షాకింగ్.. చైనా టీకా సామర్థ్యం ఇంత తక్కువా..!

ABN , First Publish Date - 2021-01-13T18:00:46+05:30 IST

బ్రెజిల్‌లో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చైనా సంస్థ సైనోవాక్ రూపొందించిన కరోనా టీకా సామర్థ్యం కేవలం 50.4 శాతమని అక్కడి శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

షాకింగ్.. చైనా టీకా సామర్థ్యం ఇంత తక్కువా..!

బ్రెజీలియా: చైనా టీకాలకు సంబంధించిన సమాచారమంతా గోప్యమే! చైనా ప్రభుత్వంతోపాటూ ఈ టీకాకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న దేశాలు కూడా టీకాకు సంబంధించిన కీలక సమాచారమేది విడుదల చేయలేదు. టీకా సామర్థ్యం అద్భుతం అంటూ ఆర్భాటపు ప్రకటనలు మినహా నిపుణులు కోరుతున్న కీలక వివరాలేవీ ఇప్పటివరకూ వెల్లడికాలేదు. ఇది చైనా టీకాలపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  చైనా సంస్థ సైనోవాక్ రూపొందించిన కరోనా టీకా సామర్థ్యం కేవలం 50.4 శాతమని అక్కడి శాస్త్రవేత్తలు మంగళవారం నాడు పేర్కొన్నారు. బుటాన్‌టాన్ బయోమెడికల్ సెంటర్ నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. 


కాగా..ఇదే సంస్థ గతంలో చైనా టీకా సామర్థ్యం ఏకంగా 70 శాతమని ప్రకటించింది. ట్రయల్స్‌కు సంబంధించిన ప్రాథమిక విశ్లేషణ అనంతరం ఈ ప్రటకన చేసింది.  దీంతో ప్రభుత్వంతో పాటూ ప్రజలు కూడా చైనాపై నమ్మకం పెంచుకున్నారు. ఈలోపే ఇంతటి నిరాశాజనకమైన ప్రకటన వెలువడటం ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తోంది. ప్రజలకు త్వరగా టీకాను అందుబాటులోకి తేవాలనుకుంటున్న బ్రెజిల్ ప్రభుత్వానికీ ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చింది. 


గతంలో విడుదల చేసిన ట్రయల్స్‌ డాటాలో మధ్యస్థం లేదా తీవ్రమైన కరోనా కేసుల సమాచారం మాత్రమే ఉంది. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో స్వల్ప తీవ్రత కలిగిన కరోనా కేసులపై జరిపిన విశ్లేషణ కూడా జోడించామని బుటాంటాన్ సంస్థలో క్లినికల్ విభాగం డైరెక్టర్ వెల్లడించారు. ఇలా విడతల వారీగా టీకా భధ్రత, సామర్థ్యాలకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయడంపై బ్రెజిల్‌లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 


ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటూ వివిధ దేశాల అనుమతులు పొందాలంటే కరోనా టీకాకు కనీసం 50 శాతం ప్రభావశీలత కలిగి ఉండాలి. ఫైజర్, మోడర్నా టీకాల సామర్థ్యం 95 శాతానికి దగ్గరగా ఉంటే..ఆక్సఫర్డ్ టీకా ప్రభావశీలత 90 శాతం వరకూ ఉంది. దేశంలో టీకా కార్యక్రమం అమలు చేసేందుకు బ్రెజిల్ కేవలం రెండు టీకాలపైనే ఆశలు పెట్టుకుంది. అందులో ఒకటి ఆక్సఫర్డ్ టీకా కాగా..రెండోది చైనాకు సైనోఫార్మ్ కంపెనీ రూపొందించిన టీకా..! ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఫలితాలు బ్రెజిల్‌ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి.

Updated Date - 2021-01-13T18:00:46+05:30 IST