కొత్త కలెక్టరేట్‌ కలేనా!?

ABN , First Publish Date - 2021-06-24T04:40:45+05:30 IST

వందేళ్ల క్రితం బ్రిటీషు కాలంలో నిర్మించిన భవనం నుంచే ఇంకా పరిపాలన సాగుతోంది.

కొత్త కలెక్టరేట్‌ కలేనా!?
కొత్త కలెక్టరేట్‌ భవనాలను నిర్మించనున్న పాత టీబీ ఆసుపత్రి ప్రాంగణం

గతేడాది కోర్టు కేసులు క్లియర్‌

రూ.58 కోట్లతో కొత్త అంచనాలు

ప్రభుత్వం నుంచి లభించని అనుమతులు

ప్రస్తుత బ్రిటీష్‌ కాలం నాటి భవనానికే మరమ్మతులు 


జిల్లా పరిపాలనకు కేంద్ర బింధువుగా ఉండే కలెక్టరేట్‌ కొత్త భవనాల నిర్మాణం కలగా మారనుందా? కొన్నేళ్ల తర్వాత కోర్టులో కేసులు క్లియర్‌ అయినా కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం ఇప్పట్లో లేనట్లేనా? అంటే అధికార వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఎనిమిదేళ్ల కోర్టు కేసుల అనంతరం గతేడాది లైన క్లియర్‌కావడంతో సుమారు రూ.58 కోట్లతో గత సెప్టెంబరులో కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికీ అతీగతీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం చేపట్టడం అసాధ్యమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. 


నెల్లూరు, జూన 23 (ఆంధ్రజ్యోతి) : వందేళ్ల క్రితం బ్రిటీషు కాలంలో నిర్మించిన భవనం నుంచే ఇంకా పరిపాలన సాగుతోంది. మారుతున్న పాలనకు అనుగుణంగా అవసరాలు పెరుగుతుండటంతో ప్రస్తుతమున్న కలెక్టరేట్‌ భవనం ఇరుకుగా మారింది.  మొన్నటిదాకా జేసీనే ఉండగా ఇప్పుడు అదనంగా మరో ఇద్దరు జేసీలు వచ్చారు. రికార్డులు కూడా సక్రమంగా పెట్టుకోలేక అధికారులు అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే నీరు కారడం, ఉరవడం, పెచ్చులు ఊడుతుండటంతో ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. బ్రిటీషు కాలం నాటి భవనంలో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయానికి కూడా అధునాతన హంగులతో కొత్త భవనాన్ని నిర్మించారు. పలు శాఖల కార్యాలయాలను, పోలీసు స్టేషన్లను కూడా నూతనంగా నిర్మించారు. కానీ జిల్లా పరిపాలన కార్యాలయానికి మాత్రం మోక్షం లభించలేదు. నెల్లూరులోని పాత టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టరేట్‌ను నిర్మిస్తే పాలనా పరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని ఎనిమిదేళ్ల క్రితం అప్పటి అధికార వర్గాలు భావించాయి. ఇక్కడకు కలెక్టర్‌, జేసీ బంగ్లాలు పక్కనే ఉన్నాయి. సమీపంలోని జిల్లా పరిషత కార్యాలయం ఆవరణలో కీలకమైన జడ్పీ, డీపీవో, డ్వామా, పంచాయతీరాజ్‌, జిల్లా ఎమర్జెన్సీ సెంటర్‌, కార్పొరేషన కార్యాలయం ఉండడం కలిసొచ్చే అంశం. ఇప్పుడున్న కలెక్టరేట్‌ కార్యాలయం చుట్టూ నిత్యం ట్రాఫిక్‌ ఉంటుంది. స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, అధికారుల సమావేశాలకు పార్కింగ్‌ సమస్య కూడా ఏర్పడుతోంది. వీటన్నింటి నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్య లేని, విశాలమైన టీబీ ఆసుపత్రి ప్రాంగణంలో కలెక్టరేట్‌ నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావించారు. అందుకు రూ.35 కోట్లతో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ స్థలం, టెండర్ల వ్యవహారాలు కోర్టు మెట్లక్కెడంతో కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి బ్రేక్‌ పడింది. 


రూ.58 కోట్లతో కొత్త ప్రతిపాదనలు


కాగా కోర్టు కేసుల నుంచి కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి గతేడాది మార్గం సుగుమమైంది. దీంతో తాజాగా అంచనాలు తయారు చేసి రూ.58 కోట్లు అవసరమంటూ కలెక్టర్‌ చక్రధర్‌బాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎట్టకేలకు నూతన పరిపాలన కేంద్రం తథ్యమని అందరూ భావించారు. కానీ నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. ఎప్పటికి అనుమతులు వస్తాయో.. అసలు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంతకాలం ఎదురుచూసిన అధికారులు ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా కలెక్టరేట్‌ భవనంలో మరమ్మతులు చేస్తున్నారు. కాగా ఈ అంశంపై డీఆర్వో చిన ఓబులేసు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అనుమతులు రాలేదని చెప్పారు. 




Updated Date - 2021-06-24T04:40:45+05:30 IST