కొత్త చిగుర్లేస్తున్న కశ్మీరం

ABN , First Publish Date - 2020-08-12T07:33:55+05:30 IST

ఏడాది కిందట 2019 ఆగస్టు 5న రాజ్యాంగంలోని ‘370తో పాటు 35ఎ’ నిబంధనలను రద్దు చేస్తూ పార్లమెంటులో ప్రకటన వెలువడింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...

కొత్త చిగుర్లేస్తున్న కశ్మీరం

ఇవాళ కశ్మీరులో 370 నిబంధనను పునరుద్ధరించాలని ఎవ్వరూ గట్టిగా కోరకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. పాత వ్యవస్థ ఆధారంగా తమ కెరీర్లు నిర్మించుకున్నవారు కూడా నేడు ఈ కొత్త పరిస్థితికి సర్దుకుంటున్నారు. ఈ కొత్త వ్యవస్థలో జమ్మూ కశ్మీర్ ప్రాంత ప్రజలే శాసించే హోదాలో ఉన్నారు. తమ ఆకాంక్షలకు తగ్గట్టు తమ భవిష్యత్తును నిర్మించుకోవటంలో వారు నిమగ్నమై ఉన్నారు. స్థానిక అభివృద్ధి, సాధికారత కీలక ప్రాధాన్యాంశాలుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు విజయవంతం కావటమన్నది జమ్ముకశ్మీర్‌ ప్రజలకేగాక మొత్తం భారతదేశ భవిష్యత్తుకే ఎంతో ప్రధానమైనది.


ఏడాది కిందట 2019 ఆగస్టు 5న రాజ్యాంగంలోని ‘370తో పాటు 35ఎ’ నిబంధనలను రద్దు చేస్తూ పార్లమెంటులో ప్రకటన వెలువడింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడానికి ఇది వీలు కల్పించింది. ఆ మేరకు శాసనసభ రహిత లదాఖ్, శాసనసభ సహితమైన జమ్ముకశ్మీర్‌ రూపొందించే వెసులుబాటు కలిగింది. ఈ సాహసోపేత నిర్ణయం 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి రావడంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విభిన్న ప్రతిధ్వనులు వినవచ్చాయి. సాధారణంగా యథాతథ స్థితికి అలవాటుపడిన మేధో వర్గాల పాలిట ఈ మార్పు ఒక పెద్ద సవాలుగానే నిలిచింది. అయితే, కశ్మీర్‌లో యథాతథ స్థితి అని చెప్పుకుంటున్నది నిజానికి ఎప్పుడో ఒక నిలకడలేని స్థాయికి వెళ్లిపోయింది. మనం ఎంత కాదనుకున్నా అది తిరుగులేని వాస్తవం. ఈ పరిస్థితికి స్పందించకుండా ఇంత కాలం భారత విధాన రూపకర్తలు తాత్సారం చేస్తుండటానికి రాజకీయ జడత్వమే కారణమని చెప్పాలి. ఏడాది గడచిన తర్వాత, ప్రస్తుత కోవిడ్‌-–19 మహమ్మారి సవాళ్ల నడుమ కూడా, జమ్ముకశ్మీర్‌, లదాఖ్‌లలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. భారత్‌ నిర్ణయాన్ని అంతర్గత అంశంగా పరిగణిస్తూ అంతర్జాతీయంగా విస్తృతంగా మద్దతు లభించింది. అంతేగాక జమ్ముకశ్మీర్‌, లదాఖ్‌లలో అభివృద్ధి ప్రక్రియతోపాటు, ప్రజలకు సాధికారత కల్పించే చర్యలు కూడా స్థిరంగా కొనసాగుతున్న కారణంగా భవిష్యత్తులో ఈ అంతర్జాతీయ మద్దతు మరింత బలపడితీరుతుంది.


