22,018 పాజిటివ్‌ కేసులు.. మరో 96 మరణాలు

ABN , First Publish Date - 2021-05-15T10:09:21+05:30 IST

రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 96 మంది కరోనాతో మరణించారని, 89,087 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 22,018 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

22,018 పాజిటివ్‌ కేసులు.. మరో 96 మరణాలు

  • తూర్పులోనే 3,432 పాజిటివ్‌లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 96 మంది కరోనాతో మరణించారని, 89,087 సాంపిల్స్‌ను పరీక్షించగా.. 22,018 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 13,88,803కి, మొత్తం మరణాల సంఖ్య 9,173కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి కరోనా కేసులు 3 వేల మార్కుని దాటాయి. ఈ జిల్లాలో తాజాగా 3,432 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా.. చిత్తూరులో 2,708, అనంతపురంలో 2,213, విశాఖపట్నంలో 2,200, గుంటూరులో 1,733, నెల్లూరులో 1,733, కడపలో 1,460, పశ్చిమగోదావరిలో 1,436, ప్రకాశంలో 1,265, కర్నూలులో 1,213, కృష్ణాలో 1,031, విజయనగరంలో 899, శ్రీకాకుళంలో 695 కేసులు నమోదయ్యాయి.


ఒకరోజు వ్యవధిలో 19,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 11,75,843కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,03,787 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక కరోనా కారణంగా అనంతపురంలో అనంతపురంలో 11 మంది, తూర్పు గోదావరి, విశాఖ, పశ్చిమగోదావరిలో పది మంది చొప్పున, విజయనగరంలో తొమ్మిది, చిత్తూరు, కృష్ణాలో ఎనిమిది మంది చొప్పున, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు చొప్పున, కర్నూల్‌, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పున, కడపలో నలుగురు చొప్పున మరణించారు.




సచివాలయంలో మరో 8 కేసులు 

అమరావతి సచివాలయంలో మరో 8 కరోనా కేసులు బయటపడ్డాయి. బుధవారం ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సచివాలయంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడంపై ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సచివాలయంలో 8 మంది ఉద్యోగులు కరోనాతో చనిపోయారు.


ఆక్సిజన్‌ అందక వృద్ధురాలి మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి వద్ద శుక్రవారం ఆక్సిజన్‌ అందక ఓ వృద్ధురాలు (72) మృతి చెందింది. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన ఆ వృద్ధురాలు కరోనా బారిన పడడంతో కుటుంబసభ్యులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఆక్సిజన్‌ పడకలు లేవని ఆశ్రం ఆస్పత్రికి వెళ్లాలని చెప్పడంతో అక్కడకు తీసుకెళ్లారు. అక్కడా ఆక్సిజన్‌ బెడ్లు లేవని చెప్పగా.. నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా చేర్చుకోకపోవడంతో మళ్లీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన కొద్ది నిముషాల్లోనే ఆమె ఆస్పత్రిలో చేరకుండానే ప్రాణాలు విడిచింది.


కేజీహెచ్‌ పిల్లల వైద్యుడు వేణుగోపాలరావు మృతి

విశాఖ కేజీహెచ్‌లో పిల్లల వైద్య విభాగం అధిపతి డాక్టర్‌ పి.వేణుగోపాలరావు కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆరిలోవ ప్రాంతంలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. నాలుగైదు రోజుల నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వేణుగోపాలరావు విశాఖ జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు. ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన కుమారుడి వివాహం కూడా ఈ నెలలోనే జరగాల్సి ఉంది. 

Updated Date - 2021-05-15T10:09:21+05:30 IST