కొత్త కేసులు 70

ABN , First Publish Date - 2020-07-09T09:20:19+05:30 IST

కరోనా కమ్ముకొచ్చేసింది. వైరస్‌ వ్యాప్తికి అడ్డూ అదుపూ లేకపోవడంతో జిల్లా మొత్తాన్నీ చుట్టేస్తోంది. ఇటీవల జిల్లాలోని పట్టణాలు,

కొత్త కేసులు 70

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)  : కరోనా కమ్ముకొచ్చేసింది. వైరస్‌ వ్యాప్తికి అడ్డూ అదుపూ లేకపోవడంతో జిల్లా మొత్తాన్నీ చుట్టేస్తోంది. ఇటీవల జిల్లాలోని పట్టణాలు, నగర పంచాయతీలు, మారుమూల పల్లెల్లో కూడా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రతి రోజూ 50 నుంచి 70 పైగా కేసుల చొప్పున ఈ వారం రోజుల్లోనే జిల్లాలో 500 పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 


జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు మరో 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే సాయంత్రానికి మరో 25 మందికి పైగా అనుమానితులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రెండు ప్రైవేట్‌ ల్యాబ్‌ల నుంచి ప్రభుత్వానికి జాబితాలు అందాయి. ప్రభుత్వ ల్యాబ్‌ల ఫలితాలను కూడా కలిపితే ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే గురువారానికి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రెండు వేలకు చేరే ప్రమాదముంది.


 జిల్లాలో బుధవారం నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలోని ల్యాబ్‌లో మరొకరు వైరస్‌ బారినపడ్డారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి కరోనా సోకడంతో ఆయా కార్యాలయాల్లో కలకలం చెలరేగింది. బాధితుల్లో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఎనిమిది మందికి, కొత్తపేటలో మరో 8 మందికి, మారుతీనగర్‌లో నలుగురికి, విద్యాధరపురంలో ముగ్గురికి.. ఇంకా రాజరాజేశ్వరిపేట, భవానీపురం, కృష్ణలంక, ఎలక్ట్రిసిటీ కాలనీ, గురునానక్‌ కాలనీ, మొగల్రాజపురం, నెహ్రూనగర్‌, పటమట తదితర ప్రాంతాల్లో అనేక మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నగర శివారుల్లోని కానూరు, పోరంకి, పెనమలూరు, ఎనికేపాడు, గన్నవరం, ఆత్కూరు, కండ్రిక, కొండపల్లి ప్రాంతాల్లోనూ కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.  


జిల్లాలో బందరు నగర కార్పొరేషన్‌ పరిధిలోని భాస్కరపురంలో రెండు, బచ్చుపేట, గొడుగుపేట, ఆదర్శనగర్‌, చమ్మనగిరిపేటల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, పెడన మండలం నందమూరులో ఒకటి, బంటుమిల్లిలో ఒకటి నమోదయ్యాయి. 

హనుమాన్‌జంక్షన్‌లో ఓ వస్త్ర దుకాణం యజమానికి, పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతాల గ్రామంలో ఓ యువకునికి, ముదినేపల్లి మండలం పెయ్యేరులో రెవెన్యూ ఉద్యోగికి కరోనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది.

Updated Date - 2020-07-09T09:20:19+05:30 IST