Abn logo
Jan 18 2021 @ 00:03AM

రణవ్యూహమే కీలకం

 గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచం యావత్తును కుదిపేసిన కారణంగా ఏర్పడిన కనివినీ ఎరుగని నష్టాల నేపథ్యంలో కొత్త బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన ప్రతిపాదించనున్నారు. ఆర్థిక రంగంలో ‘‘వి’’ షేప్‌ రికవరీకి సంబంధించి ఎన్నో సానుకూలతలు కనిపిస్తున్నప్పటికీ సవాళ్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ఏ చర్యలుండవచ్చనే అంశంపై  ప్రముఖ ఆర్థికవేత్త కె నరసింహమూర్తి విశ్లేషణ ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకం


 జీఎ్‌సటీ అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ తీరు మారిపోయింది. విభిన్న రంగాల్లో సంస్కరణలను ఆవిష్కరించే ఒక విధాన పత్రంగా అది రూపాంతరం చెందింది. కరోనా కష్టాల నుంచి గట్టెక్కేందుకు గత ఆరు నెలల్లో ప్రభుత్వం ఐదు భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, విభిన్న రంగాలను ఉత్తేజితం చేసేందుకు ఎన్నో సంస్కరణలు ప్రకటించింది. రాబోయే మూడేళ్ల కాలంలో ఆ ప్యాకేజీల అమలుకు అవసరమైన నిధులు సమీకరించడం, విభిన్న సంస్కరణలు దృఢచిత్తంతో అమలు పరచడం ప్రభుత్వం ముందున్న పెను సవాళ్లు. ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త సంస్కరణలు ఆవిష్కరించడం ప్రతికూల ఫలితాలకు దారి తీయవచ్చు. అందువల్ల కొంత విరామం తీసుకుని మలి దశ సంస్కరణలపై దృష్టి సారించడం మంచిది.


హోల్డింగ్‌ బ్యాంక్‌ ఏర్పాటు: బ్యాంకింగ్‌ రంగం ఇప్పటికే కన్సాలిడేట్‌ అయింది. ఒకప్పుడు సంఖ్యాపరంగా 27 -28 ఉన్న పీఎ్‌సబీలు ఇప్పుడు 12-13 స్థాయికి తగ్గాయి. వాటి మూలధన అవసరాలను తీర్చడం తప్పనిసరి. గతంలో పీజే నాయక్‌ కమిటీ సిఫారసుకు అనుగుణంగా పీఎ్‌సబీల్లో ప్రభుత్వ వాటాల నిర్వహణకు ఒక హోల్డింగ్‌ బ్యాంక్‌ ఏర్పాటుపై ప్రకటన వెలువరించే ఆస్కారం ఉంది. ఆ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తే అది పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లి తద్వారా సమీకరించిన నిధులు బ్యాంకుల మూలధన అవసరాలకు అందించగలుగుతుంది. గతంలో మౌలిక వసతుల రంగానికి నిధులు సమకూర్చిన ఐసీఐసీఐ, ఐడీబీఐలను బ్యాంకులుగా మార్చడంతో ఇన్‌ఫ్రా నిధుల కల్పనలో పెద్ద అగాథం ఏర్పడింది. రాబోయే బడ్జెట్‌లో ఆ అగాథాన్ని పూడ్చేందుకు ప్రత్యేకంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాం క్‌ కూడా ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే తీవ్ర గడ్డు స్థితిని ఎదుర్కొంటున్న ఎన్‌బీఎ్‌ఫసీలను చక్కదిద్దేందుకు ఏ చర్యలు తీసుకోబోతున్నారో బడ్జెట్‌లో ప్రతిపాదించవచ్చు. ప్రధానంగా స్థూల ఎన్‌పీఏలు మార్చి నాటికి 12.5 శాతానికి, సెప్టెంబరు నాటికి 13.5 శాతానికి దూసుకుపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ చర్యలు అవశ్యం. 


ఉపాధి కల్పన: ట్రావెల్‌... ప్రత్యేకించి విమానయానం, హోటళ్లు, పర్యాటక రంగాలు కరోనా కల్లోలం కారణంగా దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. ఆ రంగాలను ఆదుకునేందుకు వాటిలో ఈక్వి టీ పెట్టుబడులు పెట్టడం, పన్ను రిబేట్లు, పన్ను రాయితీలు  కల్పించడం చాలా అవసరం. భారీ వివాహాల వం టి ఎలాంటి వేడుకలు లేకపోవడంతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగం కుంగిపోయింది. ఆ రంగానికి అండగా నిలిచే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయవచ్చు. 

