Abn logo
Sep 24 2020 @ 01:10AM

కొత్త ‘వ్యవసాయ’ విపత్తులు!

Kaakateeya

మన ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను సంరక్షించినంతగా ప్రపంచంలో మరే దేశమూ సంరక్షించలేదు. మన వ్యవసాయరంగ అభివృద్ధి నమూనాను నిఖిల లోకమూ ప్రశంసించింది. దానిని ఒక ఆదర్శంగా తీసుకున్నది. ఆ స్ఫూర్తిదాయక చరిత్ర వెలుగుల్లో కొత్త వ్యవసాయ బిల్లులు ప్రాసంగికత లేనివని స్పష్టంగా చెప్పవచ్చు. ఉపయుక్తత కొరవడిన బిల్లులు వ్యవసాయ రంగానికి ఎలా మేలు చేస్తాయి? వాటి వల్ల రైతుల శ్రేయస్సుకు ప్రమాదం వాటిల్లనున్నది. అయితే వ్యవసాయం విషయంలో తమకు వున్న రాజ్యాంగబద్ధ అధికారాలను ఉపయోగించుకుని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రాలకు ఎంతైనా అవకాశమున్నది.


మనదేశం స్వాతంత్ర్యం పొందిన అనంతరం రెండు దశాబ్దాల కాలంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో 74 దేశాలు వలస పాలన నుంచి విముక్తి పొందాయి. భారత్‌తో సహా ఈ దేశాలన్నీ తమ ఆహార అవసరాలలో తీవ్ర లోటు నెదుర్కొన్నాయి. పలు దేశాలలో ఈ ఆహార లోటు 40 నుంచి 60 శాతం మేరకు ఉండేది. అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలపై ఈ పేదదేశాలు ఆధారపడి ఉండేవి. మన దేశం సైతం ఒక దశలో ‘ఫ్రమ్ షిప్ టు మౌత్’ (నౌక నుంచి నోటికి) దుస్థితిని చవి చూసింది. దైనందిన ఆహార అవసరాలకు పూర్తిగా విదేశాలపై ఆధారపడడమనేది 1950, 1960 దశకాలలో చాలా అధికంగా ఉండేది. ఈ దురవస్థ నుంచి భారత్ శీఘ్రగతిన బయటపడింది. 1983 నాటికల్లా సంపూర్ణ ఆహారభద్రతను సమకూర్చుకున్నది. స్వాతంత్ర్యానంతరం మొదటి పాతిక సంవత్సరాలలోనే ఆహారోత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుకోవడం ద్వారా సంపూర్ణ ఆహారభద్రతను సాధించుకున్నది. వ్యవసాయరంగ అభివృద్ధికి ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించుకుని, పటిష్ఠంగా అమలుపరచడం ద్వారా ఆహారరంగంలో భారత్ అసాధారణ పురోగతి సాధించగలిగింది. ఆ సమగ్రవ్యవసాయాభివృద్ధి వ్యూహంలోని వివిధ అంశాలకు సంబంధించిన వివరాలు మొదటి ఐదు పంచవర్ష ప్రణాళికల పత్రాలలో ఉన్నాయి. ఆ పంచవర్ష ప్రణాళికల కాలంలో ప్రణాళికా సంఘంలో సభ్యుడు, హరిత విప్లవ సాధనలో ప్రొఫెసర్ స్వామినాథన్‌తో కలిసి కృషి చేసిన తెలంగాణ ఆర్థిక విజ్ఞాని ప్రొఫెసర్ చెన్నమనేని హనుమంతరావు ఆ మహత్తర పురోగతికి ఒక సజీవ సాక్షి. 


