులు వేయక తప్పేలా లేదు. ఇప్పటికే కార్యాలయాలకు వేసిన వైసీపీ జెండా రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు మరోసారి రంగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రక్రియ వ్యయభారంతో కూడుకున్నది. అన్ని కార్యాలయాలకు రంగులు మార్చాలంటే సుమారు రూ.3 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఇందుకు కోర్టు నెల రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండాలను పోలిన రంగులు వేశారు.


ప్రధానంగా గ్రామ స్థాయిలో విస్తరించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, తాగునీటి కొళాయిల రిజర్వాయర్లకు రంగుల కోసం అధికారులు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. పార్టీ జెండాను పోలిన రంగులు వేయటాన్ని హైకోర్టు గతంలో తప్పు పట్టింది. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకే సాగింది. కొన్ని చోట్ల కార్యాలయాలకు కింది వైపు మట్టి రంగు వేసి పైన పాత రంగులనే కొనసాగించింది. రైతు భరోసా కేంద్రాలకు మూడు రోజుల కిందటి వరకూ రంగులు వేస్తూనే ఉంది.  దీనిని హైకోర్టు తప్పుపట్టడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అత్యున్నత న్యాయస్థానం బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పునే బలపర్చింది. పార్టీ రంగులు వేయటం దురుద్దేశపూరితమేనంటూ వెంటనే రంగులు మార్చాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో అంటే నెల రోజుల్లో  ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది.  


భారీగా ఖర్చు

జిల్లా వ్యాప్తంగా 664 గ్రామ సచివాలయాలున్నాయి. వీటన్నింటికీ రంగులు వేసేందుకు ఒక్కోచోట రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చు చేశారు. సరాసరి తీసుకుంటే రూ.2 కోట్లు పైబడి ఖర్చు చశారు. ఇటీవల ప్రారంభించిన 624 రైతు భరోసా కేంద్రాలకు కూడా సుమారు రూ.1.52 కోట్లతో రంగులు వేశారు. గ్రామాల్లోని తాగునీటి కొళాయి దిమ్మలకు, రిజర్వాయర్లకు కూడా అవే రంగులద్దారు. నెల రోజుల వ్యవధిలో మార్చాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మళ్లీ అన్ని కార్యాలయాలకు రంగులు వేయాలంటే సుమారు రూ.3 కోట్లు పైబడి ఖర్చు కావటం ఖాయం. ఈసారి రంగులు మార్చే పనులను జిల్లాల వారీగా కాంట్రాక్ట్‌ ఇవ్వచ్చు. లేని పక్షంలో ఎవరికి వారుగా చేస్తే నెల రోజుల్లో రంగులు మార్చటం కష్టమే. దీనిని దృష్టిలో పెట్టుకుని మరికొంత సమయాన్ని ప్రభుత్వం అడిగే అవకాశమూ లేకపోలేదు. 


సుప్రీంకోర్టులో సర్కార్‌కు చుక్కెదురు

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులను వేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. కృష్ణపల్లి గ్రామంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సుమారు రూ.1300 కోట్లు రంగుల కోసం ఖర్చు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో పాలన సాగడం లేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజన వర్సిటీని సాధించామని... భవన నిర్మాణానికి నేటివరకు ఈ ప్రభుత్వం స్థలాన్ని పూర్తిస్థాయిలో ఖరారు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. 

Updated Date - 2020-06-04T09:26:56+05:30 IST