త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ప్రకటన?

ABN , First Publish Date - 2020-02-20T01:48:15+05:30 IST

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ప్రకటన?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కమలనాథులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు!. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన దానికంటే ఎక్కువగానే ఫలితాలు రావడంతో ఆ జోష్ మరింత పెరిగింది. ఈ క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఢిల్లీ పెద్దలు తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొదట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడ్ని మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 


రేసులో ఎవరున్నారు!?

ఇందుకుగాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్‌ జైన్‌ త్వరలో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నేతల అభిప్రాయాలను తెలుసుకుని జాతీయ నాయకత్వానికి అనిల్ వివరించనున్నారు. కాగా.. అధ్యక్షుడి రేసులో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ముందున్నారు. కాగా.. అనిల్ పర్యటనాంతరం కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా మార్చి 15న తెలంగాణ రానున్నారు. ఆ రోజే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరనేదానిపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అప్పట్లో ఎంపీలు బండి సంజయ్, అరవింద్‌తో పాటు ఒకరిద్దరూ కూడా రేసులో ఉన్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.


అప్పట్లో బండి వ్యాఖ్యలివీ..!

ఈ వార్తలకు బండి సంజయ్ స్పందించి క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. ప్రయత్నాలు చేస్తే బీజేపీ అధ్యక్ష పదవి రాదని.. పార్టీ ఎవర్ని నిర్ణయిస్తే వాళ్ళు అధ్యక్షుడవుతారని చెప్పుకొచ్చారు. అధ్యక్ష పదవి కోసం తాను ప్రయత్నాలు చేయట్లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయటమే తనకు తెలుసన్నారు.

Updated Date - 2020-02-20T01:48:15+05:30 IST