యువత సాధికారతకు కొత్త విధానం

ABN , First Publish Date - 2022-06-08T07:15:22+05:30 IST

నూతన జాతీయ యువజన విధానం (2021) రూపకల్పన కీలక దశలోకి ప్రవేశించింది. అరవై ఐదు పుటల నిడివి గల నాలుగవ జాతీయ యువజన విధాన ముసాయిదాను (నేషనల్ యూత్ పాలసీ 2021) కేంద్ర యువజన వ్యవహారాలు...

యువత సాధికారతకు కొత్త విధానం

నూతన జాతీయ యువజన విధానం (2021) రూపకల్పన కీలక దశలోకి ప్రవేశించింది. అరవై ఐదు పుటల నిడివి గల నాలుగవ జాతీయ యువజన విధాన ముసాయిదాను (నేషనల్ యూత్ పాలసీ 2021) కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరచి సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. జూన్ 13లోగా సూచనలు పంపాలి. అభిప్రాయ సేకరణ తరువాత సంప్రదింపులను జరిపి మార్పులు చేర్పులతో కూడిన విధానపత్రాన్ని క్యాబినెట్ ఆమోద ముద్రతో ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. 


ఈ విధానం 2030 వరకు యువజనాభివృద్ధిని సాధించే దిశగా ప్రణాళికను సిద్ధం చేసింది. తన లక్ష్యాలను స్థిరాభివృద్ధి లక్ష్యాలకు (ఎస్‌డీజీ) సమాంతరంగా రూపకల్పన చేసింది. మునుపటి విధానాల వలే నాలుగవ విధానం కూడా 1) విద్య, 2) ఉపాధి, వ్యాపార నిర్వహణ (ఆంత్రోప్రెన్యూర్షిప్) – ఇందులోనే నైపుణ్యాభివృద్ధి చేర్చబడింది, 3) ఆరోగ్యం, దేహదారుఢ్యం, క్రీడలు, 4) నాయకత్వ లక్షణాభివృద్ధి, 5) సామాజిక న్యాయం లాంటి కీలక రంగాలలో యువత సాధికారతకై కట్టుబడింది. గత విధానాలు సామాజిక న్యాయాన్ని ప్రత్యేక రంగంగా పరిగణించలేదు.


విద్యా రంగంలో సమూలమైన మార్పులకై ఉద్దేశించబడిన నూతన విద్యావిధానం (2020)లో ముఖ్యాంశాలన్నింటికీ నూతన యువజన విధానం కట్టుబడి ఉంటుందని ముసాయిదా ప్రకటించింది. నీట్ (నాట్ ఇన్ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ – ఎన్ఈఈటీ) అంటే ఉపాధి, విద్య, శిక్షణలు పొందకుండా ఉన్న శ్రేణిలో మగ్గుతున్న యువతపై ముసాయిదా ప్రత్యేక దృష్టిని సారించింది. గత దశాబ్ద కాలంలో ఈ సమూహంలో పెరుగుతున్న యువత సంఖ్య ప్రపంచ దేశాలను కొంత ఆందోళనకు గురిచేస్తున్నది. వీరికి తగు విద్య, ఉపాధి అవకాశాలను కల్పించాలని 2021 విధానం సంకల్పించింది. స్టెమ్ (ఎస్‌టీఈఎమ్ – సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్) చదువులలో విద్యార్థినుల సంఖ్య పెంపుదల, ఆదివాసీ భాషల్లో విద్యాబోధనకై ఏర్పాట్లు, సమాజ సేవలో పాల్గొనే యువతకు స్కాలర్‌షిప్పులు, పాఠ్య ప్రణాళికలో సామాజిక న్యాయం చేర్పు లాంటి ఆలోచనలు, పథకాలను ముసాయిదా ప్రస్తావించింది.


