Abn logo
Nov 27 2020 @ 23:59PM

నవ వధువు ఆత్మహత్య

అత్తింటిపై దాడి చేసి తగుల బెట్టిన బంధువులు

ఇరు వర్గాలపై కేసు నమోదు


కుప్పం/కుప్పం రూరల్‌, నవంబరు 27: వేసిన పచ్చటి పందిరి వాడకముందే... కాళ్ల పారాణి ఆరకముందే...  నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన ఆమె బంధువులు అత్తారింటిపై దాడి చేసి, తగులు బెట్టి విధ్వంసం సృష్టించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... కుప్పం మండలం మంకలదొడ్డికి చెందిన మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు కుమార్తె చైతన్యర(22) అదే గ్రామంలో వలంటీరు. ఉర్లవోబనపల్లె పంచాయతీ కూర్మానుపల్లెకు చెందిన వెంకటేష్‌ కుమారుడు తంగవేలు(24)తో గత నెల 28న వివాహమైంది. నెల రోజులు కావస్తున్నా చైతన్య తనను దగ్గరికి రానివ్వడంలేదంటూ రెండు రోజుల క్రితం తంగవేలు... మామకు  చెప్పాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారు ఝామున అత్తారింటి బయట ఉన్న బాత్‌రూంలో చైతన్య ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కూర్మానుపల్లెకు చేరుకుని  తంగవేలును చితక్కొట్టారు. చైతన్య మృతదేహాన్ని వఽధువు స్వగ్రామం మంకలదొడ్డికి తీసుకెళ్లి దహనం చేశారు. ఇరువర్గాలనూ శాంతపరచిన గ్రామపెద్దలు రాజీకి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈలోగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం పెద్దయెత్తున కూర్మానుపల్లె చేరుకుని తంగవేలు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతోపాటు పెట్రోలు పోసి నిప్పంటించారు. అదనపు కట్న వేధింపులవల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. దీనిపై కుప్పం అర్బన్‌ సీఐ శ్రీధర్‌ను వివరణ కోరగా... చైతన్య ఆత్మహత్యకు సంబంధించి ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తంగవేలు, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే ఇల్లు ఽధ్వంసం చేసినందుకు తంగవేలు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు చైతన్య బంధువులపై  కేసు నమోదు చేశామని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement