Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 24 May 2022 04:05:50 IST

ప్రతి 30 గంటలకు కొత్త బిలియనీర్‌

twitter-iconwatsapp-iconfb-icon

కరోనా సంక్షోభ కాలంలో  వేగంగా పెరిగిన ప్రపంచ కుబేరులు


ఈ ఏడాది ప్రతి 33 గంటలకు 

10 లక్షల మంది కడు పేదరికంలోకి.. 

ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక వెల్లడి 


దావోస్‌: కరోనా సంక్షోభం, ధరల దండయాత్రతో ప్రపంచంలో ఆర్థిక తారతమ్యాలు మరింత పెరిగాయని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో ‘ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌’ పేరుతో ఆక్స్‌ఫామ్‌ రిపోర్టును విడుదల చేసింది. కొవిడ్‌ కష్ట కాలంలో ప్రతి 30 గంటలకు కొత్త బిలియనీర్‌ పుట్టుకొచ్చినట్లు నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఏడాది ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి జారుకోవచ్చని హెచ్చరించింది. అంతేకాదు, గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్న డూ లేనంత వేగంగా నిత్యావసరాల ధరలు పెరగగా.. ఆహారం, ఇంధన రంగాలకు చెందిన పారిశ్రామిక బిలియనీర్ల సంపద ప్రతి రెండు రోజులకో బిలియన్‌ డాలర్ల చొప్పున పెరిగిందని రిపోర్టు తెలిపింది. 

కరోనా వ్యాప్తి కారణంగా రెండేళ్లకు పైగా కాలం తర్వాత డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు జరుగుతోంది. ఈ కష్టకాలంలో సంపద అనూహ్యంగా పెరిగినందుకు గాను ఉత్సవం చేసుకునేందుకు బిలియనీర్లు దావోస్‌ చేరుకుంటున్నారని, కరోనా సంక్షోభం.. ఆ తర్వాత భారీగా పెరిగిన ఆహార, ఇంధన ధరలు వారికి బొనాంజా అని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గాబ్రియెలా బుచెర్‌ అన్నారు. కనీసం 100 కోట్ల డాలర్ల (రూ.7,750 కోట్లు) సంపద కలిగిన వారిని బిలియనీర్‌గా పిలుస్తారు. ఆక్స్‌ఫామ్‌ నివేదికలోని మరిన్ని వివరాలు.


కరోనా ప్రారంభ సంవత్సరమైన 2020లో 573 మంది కొత్తగా బిలియనీర్లుగా అవతరించారు. అంటే, ప్రతి ముప్ఫై గంటలకు ఒక బిలియనీర్‌ పుట్టుకొచ్చారన్నమాట. 

ఈ ఏడాది 26.3 కోట్ల మంది, అనగా ప్రతి 33 గంటలకు దాదాపు పది లక్షల మంది పేదరికంలోకి జారుకోవచ్చు. 

కరోనా సంక్షోభం మొదలైన తొలి 24 నెలల్లో బిలియనీర్లు ఆర్జించిన సంపద.. మొత్తం 23 ఏళ్ల సంపాదన కంటే అధికం. 

ప్రపంచ కుబేరుల మొత్తం సంపద గ్లోబల్‌ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000 సంవత్సరంలో ఈ వాటా 4.4 శాతంగా ఉండగా.. గడిచిన 22 ఏళ్లలో మూడింతలైంది. 

ఇంధనం, ఆహారం, ఫార్మా రంగంలో కంపెనీల గుత్తాధిపత్యం కలిగిన కంపెనీలు రికార్డు గరిష్ఠ లాభాలు నమోదు చేసుకుంటుండగా, వేతనాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కరోనా సంక్షోభ నేపథ్యంలో దశాబ్ద స్థాయి గరిష్ఠ ధరలతో కార్మికులు సతమతం అవుతున్నారు. 

ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన దిగ్గజాలైన బీపీ, షెల్‌, టోటల్‌ ఎనర్జీస్‌, ఎక్సాన్‌, షెవ్రాన్‌ కంపెనీల మొత్తం లాభం ప్రతి సెకనుకు 2,600 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో ఆహార రంగం నుంచి 62 మంది బిలియనీర్లున్నారు. కార్గిల్‌, మరో మూడు కంపెనీలు కలిసి ప్రపంచ అగ్రి మార్కెట్లో 70 శాతం వాటాను శాసిస్తున్నాయి. కార్గిల్‌ కంపెనీ ప్రమోటర్ల కుటుంబంలో కరోనాకు ముందు 8 మంది బిలియనీర్లుండగా.. ప్రస్తుతం 12కు పెరిగింది. 

కరోనా కాలంలో ఫార్మా రంగంలో 40 మంది బిలియనీర్లుగా అవతరించారు. మోడెర్నా, ఫైజర్‌ వంటి బడా ఔషధ తయారీ కంపెనీలు ప్రతి సెకనుకు వెయ్యి డాలర్ల లాభాన్ని ఆర్జించాయి. జెనరిక్‌ ఔషధ ధర కంటే ఆ కంపెనీలు 24 రెట్ల వరకు  అధికంగా వసూలు చేస్తున్నాయి. అల్పాదాయ దేశాల్లోని 87 శాతం ప్రజలకిప్పటికీ రెండో డోసు కొవిడ్‌ టీకాలు అందలేదు. గడిచిన రెండేళ్లలో కొవిడ్‌ కారణంగా 2 కోట్లకు పైగా చనిపోయి ఉండవచ్చని అంచనా. 

శ్రీలంక నుంచి సూడాన్‌ వరకు ప్రస్తుతం జరుగుతున్న సామాజిక, రాజకీయ తిరుగుబాటుకు భగ్గుమంటున్న ధరలే కారణం.అల్పాదాయ దేశాల్లో 60 శాతం రుణ సంక్షోభంలోకి జారుకునేలా ఉన్నాయి. 

ధనిక దేశాలతో పోలిస్తే.. పేద దేశాల్లోని ప్రజలు ఆహారం కోసం తమ ఆదాయంలో రెట్టింపునకు పైగా ఖర్చు చేస్తున్నారు. 

ప్రపంచంలోని 2,668 బిలియనీర్ల మొత్తం సంపద 12.7 లక్షల కోట్ల డాలర్లు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 3.78 లక్షల కోట్ల డాలర్లు పెరిగింది. ప్రపంచంలోని టాప్‌-10 కుబేరుల ఆస్తి.. ప్రపంచ జనాభాలోని దిగువ 40 శాతం (310 కోట్ల మంది)  కలిగి ఉన్న మొత్తం సంపద కంటే అధికం. టాప్‌ -20 బిలియనీర్ల ఆస్తి విలువ.. సబ్‌ సహారా ఆఫ్రికా జీడీపీ కంటే అధికం. 

ప్రపంచ జనాభాలోని శిఖరాగ్రాన ఉన్న ఒక శాతానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది సంపాదనకు సమానంగా ఆర్జించాలంటే, దిగువ 50 శాతానికి చెందిన కార్మికుడు 112 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. 

ధనికులపై సంపద పన్ను విధించాలి. మిలియనీర్లపై 2 శాతం, బిలియనీర్లపై 5 శాతం సంపద పన్ను విధించడం ద్వారా ఏటా 2.52 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతుంది. ప్రపంచంలోని 230 కోట్ల మందిని పేదరికం సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఈ పన్ను ఆదాయం సరిపోతుంది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.