ఇక స్థానిక పరిపాలనలో తీసుకువచ్చిన పెనుమార్పుల ఫలితాలు అప్పుడే స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇప్పటిదాకా జాతీయ స్థాయి చర్చల్లో ప్రాతినిధ్యం కానరాని ఎన్నో వెనుకబడిన వర్గాలు... ముఖ్యంగా వల్మీకులు, గూర్ఖాలు, దళితులు తదితరులకు లబ్ధి చేకూరుతోంది. గతంలో రాజకీయంగా ప్రముఖ స్థానంలోగల స్వల్పస్థాయి ఉన్నతవర్గం ఈ ప్రాంత భూత భవిష్యత్ వర్తమానాలను నిర్దేశించేది తామేనంటూ విస్తృత ప్రజానీకాన్ని పక్కకునెట్టింది. కానీ, గత ఏడాది నుంచి ఇక్కడ కేంద్ర చట్టాలు అమలు కావడం మొదలవటంతో, ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న అధిక సంఖ్యాకవర్గాలు ప్రాంతీయ జాతీయ స్థాయిలో తమ ఉనికిని పునః స్వాధీన పరుచుకుంటున్నాయి. విద్యాహక్కు; తల్లిదండ్రుల ‍& వయోవర్గాల సంక్షేమం & నిర్వహణ చట్టం-–2001; జాతీయ మైనారిటీ చట్టం; మహిళలు, పిల్లలు, వికలాంగుల ప్రయోజనం కోసం చట్టాలు, ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిన భూములకు సముచితమైన పరిహారం పొందే హక్కు.. ఇంకా 73, 74 రాజ్యాంగ సవరణలు తదితరాల అమలుతో జమ్ముకశ్మీర్ ప్రజలు కోల్పోయిన అనేక హక్కులు తిరిగి వారికి దఖలు పడ్డాయి. ప్రభుత్వం తన పాలన విధానాల్ని పకడ్బందీగా నడిపిస్తున్నండటంతో బలహీనవర్గాలకు కొత్త ఉపాధి అవకాశాలు లభించటం మొదలైంది.


దేశ స్వాతంత్ర్యం ఏడో దశాబ్దంలో ప్రవేశించిన తర్వాత కూడా ఇప్పటిదాకా విస్మరించబడినవారు నేడు శక్తిమంతులవుతున్నారు. దేశ ప్రధాన స్రవంతిలో జమ్ముకశ్మీర్‌, లదాఖ్‌ల అనుసంధానం కావటానికి ఈ పరిణామం ఎంతో దోహదం చేస్తుంది. ఈ ప్రాంతంలో చిరకాలం నుంచీ కునారిల్లుతున్న పలు అభివృద్ధి పథకాలు ఇప్పుడు పునరుజ్జీవం పొందుతున్నాయి. ఇక్కడ 2018 నాటికి రూ.7000 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో స్తంభించాయి. సామాజిక, ఆర్థిక మౌలిక వసతుల కోసం 2015లో ప్రకటించిన ‘ప్రధానమంత్రి ఉపశమన ప్యాకేజీ’ కూడా ఇక్కడ అమలుకు నోచుకోలేదు. అయితే గత ఏడాది నుంచీ మౌలిక సదుపాయాలు, ఇతర రంగాలలో వివిధ పెట్టుబడి పథకాలు వేగం పుంజుకున్నాయి. శ్రీనగర్‌లోని రాంబాగ్ ఫ్లైఓవర్, శ్రీనగర్ లేహ్ విద్యుత్‌ సరఫరా లైన్‌ వంటివి పూర్తయ్యాయి. ఆరోగ్య వ్యవస్థ నుంచి రైల్వే వ్యవస్థ వరకు, జలవిద్యుత్‌ నుంచి వంతెనల నిర్మాణం వరకు ప్రధాన ప్రాజెక్టులన్నీ నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తయ్యేట్టుగా ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని మౌలిక వసతుల అభివృద్ధిపైన, అక్కడి సంక్షేమ పథకాల అమలుపైన ప్రత్యేక శ్రద్ధ మొదలైంది. 100 శాతం గృహ విద్యుదీకరణ లక్ష్యం సాధించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అందరికీ నీరు, మారుమూల గ్రామాలకు రహదారి అనుసంధానం వంటి లక్ష్యాలపై దృష్టి సారించింది. ఉద్యోగ విపణి వేగంగా రూపు మార్చుకుంటున్న తరుణంలో విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి స్థానిక యువత నైపుణ్యాల్ని పెంపొందించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే, జమ్ముకశ్మీర్‌, లదాఖ్‌ల ఆర్థిక భవిత కోసం కీలకమైన ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు ప్రారంభించింది.


జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం లేదంటూ విమర్శకులు గొంతుచించుకుంటున్న నేపథ్యంలోనే మరోప్రక్క 2018 నాటి పంచాయతీ ఎన్నికలలో 74.1 శాతం క్షేత్రస్థాయి ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవడం చారిత్రాత్మక విజయం. ఆ తరువాత సమితి అభివృద్ధి మండళ్ల ఎన్నికల సందర్భంగా 2019 అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్‌ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా తొలిసారి 98.3 శాతం ఓటింగ్‌ నమోదైంది. స్థానిక రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించిన కొన్ని కుటుంబాల ఉక్కుపిడికిళ్ళలోనుంచి విముక్తి పొందిన రాజకీయ ఆవరణలో నేడు కొత్త గళాలు వినిపిస్తున్నాయి, కొత్త పాత్రధారులు ప్రవేశిస్తున్నారు. ఈ ‘దిగువ నుంచి ఎగువకు సమూల మార్పు’ విధానం జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో గొప్ప పాత్ర పోషించింది. వ్యూహాత్మకంగా జమ్ముకశ్మీర్, లదాఖ్‌లకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తన సంస్కరణలను చివరి అంచె దాకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మునుపటి యథాతథ స్థితిని సవాలు చేయటానికి అసలు ఇంత కాలం పట్టడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ సవాలు చేయటమంటూ మొదలైంది కాబట్టి ఇక వెనక్కు మళ్ళే ప్రసక్తి ఉండకూడదు. అంతర్జాతీయంగా కొన్ని ప్రతికూల శక్తులు వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం అమలులో పెట్టిన చర్యల సత్ఫలితాన్ని ఆకాంక్షిస్తూ ఎంతో నిశ్శబ్ద మద్దతు కూడా విస్తారంగా ఉంది. ఇవాళ కశ్మీరులో  370 నిబంధనను పునరుద్ధరించాలని ఎవ్వరూ గట్టిగా కోరకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. పాత వ్యవస్థ ఆధారంగా తమ కెరీర్లు నిర్మించుకున్నవారు కూడా నేడు ఈ కొత్త పరిస్థితికి సర్దుకుంటున్నారు. ఈ కొత్త వ్యవస్థలో జమ్మూ కశ్మీర్ ప్రాంత ప్రజలే శాసించే హోదాలో ఉన్నారు. తమ ఆకాంక్షలకు తగ్గట్టు తమ భవిష్యత్తును నిర్మించుకోవటంలో వారు నిమగ్నమై ఉన్నారు.


స్థానిక అభివృద్ధి, సాధికారత కీలక ప్రాధాన్యాంశాలుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు విజయవంతం కావటమన్నది జమ్ముకశ్మీర్‌ ప్రజలకేగాక మొత్తం భారతదేశ భవిష్యత్తుకే ఎంతో ప్రధానమైనది. విమర్శకులు ఈ సంస్కరణల పట్ల ఇంకా సంకుచితంగానే వ్యవహరిస్తున్నారు. వారి ఉద్దేశాల్ని భారత దేశ ప్రత్యర్థులు మాత్రమే అభినందిస్తున్నారు. చెదిరిన సరిహద్దులను కూడగట్టుకోవటంపై తన కృతనిశ్చయాన్ని భారత దేశం ఎట్టకేలకు స్పష్టం చేసింది. దీని వల్ల ఇప్పటిదాకా యథాతథ స్థితి వాదంతో సుఖనిద్రలో ఉన్నవారు ఉలిక్కిపడటం సహజమే. పాకుడు పట్టిన పాత విధానాలను పూర్వపక్షం చేయడం ముఖ్యమే కాదు, అత్యవసరం కూడా.

హర్ష్ వి. పంత్


Updated Date - 2020-08-12T07:33:55+05:30 IST