వ్యవసాయరంగంలో భారత్ ఆదర్శప్రాయ అభ్యున్నతికి దోహదం చేసినదేమిటి? రైతు -కేంద్రిత ప్రభుత్వ విధానాలు. వ్యవసాయదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం పలువిధాల భరోసా కల్పించింది. వ్యవసాయ వ్యవస్థల క్రమబద్ధీకరణ, పంటలకు కనీస మద్దతుధర మొదలైనవి ఈ భరోసాలలో భాగమే. భారతీయ వ్యవసాయరంగం, భారతీయ రైతాంగ ఆర్థికవ్యవస్థ అసాధారణ పురోగతి సాధించినప్పటికీ వాటికి ప్రభుత్వం తన మద్దతును, ప్రత్యేక సహాయసహకారాలను ఉపసంహరించుకునే పరిస్థితి లేదు. విపణిశక్తుల విన్యాసాలలో కిందు మీదులవుతూ సుస్థిరంగా నిలబడగల పరిణతిని భారతీయ వ్యవసాయరంగమూ, భారతీయ రైతాంగ ఆర్థికవ్యవస్థ ఇంకా సంతరించుకోలేదు. కనుకనే, మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు ఇది సరైన సందర్భం కాదని చెప్పవలసివస్తోంది. ఆ అకాల బిల్లులు దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపడం ఖాయం. అనివార్యంగా రైతుల జీవితాలు మరింతగా సమస్యల పాలు కానున్నాయనే వాస్తవం జాతి హితులను కలవరపెడుతోంది. కొత్త వ్యవసాయబిల్లులు కార్పొరేట్‌రంగ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయి. రాజకీయాలు, భావజాలాలను పక్కన పెట్టి గత, ప్రస్తుత చట్టాలతో పోల్చి చూడవలసిన అవసరముంది. వాటి ప్రభావాలు, పర్యవసానాలను నిశితంగా, నిష్పాక్షికంగా, మేధో నిబద్ధతతో చర్చించవలసి ఉంది. 


వ్యవసాయరంగం అద్వితీయమైనది. ప్రకృతి ప్రేరితమైనది. నిర్దిష్ట నైసర్గికత దాని విశిష్టత. ఇది విస్మరించలేని, విస్మరించకూడని వాస్తవం. ఆసేతు హిమాచలం 15 కోట్లకు పైగా కుటుంబాలకు వ్యవసాయరంగమే జీవనాధారంగా ఉన్నది. ఆర్థికవ్యవస్థలో మిగతా రంగాల కంటే వ్యవసాయం పూర్తిగా భిన్నమైంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ దృక్కోణాలలో దేని నుంచి చూసినా వ్యవసాయరంగ అనన్యత స్పష్టమవుతుంది. కనుకనే కీర్తిశేషుడు పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలను ప్రారంభించినప్పుడు వ్యవసాయ రంగం విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించారు. 1990 దశకంలో ఆర్థికవ్యవస్థను మౌలికంగా పునర్వ్యవస్థీకరిస్తూ రైతు వ్యతిరేక విధానాలకు ఆయన ఎలాంటి ఆస్కారమివ్వలేదు. ఎట్టి పరిస్థితులలోనూ వాటిని అనుమతించలేదు. ఒక జాతి-ఒక విద్య, ఒక దేశం-ఒక ఆరోగ్య విధానం పని చేయవచ్చునేమో కానీ ఒక దేశ్-ఒక వ్యవసాయం అనేది మన దేశంలో ఫలించదు గాక ఫలించదు. వ్యవసాయరంగం నైసర్గికపరంగా నిర్దిష్టమైనది, విలక్షణమైనది. వేర్వేరు ప్రాంతాల వ్యవసాయం భిన్న అవసరాలు, విభిన్న ప్రత్యేకతలను కలిగిఉంటుంది. ఇదొక ప్రాకృతిక వాస్తవం. ఈ సహజసత్యం పట్ల సంపూర్ణ అవగాహనతోనే మన రాజ్యాంగ నిర్మాతలు వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితాలో పొందుపర్చారు. 