ఉపాధి కల్పనకు మరో ప్రధాన రంగం హౌసింగ్‌. ఈ రంగానికి ఇప్పటికే ప్రకటించిన పన్ను రిబేట్లు, రాయితీలను మరింతగా పెంచే అంశంపై ఆర్థిక మం త్రి దృష్టి సారించవచ్చు. ప్రధానంగా ఎంఐజీల అర్హత, ప్రిన్సిపల్‌, వడ్డీ తిరిగి చెల్లింపు క్రైటీరియా పరిమితులు పెంచితే ఈ రంగంలో డిమాండు పెరుగుతుం ది. దానిపై ఆధారపడిన 250 వరకు ఉప విభాగాలు ఉత్తేజితమై ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 

బీమా, పింఛన్‌ విభాగాల్లో 75 శాతం వరకు విదేశీ పెట్టుబడులు అనుమతించాలన్నది దీర్ఘకాల డిమాం డు. ఆ పరిమితి ప్రస్తుతం 49 శాతం ఉంది. ఐఆర్‌డీఏ కూడా ఇందుకు సానుకూలత ప్రకటించినందు వల్ల ఈ చర్య తీసుకున్నట్టయితే ఆ రంగంలోకి విదేశీ పెట్టుబడులు మరింతగా వచ్చి అది బలోపేతమై ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి.


సుంకాల్లో వ్యత్యాసాల తొలగింపు: ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్‌ సుంకాల విషయంలో భారీ వ్యత్యాసాలున్నాయి. ముడిసరుకు మీద తక్కువ, ఫినిష్డ్‌ ఉత్పత్తుల మీద ఎక్కువ కస్టమ్స్‌ సుంకం ఉంటే దేశంలో విలువ జోడింపును ప్రోత్సహించినట్టవుతుంది. ఎగుమతుల విషయంలో ఈ సూత్రం రివర్స్‌ అవుతుంది. ప్రస్తుతం మన దగ్గర బహుళ పన్ను స్ట్రక్చర్లున్నాయి. దేశంలో తయారీ రంగంలో ఉపాధి పెంచడం కోసం ఈ లోటుపాట్లను చక్కదిద్దడంపై కూడా దృష్టి సారించే ఆస్కారం ఉంది. అన్ని విమానాశ్రయాలు, పోర్టుల వద్ద నాణ్యత పరీక్ష లాబ్‌లు ఏర్పాటు చేసినట్టయితే ఎగుమతులకు ఉత్తేజం లభిస్తుంది. చౌకబారు దిగుమతులకు కళ్లెం వేసి దేశీయ ఉత్పత్తులను పెంచాలంటే బీఐఎస్‌ ప్రమాణాలు, ప్రత్యేక నిబంధనలు ప్రకటించి వాటిని కట్టుదిట్టంగా అమలు చేసేలా చూడడం తప్పనిసరి. చైనా దిగుమతులను కట్టడి చేసేందుకు ఐటీ హార్డ్‌వేర్‌కు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడం కూడా అవసరం. 


వ్యక్తిగత ఆదాయ పన్ను: ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటుకు దీటుగా వ్యక్తిగత ఆదాయ పన్ను విభాగంలో  పలు చర్యలు తీసుకోవడం అవసరం. అందరూ పన్ను కట్టాలంటూ గత కొన్నేళ్ల కాలంలో శ్లాబ్‌లు పెంచి రేట్లు మాత్రం యథాతథంగా ఉంచారు. ప్రజల్లో పన్ను చెల్లిం పు ధోరణి పెరగాలంటే దాన్ని సరిదిద్దడం అవసరం. అధిక ఆదాయం బ్రాకెట్లో ఉన్న వారికి సెస్‌లు తగ్గించినట్టయితే ఎగవేతలను నిరోధించడం సాధ్యమవుతుంది. 


ప్రభుత్వ వ్యయాల పెంపు: ఆర్థిక రంగంలో నెగిటివ్‌ సెంటిమెంట్‌ ఉంటే ప్రభుత్వ వ్యయాలు పెంచడం అవసరం. ప్రధానంగా గ్రామీణ మౌలిక వసతులు, ఆరో గ్య సంరక్షణ రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఇటీవల ప్రకటించిన వ్యవసాయ సంస్కరణలు విజయవంతం కావాలంటే ఆ రంగానికి అవసరమైన రోడ్లు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు గ్రామీణ ఆరోగ్య మౌలిక వసతులు కూడా పటిష్ఠం చేయడంపై దృష్టి సారించాలి.


కరోనా అదుపులోకి వస్తే ఉద్దీపన ప్యాకేజీల అమలుకు నిధుల కొరత లేదన్న హామీని ప్రభుత్వం నెరవేర్చడం కూడా అవసరం. పెరుగుతున్న విత్త లోటును అదుపు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చే కన్నా విభిన్న రంగాలను ఆదుకోవడమే పరమావధిగా భావిస్తే త్వరలోనే నష్టపోయిన వృద్ధి రేటును పునరుద్ధరించుకుని మెరుగైన వృద్ధి దిశగా అడుగులు పడతాయి.

Advertisement
Advertisement
Advertisement