UAE: యూఏఈలో కొత్త నిబంధనలు.. ఇకపై కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోతే అంతే సంగతులు

ABN , First Publish Date - 2022-07-28T16:46:09+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తాజాగా తన వేతన రక్షణ వ్యవస్థ (Wages Protection System)లో కొత్త సవరణలు చేసింది.

UAE: యూఏఈలో కొత్త నిబంధనలు.. ఇకపై కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోతే అంతే సంగతులు

అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తాజాగా తన వేతన రక్షణ వ్యవస్థ (Wages Protection System)లో కొత్త సవరణలు చేసింది. ఈ కొత్త సవరణల ప్రకారం ఇకపై సంస్థలు వాటిలో పనిచేసే కార్మికులకు జీతాలు (Salaries), ఇతర చెల్లింపులను సకాలంలో చేయాల్సిందే. లేనిపక్షంలో సంబంధిత మంత్రిత్వశాఖ నుంచి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఆ దేశ మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రి డా. అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్‌మనన్ అల్ అవర్ వెల్లడించారు. మంత్రిత్వశాఖ నోటీసులకు స్పందించి సదరు సంస్థ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ సంస్థకు కొత్త వర్క్ పర్మిట్ల (New Work Permits) జారీని నిలిపివేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో భారీ జరిమానాలు (Fines) కూడా విధించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని సంస్థలు కావాలనే కార్మికులకు ఏళ్ల తరబడి వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త సవరణలు చేసినట్లు మంత్రి అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్‌మనన్ తెలిపారు. నెల మొత్తం పని చేశాక కార్మికులకు సకాలంలో వేతనాలు అందకపోతే సమస్యగా ఉంటుందని, కష్టజీవుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సవరణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.   

Updated Date - 2022-07-28T16:46:09+05:30 IST