కొత్త వ్యవసాయ బిల్లుల రాజ్యాంగబద్ధత సందిగ్ధమైనదని నేను విశ్వసిస్తున్నాను. సంబంధిత బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించ లేదు. వ్యవసాయరంగ అద్వితీయతను, భారతీయ రైతుల విశిష్టతలను మనం అర్థం చేసుకోవలసి ఉంది. ఆర్థికవ్యవస్థలోని మిగతా రంగాలతో వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితులతోనూ పోల్చ కూడదు. కొత్త వ్యవసాయ బిల్లులు రైతుల ప్రయోజనాలకు హానికరమైనవి. అన్నదాతల శ్రేయస్సుకు విఘాతాలు. వ్యవసాయేతర సరుకులు, సేవల ఉత్పత్తిదారుల వలే కాకుండా రైతులు తమ ఉత్పత్తులకు వచ్చిన, ఇచ్చిన ‘ధరలు తీసుకొనే వారు’ మాత్రమే. వ్యవసాయేతర సరుకుల ఉత్పత్తిదారులు మాత్రం తమ ఉత్పత్తులకు ‘ధరల నిర్ణేతలు’. వాళ్లు తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించుకోగలరు. సొంత పట్టణంలోనూ, సొంత రాష్ట్రంలోనూ, సువిశాల దేశమంతటా ఎక్కడైనా సరే అమ్ముకోగలరు. అవసరమైతే విదేశాల్లో కూడా విక్రయించగలరు. ఆంక్షలు ఎత్తివేసినా ఎటువంటి సమస్య ఉండబోదు. ఈ కారణంగానే 1990వ దశకంలో పీవీ నరసింహారావు వ్యవసాయేతర ఆర్థికరంగాలలో సంస్కరణలను దిగ్విజయంగా అమలుపరిచారు. 


వ్యవసాయ ఉత్పత్తిదారుల విషయం భిన్నమైనది, ప్రత్యేకమైనది. ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరి. తమ దిగుబడులకు ధరలను నిర్ణయించలేని రైతులు ఎప్పుడూ స్వార్థపూరిత వ్యాపారుల చేతిలో బాధితులుగానే మిగిలిపోతున్నారు. కనీస మద్దతుధర కల్పించడం, ఎఫ్‌సిఐ లాంటి ప్రభుత్వ సంస్థల ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయోత్పత్తులను సేకరించడం, వ్యవసాయోత్పత్తుల విక్రయాలకు మార్కెట్‌ యార్డులవంటి నిర్దిష్ట ప్రదేశాలు ఏర్పాటు చేయటం చాలా అవసరం. రైతు శ్రేయస్సుకు అవి ప్రాథమిక భరోసాలు. ఈ అవగాహనతోనే గత ప్రభుత్వాలు రైతులకు సంక్షేమానికి అనువైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఎంతటి ఆపత్సమయాలలోనూ రైతుల ప్రయోజనాలను అవి విస్మరించ లేదు. యూపీఏ రెండో ప్రభుత్వ హయాంలో పార్లమెంటు పరిశీలనకు వచ్చిన బిల్లులను ఏడుగురు ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ కే చెందిన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రపదేశ్ ముఖ్యమంత్రి కూడా వారిలో ఒకరు. విత్తనాల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ఒక గౌరవసభ్యుడు, భారతీయ వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగం మింగివేసేందుకు ఈ బిల్లు అనుమతిస్తుందని వాఖ్యానించారు. ఆ బిల్లును, కూలంకష చర్చ అనంతరం ఉపసంహరించుకున్నారు.  


మోదీ సర్కార్‌ పార్లమెంట్‌ ఆమోదం పొందిన కొత్త బిల్లులు వ్యవసాయరంగంలో సంపూర్ణ కార్పొరేటీకరణకు వీలుకల్పిస్తాయి. కనీసమద్దతు ధర విధాన స్ఫూర్తిని నీరుకార్చి వేస్తాయి. అంతిమంగా రైతులకు అందజేస్తున్న మద్దతును కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకునేందుకు కారణమవుతాయి. ఫలితంగా వ్యవసాయరంగం భవిష్యత్తులో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. అవి: 

కార్పొరేట్ సంస్థలు తొలుత మూడు లేదా నాలుగు సంవత్సరాల పాటు కనీస మద్దతుధర కంటే ఎక్కువ ధరనే ఇస్తాయి. రైతుల్ని ఆకట్టుకుని, వాళ్లు ఆందోళనలకు దిగకుండా చూడటానికి కంపెనీలు ఈ ఉదారతను చాటుకుంటాయి. కార్పొరేట్ సంస్థలు సదా అనుసరించే వ్యూహమిది. పరిస్థితులు సానుకూలమైన తరువాత ప్రభుత్వం కనీస మద్దతు ధరను, ఇతర రాయితీలను ఉపసంహరించుకుంటుంది.

