పార్టీకి కొత్త రక్తం ఎక్కిద్దాం

ABN , First Publish Date - 2021-02-26T07:20:34+05:30 IST

నేను ఇంతకాలం రాష్ట్రంకోసం పని చేశా..

పార్టీకి కొత్త రక్తం ఎక్కిద్దాం

అధికారంలోకి రాగానే మీపై తప్పుడు కేసులన్నీ మాఫీ చేస్తా 


కుప్పం(చిత్తూరు):
 అడుగడుగునా హారతులు.. ఓటమి తట్టుకోలేని అభిమానుల విషాదాలు.. యువత కురిపించే పుష్పవర్షాలు.. చంద్రబాబుకు కుప్పంలో జన ఘన నీరాజనం లభించింది. ఓట్లుగా ఎందుకు కురవలేకపోయిందో కానీ.. కళ్లెదుట కనిపించేసరికి అభిమానం కట్టలు తెగి ప్రవహించింది. బాబును ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది.


‘నేను ఇంతకాలం రాష్ట్రంకోసం పని చేశా. రాష్ట్రం బాగు పడితే ప్రజలందరూ బాగు పడతారనేదే నా తాపత్రయం. ఆ యావలో మీకు నష్టం జరిగింది. పొరపాటు చేశా.. ఇప్పుడు సరిదిద్దుకుంటాను. కొత్తరక్తం ఎక్కిస్తాను’ అని కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా గురువారం ఆయన గుడుపల్లె, కుప్పం రూరల్‌ మండల కార్యకర్తలతో సమావేశమయ్యారు. వాళ్లు నాయకులపై పలు ఫిర్యాదులు చేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలవడం లేదని, పంచాయతీ ఎన్నికల్లో ఓటమి వారి నిర్వాకం ఫలితమేనని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అంతా విన్న చంద్రబాబు వారిని చల్లబరచడానికి ప్రయత్నించారు. ‘ఇప్పుడొద్దు. కొన్ని బహిరంగంగా మాట్లాడాల్సినవి ఉంటాయి. మరికొన్ని నాలుగ్గోడల మధ్య చర్చించుకోవాల్సినవి ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకొంటే ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లవుతుంది’ అన్నారు.


‘నాయకులమీద ఫిర్యాదులు చేసే ముందు, మనం ఎంత బాధ్యతగా ఉన్నామన్నది కూడా తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. ‘కుప్పంలో ఒకే జెండా, టీడీపీ జెండా. మీరు పనిచేశారు కాబట్టే నేనిక్కడ ఉన్నా. వాళ్లు నన్ను మానసికంగా దెబ్బ తియ్యాలనుకున్నారు. మీతోపాటు నేనూ నష్టపోయాను. నేనూ మనిషే కదా’ అని కార్యకర్తల కష్టసుఖాలు పంచుకున్నారు. ‘మీమీద తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల కథ చూస్తా. రౌడీ రాజ్యానికి పోలీసులు తొత్తులుగా మారారు. వారెన్ని కేసులన్నా పెట్టనీ, రాబోయే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడ్తా. రాబోయేది మన ప్రభుత్వమే ఆ కేసులన్నీ మాఫీ చేస్తా.’ అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, అందువల్ల వారి ఆటలు ఒకటిన్నరేళ్లు మాత్రమే సాగుతాయన్నారు. తర్వాత నూటికి వెయ్యిశాతం మనమే గెలిచి, ఇక్కడినుంచే రాష్ట్రంలో జైత్రయాత్ర ప్రారంభిస్తామని ధైర్యం చెప్పారు.


‘ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటా’ అన్నారు. పాతవారి అనుభవంతోపాటు కొత్తరక్తాన్నీ ఎక్కించాల్సిన అవసరం పార్టీకి ఉందని, ఆ పని త్వరలోనే జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు అమరనాథ రెడ్డి, పులివర్తి నాని, శంకర్‌యాదవ్‌, గాలి భానుప్రకాష్‌, పీఎస్‌ మునిరత్నం, చౌడప్ప, గోపీనాథ్‌, రాజ్‌కుమార్‌, సత్యేంద్రశేఖర్‌, హేమాంబరగౌడ్‌, మునిరాజు, బేటప్పనాయుడు, బాబు, విజయకుమార్‌రెడ్డి, నందిగం ఉదయకుమార్‌, విశ్వనాథ నాయుడు, నాగరాజు, ఆంజినేయరెడ్డి, మునస్వామి, పట్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు.


ఈ ఓటమి అర్థం కావడం లేదు

‘నేను దారిపొడవునా గమనించా. కార్యకర్తల దండు ఎక్కడా కట్టుకదల్లేదు. అయినా ఎందుకీ ఓటమి సంభవించిందో అర్థం కావడం లేదు. టీడీపీ 22యేళ్లు పరిపాలించింది. జగన్‌ వచ్చి 20నెలలయింది. నేనిలాగా అప్పట్లో సంపాదనకే ప్రాముఖ్యమిచ్చి వుంటే ఇటువంటి రాజకీయాలు ఎన్ని చేసి వుండేవాడిని. జగన్‌ని ఇలాగే వదిలేస్తే అన్ని రాష్ర్టాల్లో ఇదే సంస్కృతి ప్రబలి దేశం సర్వనాశనమవుతుంది’ అని చంద్రబాబు విమర్శించారు. 


త్రిమూర్తులకు క్లీన్‌చిట్‌ 

కుప్పం రూరల్‌ మండల కార్యకర్తల సమావేశంలో త్రిమూర్తులకు చంద్రబాబు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు లొంగలేదన్నారు. పీఎస్‌ మునిరత్నానిది పెద్దతరహా రాజకీయాలంటూ వెకేసుకొచ్చారు. మనోహర్‌ తనవద్ద 35యేళ్లుగా పీఏగా  సమర్థంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఒకవేళ కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగివుంటే సమీక్షించి న్యాయం చేస్తామని సమాధానపరచడానికి ప్రయత్నించారు.


