Abn logo
Dec 31 2020 @ 00:53AM

కొత్త బ్రిటన్‌

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వేరుపడే ప్రక్రియ సజావుగా ముగియడం సంతోషించవలసిన ఘట్టం. విడిపోవడం తప్పదనుకున్న తరువాత అది ఘర్షణాత్మకంగా కాక, సుహృద్భావంతో జరగడం ఇరువురికీ మేలు చేస్తుంది. ఒకపక్క బ్రిటన్‌ను కొవిడ్‌ కొత్త వేరియంట్‌ చుట్టుముట్టేస్తూ, దేశంలో అత్యధిక భాగం లాక్‌డౌన్‌లోకి జారిపోయిన స్థితిలోనే, నాలుగేళ్ళుగా వెంటాడి వేధిస్తున్న ‘బ్రెగ్జిట్‌’ ప్రక్రియకు శుభం కార్డు పడటం ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కచ్చితంగా ఉపశమనం కలిగించేదే. ఆరునూరైనా ఈమారు బ్రెగ్జిట్‌ కానిచ్చేద్దామన్న నినాదంతో, మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బోరిస్‌ ఎట్టకేలకు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. 


బ్రెగ్జిట్‌ అనంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాన ప్రతిపక్షం లేబర్‌పార్టీ ఇప్పటికే సమర్థించింది. బ్రిటిష్‌ ఎంపీల చర్చకు కొద్దిగంటల ముందే యూరోపియన్‌ యూనియన్‌ పెద్దలు సంతకం చేసిన 1246పేజీల వాణిజ్య, సహకార ఒప్పందం ప్రత్యేక రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో లండన్‌కు చేరుకుంది. ‘ఇది పరస్పర స్నేహం, సహకారానికి హామీ పడుతూ  ఇద్దరు సమానుల మధ్య కుదిరిన అవగాహనే తప్ప, ఒకరు ఓడిందీ లేదు, మరొకరు గెలిచిందీ లేదు’ అన్న బోరిస్‌ విశ్లేషణను ఎక్కువమంది బ్రిటిష్‌ ఎంపీలు కాదనడం లేదు. ఏ ఒప్పందమూ లేని తప్పనిసరి నిష్క్రమణ కంటే ఏదో ఒక ఒప్పందంతో ఇలా వేరుపడటం పెద్ద విజయమే. కీలకమైన రంగాల్లో బ్రిటిష్‌ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆగ్రహం కలిగించని రీతిలోనే సదరు ఒప్పందం ఉన్నది. జీరో టారిఫ్‌లు, జీరో కోటాలతో ఈయూ మార్కెట్‌లో అత్యధికశాతం సరుకు స్వేచ్ఛగా అమ్ముకొనేందుకు బ్రిటన్‌కు ఇకపై వీలుపడుతున్నది. ఆర్థికం, వాణిజ్యం, చట్టాలు, సరిహద్దులు, సముద్రజలాలు ఇత్యాది అన్ని రంగాల్లోనూ తిరిగి అది తన స్వతంత్రతను పొంది, రేపటినుంచి రాజకీయార్థిక స్వేచ్ఛను అనుభవించబోతున్నది.


యూకేలో ఇకపై కొత్త ఉద్యోగాలు, గ్రీన్‌జోన్లు పుట్టుకొస్తాయంటూ ప్రజలకు బోరిస్‌ ఏవో హామీలు ఇస్తున్నారు కానీ, ఒక పెద్ద మార్కెట్‌నుంచి తప్పుకోవడం ద్వారా బ్రిటన్‌ కచ్చితంగా కొంత నష్టపోక తప్పదు. కంపెనీల ఉత్పత్తులు, సరఫరావ్యవస్థలు దెబ్బతినడం, వాణిజ్య పరిమాణం తగ్గడం, ఉద్యోగ ఉపాధులమీద ఆ ప్రభావం పడటం తప్పనిసరి. కొవిడ్‌ కారణంగా మిగతా ప్రపంచంలాగానే బ్రిటన్‌ కూడా ఆర్థికంగా దెబ్బతిని ఉన్న స్థితిలో, బ్రెగ్జిట్‌ అదనపు కష్టాలు సృష్టించవచ్చు. బ్రెగ్జిట్‌ అనంతర బ్రిటన్‌కు ఘన వైభవాన్ని సాధించిపెడతానని బోరిస్‌ హామీ ఇస్తున్నారు. ఆర్థిక కష్టాలకు తోడుగా, కొత్త కొవిడ్‌ వేరియంట్ దేశాన్ని తిరిగి మూతబడేట్టు చేస్తున్న తరుణంలో ఆ మాటనిలబెట్టుకోవడం సులభమేమీ కాదు. భారత్‌ వంటి దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడం, అవసరమైన పక్షంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడం బ్రిటన్‌కు ఉపకరించవచ్చు. బ్రెగ్జిట్‌ అనంతరం కూడా ఈయూలో పెట్టుబడులకు బ్రిటన్‌ రాజమార్గంలాగా ఉపయోగపడబోతున్నందుకు భారత పెట్టుబడిదారులు సంతోషించవలసిందే. కొత్త ఏడాదిలో గణతంత్రదినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొనబోతున్న బోరిస్‌ జాన్సన్‌తో మన పాలకులు ఏమేరకు ఇచ్చిపుచ్చుకుంటారో చూడాలి. నాలుగేళ్ళుగా బ్రిటన్‌ను పీడిస్తున్న బ్రెగ్జిట్‌ భూతాన్ని ఎట్టకేలకు వదుల్చుకున్నందుకు బోరిస్‌ను అభినందించాల్సిందే. డేవిడ్‌ కెమెరాన్‌తో పాటు, తెరీసా మే వంటి గట్టిపిండాన్ని కూడా బ్రెగ్జిట్‌ రాజకీయంగా బలితీసుకుంది. ఆమె స్థానంలో వచ్చిన బోరిస్‌ సైతం గత ఏడాది పార్లమెంటులో బొక్కబోర్లా పడ్డారు. మధ్యంతర ఎన్నికలకు పోయి, తిరిగి ప్రధాని అయి, బ్రెగ్జిట్‌ లక్ష్యంగా కృషిచేస్తున్న తరుణంలో కరోనా ఆయననూ దేశాన్నీ కూడా చుట్టుముట్టింది. ఈయూతో మూడుదశాబ్దాల అనుబంధాన్ని తెంపుకున్న బ్రిటన్‌ను ఆయన అన్ని రంగాల్లోనూ ఉన్నతంగా నిలబెడతారని ఆశిద్దాం.

Advertisement
Advertisement
Advertisement