కనీస మద్దతుధరను ఉపసంహరించుకోవడం లేదా మార్కెట్ ధర కంటే అధిక మద్దతుధరను ఇవ్వడాన్ని ఆపివేసినప్పుడు రైతులు తమ ఉత్పత్తులను కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన ధరలకే విక్రయించుకోవల్సిన దుస్థితిలో పడతారు. ప్రస్తుత మార్కెట్ యార్డులు, మండీలు నిరుపయోగకరంగా మిగిలిపోతాయి. 

కార్పొరేట్ కంపెనీలు ప్రతి ప్రాంతంలోనూ వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, నిల్వ చేసి, ఇతర ప్రాంతాలలో అధిక ధరకు విక్రయించి లబ్ధి పొందుతాయి. విదేశాలకు ఎగుమతి చేస్తాయి. ఇది ఆహార కొరతకు దారి తీస్తుంది. ధరలు పెరుగుతాయి. ఆహారపరంగా అభద్రత నెలకొంటుంది. వినియోగదారులపై పలువిధాలుగా ఆర్థిక భారం పడుతుంది. మొత్తంగా అది ఆర్థికవ్యవస్థకు హాని చేస్తుంది.

రైతులు, ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులు కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి ప్రవేశించడం అనివార్యమవుతుంది. కార్పొరేట్ కంపెనీలతో కాంట్రాక్టు కుదుర్చుకుని తమ సొంత భూముల్లోనే వ్యవసాయ కూలీలుగా మిగిలిపోతారు! 

రైతులు, కార్పొరేట్ కంపెనీల మధ్య కుదిరే కాంట్రాక్టుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదు. రైతులకు ప్రభుత్వ మద్దతు కొరవడడంతో ఆ కాంట్రాక్టులను ఉల్లంఘించేందుకు కంపెనీలు తప్పక సాహసిస్తాయి. రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి అధిక లాభార్జనకే ప్రాధాన్యమిస్తాయి. తెలంగాణలో రైతులు ఇప్పటికే విత్తన కంపెనీల నుంచి ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. 


కొత్త బిల్లులతో వ్యవసాయరంగ పరిస్థితులు తలకిందులవుతాయనడంలో సందేహం లేదు. ఆ పరిస్థితులో కూడా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రాలకు ఎంతో అవకాశముంది. ఇందుకు అవసరమైన అధికారాలను రాజ్యాంగమే రాష్ట్రాలకు కల్పిస్తోంది. రాష్ట్ర జాబితాలోని వ్యవసాయం, సంబంధిత అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చకుండానే కేంద్రం ఈ కొత్త వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చింది. 1976లో రాజ్యాంగానికి 42వ సవరణ చేసినప్పుడు అడవులు, విద్య, వన్యప్రాణుల సంరక్షణ మొదలైన అంశాలను కేంద్రం జాబితానుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చింది. ఇప్పుడు వ్యవసాయం, సంబంధిత అంశాల విషయంలో అటువంటి మార్పు ఏమీ చేయలేదు. కనుక వ్యవసాయం విషయంలో రాష్ట్రాలు తమకు గల రాజ్యాంగ బద్ధ అధికారాలను ఉపయోగించుకుని కొత్త బిల్లులు కలిగించే హాని నుంచి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవకాశముంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలు వివిధ వ్యవసాయోత్పత్తులకు ధరలను నిర్ణయించి, వాటిని అమలుపరిచేందుకు ఒక చట్టాన్ని తీసుకు రావాలి. ఏ కార్పొరేట్ సంస్థ లేదా వ్యాపారి కూడా ఈ నిర్ణీత ధరల కంటే తక్కువ ధలకు రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలులేకుండా ఆ చట్టంలో నిబంధనలు ఉండాలి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలలో రాష్ట్రాలు కూడా భాగస్వాములు కావాలి. 

ప్రొఫెసర్ ఎ.జానయ్య

ఆచార్య జయశంకర్ 

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

Advertisement
Advertisement
Advertisement