చంద్రన్నకు జన ఘన నీరాజనం

కుప్పం: చాలాకాలం తరువాత సొంత నియోజకవర్గానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం ప్రజలు ఘనస్వాగతం పలికారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బిసానత్తం వద్ద గుడుపల్లె మండలంలోకి ప్రవేశించిన చంద్రబాబు, అక్కడినుంచి ఓపెన్‌ టాప్‌ వాహనమెక్కి గుడుపల్లె దాకా రోడ్‌ షో చేశారు. బిసానత్తం, అత్తినత్తం, సాలచింతనపల్లె, ఆవుల తిమ్మనపల్లె, గుడిచెంబగిరి, రైల్వే స్టేషన్‌ కూడళ్లలో గుంపులు కూడిన జనం ఆయనకు కర్పూర హారతులు పట్టి, పుష్ప వర్షాలు కురిపించి ఘనస్వాగతం పలికారు. సొంత నియోజకవర్గ ప్రజల అభిమానం చూసి పులకించిన బాబు, అడుగడుగునా వాహనం దిగి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అత్తినత్తంలో రత్నమ్మ అనే వృద్ధురాలికి చంద్రబాబును చూస్తూనే కన్నీరాగలేదు. ‘ఎందుకేడుస్తున్నావమ్మా.. వొద్దు.. ధైర్యంగా ఉండాలి’ అని కిందికి దిగి మరీ ఆమెకు ధైర్యం చెప్పారు బాబు.


‘మాకెంత చేశావు చంద్రన్నా నువ్వు. అయినా పంచాయతీ ఎన్నికల్లో మన పార్టీని ఓడించాం. నాకు చాలా బాధగా ఉందం’టూ ఆమె చంద్రబాబును పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొడతనపల్లెలో మరో మహిళ కూడా పార్టీ ఓటమిని తట్టుకోలేక బాబును చూస్తూనే కన్నీళ్లు కార్చారు. ఆమెకు సైతం ఆయన ధైర్యం చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమేనని మనకు కావాల్సినవన్నీ చేసుకుందామని భరోసా ఇచ్చారు. సాలచింతనపల్లెలో ఓ వీరాభిమాని బాబును చూస్తూనే, పంచాయతీ ఎన్నికల్లో పార్టీని ఓడించి ఆయనకు అపఖ్యాతి తెచ్చామన్న ఆవేదనతో తనతోపాటు సీసాలో తెచ్చుకున్న పెట్రోలును మీద పోసుకోవడానికి ప్రయత్నించగా వాహనంపైనుంచే చంద్రబాబు వారించారు. ఎటువంటి అఘాయిత్యం చేసుకోవద్దని, అండగా తానున్నానని భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. సాలచింతనపల్లె సమీపంలో ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లి బాబు ప్రత్యేక పూజలు చేశారు. కొడతనపల్లె వద్ద నూతన వధూవరులను ఆశీర్వదించారు.


హోరెత్తిన కార్యకర్తలు..

చంద్రబాబు పర్యటన మొత్తం పార్టీ కార్యకర్తలు హోరెత్తారు. భారీ జెండాలు పట్టుకుని, ద్విచక్ర వాహనాలపై రోడ్‌ షో పొడవునా బారులు తీరి పయనించారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అనే నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. డ్యాన్సులు చేస్తూ ఊరేగింపులు తీశారు. అంతేకాదు.. చంద్రబాబు కాన్వాయ్‌ వెంట ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా వాహనాల శ్రేణి కనిపించింది. బాబు పర్యటన మొత్తం పసుపు సంద్రం పరవళ్లు తొక్కింది. తొలుత చంద్రబాబుకు కర్ణాటక సరిహద్దు వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. పూల బొకేలు ఇచ్చి, పూల హారాలు వేసి స్వాగత సత్కారాలు చేశారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులతోపాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నేతలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


కుప్పంలో తట్ట మన్నేశారా?

వైసీపీ అధికారంలోకి వచ్చి ఇరవై నెల్లైనా కుప్పంలో ఒక తట్ట మన్నేసి ఏదైనా అభివృద్ధి పని చేశారా అని అధికార పార్టీని చంద్రబాబు నిలదీశారు. ‘నేను కూర్చున్న ఈ దేవాలయం కట్టింది ఎవరు? అదిగో ఆ కాలేజీ నిర్మించింది ఎవరు? ద్రావిడ వర్శిటీ తీసుకొచ్చింది ఎవరు? ఇది మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు. చేతనైతే మంచి పనులు చేసి ఎన్నికలకు వెళ్లాలి కానీ, ప్రలోభాలు, బెదిరింపులతో కాదని హితవు పలికారు.  ‘డబ్బుకు ఆశ పడొద్దు. భయపెడితే భయపడొద్దు. మీకు నేనున్నా. ఇప్పుడేవో భయాలకు, ప్రలోభాలకు లొంగితే తీవ్ర నష్టం జరుగుతుంది. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు చూడండి’ అని ప్రజలకు హితబోధ చేశారు. మొదట్లో తాను కుప్పం వచ్చినపుడు అంతా మంచివారుగా ఉన్నారని, నాగరికత పెరిగే కొద్దీ విభ్నిమైన ఆలోచనలు, వేర్వేరు వ్యవహార శైలి గల ప్రజలు ఎక్కువైపోయారని నిష్టూరమాడారు. 

Updated Date - 2021-02-26T07:20:34+05:30 IST