గుట్టలో కొత్త బస్టాండ్‌, డిపో

ABN , First Publish Date - 2021-03-02T06:45:59+05:30 IST

యాదాద్రి కొండ దిగువన ఆర్టీసీ బస్‌ డిపో, బస్టాండ్‌, టెంపుల్‌ టర్మినల్స్‌ను త్వరితగతిన నిర్మిస్తామని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు.

గుట్టలో కొత్త బస్టాండ్‌, డిపో
గండి చెరువు సమీపంలో బస్టాండ్‌, టర్మినల్‌ డిజైన్లను పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ

ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ

సైదాపురంలో బస్‌డిపోకు 10 ఎకరాలు

గండి చెరువు సమీపంలో బస్టాండ్‌, టర్మినల్‌కు 9ఎకరాలు కేటాయింపు

యాదాద్రి టౌన్‌, మార్చి 1: యాదాద్రి కొండ దిగువన ఆర్టీసీ బస్‌ డిపో, బస్టాండ్‌, టెంపుల్‌ టర్మినల్స్‌ను త్వరితగతిన నిర్మిస్తామని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి సోమవారం సైదాపురం శివారులోని బస్‌ డిపో, గండి చెరువు సమీపంలోని బస్టాండ్‌, టెంపుల్‌ టర్మినల్‌ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైదాపురం శివారులోని సర్వే నంబర్‌ 329లో 10ఎకరాల్లో సువిశాల స్థలంలో ఆత్యాధునిక సదుపాయాలతో ఆర్టీసీ బస్‌డిపో నిర్మిస్తామన్నారు. గండి చెరువు సమీపంలోని 6ఎకరాల్లో బస్టాండ్‌, 3ఎకరాల్లో టెంపుల్‌ బస్‌ టర్మినల్‌ నిర్మాణాలకు డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీటి డిజైన్లు ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. రెండు ఘాట్‌రోడ్లలో వాహనాల రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సుమారు రూ.12కోట్లతో సైదాపురంలో డిపో, రూ.18 కోట్లతో బస్టాండ్‌, టర్మినల్‌ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలోనే ఈ పనులు కార్యరూపం దాల్చనున్నాయన్నారు. శరవేగంగా పనుల పూర్తికి కృషి చేస్తామని చెప్పారు. స్థలాన్ని, సంబంధిత డిజైన్లను పరిశీలించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. అంతకముందు గుట్ట బస్‌డిపో కార్యాలయంలో పలు శాఖల అధికారులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీలు ఏ.పురుషోత్తంనాయక్‌, డీఎం మునిశేఖర్‌, దేవస్థాన ఈవో గీతారెడ్డి, ఆర్డీసీ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T06:45:59+05:30 IST