ఉపాధి కల్పన విషయంలో నూతన విధానం నైపుణ్యాభివృద్ధిపైనే కేంద్రీకరించింది. చిన్న మధ్యస్థ వ్యాపారాల (ఎస్ఎమ్ఈ) సముదాయాల సృష్టి, సూక్ష్మ చిన్న మధ్యస్థ (ఎమ్ఎస్ఎమ్ఈ) వ్యాపారాలకై ఉద్దేశించబడిన భారత్ క్రాఫ్ట్ ఈ మార్కెట్ ప్లేస్ పథకాన్ని పరిపుష్టి చేయడం, హరిత ఉద్యోగాల (గ్రీన్ జాబ్స్) సృష్టి, వైద్య సంబంధిత పర్యాటక రంగంలో (మెడికల్ టూరిజం) ఉపాధి కల్పన, ఎస్సీ, ఎస్టీలతో పాటు, ఎల్‌జీబీటీ సమూహాలకు చెందిన యువతకు ఉపాధి కల్పన– ముసాయిదాలో చోటుచేసుకున్నాయి. నాయకత్వ లక్షణాల పెంపుదలపై విధానం ఎక్కువ శ్రద్ధ వహించింది. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా యువత తమ నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకోవచ్చని దృఢంగా నమ్మినట్లు తేటతెల్లమౌతుంది. కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో ఆన్‌లైన్‌లో వేల మంది యువతీ యువకులు తమ సేవలందించిన కారణంగా రాజకీయ చైతన్యంతో కాక స్వచ్ఛంద సేవ ద్వారా మాత్రమే నాయకత్వ లక్షణాలు అబ్బుతాయని ప్రభుత్వాలు విశ్వసించడం సహజమే. జాతీయ యువ పార్లమెంటులు మెరుగ్గా నిర్వహించడానికి ఒక శాశ్వత సెక్రటేరియట్ స్థాపన, ప్రధానమంత్రి జాతీయ యువ స్వచ్ఛంద సేవ ఫెలోషిప్ వితరణ, యువతకు సామాజిక ఆడిట్ (అభివృద్ధి కార్యక్రమాలు పథకాల అమలులో) నిర్వహణ బాధ్యత అప్పగించడం లాంటి వినూత్న ఆలోచనలకూ శ్రీకారం చుట్టింది ముసాయిదా.


యువత ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, క్రీడలకు గత విధానాలకన్నా ఎక్కువ ప్రాధాన్యత లభించింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లేదా కనీసం నాలుగైదు కేంద్రాలలో ఒక మానసిక వైద్యుడు లేదా కౌన్సిలర్‌లను నియమించి యువత మానసిక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడం, మాదకద్రవ్య సేవనకు వ్యతిరేకంగా చైతన్యాన్ని పెంపొందించడం, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి క్రీడా సంబంధిత కార్యక్రమాలను యువతకు చేరువ చేయడం, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, యువతులకు, బాలికలకు ఋతుస్రావ సమస్యలు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం 2021 విధానం అజెండాలో ప్రాధాన్యతాంశాలుగా చోటుచేసుకున్నాయి. సామాజిక న్యాయాన్ని అన్ని వర్గాల యువతకు అందించాలని సంకల్పించింది ఈ విధానం.


ముసాయిదాలో అమితంగా పెరిగిన యువ జనాభా దాని పర్యవసానాలపై పరిమితంగానైనా ఉపోద్ఘాతాన్ని చేర్చవలసింది. నాయకత్వ లక్షణాల అభివృద్ధి విషయంలో యువజన సంస్కృతులను ప్రస్తావించివుంటే చర్చ పరిపూర్ణమయ్యేది. ముసాయిదాలో ఉపయోగించిన పదజాలం కొంత పేలవంగా – ఆధునిక సామాజిక శాస్త్ర పరిభాష కానిది – గోచరించక మానదు. అక్కడక్కడా చర్చను అవసరానికి మించి సాగదీసిన భావం పాఠకులకు కలుగుతుంది. మొత్తానికి ఈ ముసాయిదా యువజనుల జీవితాలతో ముడిపడిన అన్ని అంశాలను స్పృశించిందని చెప్పక తప్పదు.

డా. కొట్టు శేఖర్

Updated Date - 2022-06-08T07:15:22+05:30 IST