మరో 100సార్లు అయినా ఆ సింగిల్ మాత్రం తీయను.. శాంసన్ కామెంట్స్!

ABN , First Publish Date - 2021-04-17T11:03:04+05:30 IST

భారత భావితరం వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్లలో సంజూ శాంసన్ కూడా ఒకడు. ధోనీ రిటైర్‌మెంట్‌తో టీమిండియాలో ఏర్పడ్డ ఖాళీని రిషభ్ పంత్, శాంసన్‌లలో ఒకరే భర్తీ చేస్తారని అంతా భావించారు.

మరో 100సార్లు అయినా ఆ సింగిల్ మాత్రం తీయను.. శాంసన్ కామెంట్స్!

న్యూఢిల్లీ: భారత భావితరం వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్లలో సంజూ శాంసన్ కూడా ఒకడు. ధోనీ రిటైర్‌మెంట్‌తో టీమిండియాలో ఏర్పడ్డ ఖాళీని రిషభ్ పంత్, శాంసన్‌లలో ఒకరే భర్తీ చేస్తారని అంతా భావించారు. అయితే నెమ్మదిగా ఆ అవకాశం పంత్ వైపే మొగ్గు చూపుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యత శాంసన్‌కు, ఢిల్లీ సారధ్య బాధ్యతలు పంత్‌కు దక్కాయి. ఇలాంటి సమయంలో తాజాగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచులో అందరూ విఫలమై రాజస్థాన్ ఓటమి అంచుల వరకూ వెళ్లింది. ఆ సమయంలో సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (18 బంతుల్లో 36 నాటౌట్) విజృంభించి రాజస్థాన్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఇదే మోరిస్‌కు రాయల్స్ కెప్టెన్ శాంసన్ షాకిచ్చాడు. మ్యాచ్ చివర్లో శాంసన్, మోరిస్ క్రీజులో ఉన్నారు.


ఆ సమయంలో సింగిల్ అవకాశం వచ్చింది. అయితే అది తీస్తే మోరిస్‌కు స్ట్రైకింగ్ వస్తుంది. దీంతో మోరిస్ దాదాపుగా అవతల ఎండ్ క్రీజులోకి వచ్చేసినా కూడా శాంసన్ అతన్ని వెనక్కు పంపేశాడు. ఈ నిర్ణయం మోరిస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఆ ఆశ్చర్యం అతని మొహంలో స్పష్టంగా కనిపించింది. ఢిల్లీపై మోరిస్ మెరుపులు చూసిన అభిమానులు శాంసన్‌కు చురకలు వేశారు. మోరిస్‌కు గనుక అవకాశం ఇచ్చుంటే పంజాబ్‌పై కూడా రాజస్థాన్ గెలిచేదని విమర్శించారు. ఈ క్రమంలో వీరందరికీ శాంసన్ బదులిచ్చాడు. ఆ మ్యాచ్ మరో వందసార్లు జరిగినా సరే మోరిస్‌కు ఆ సింగిల్ మాత్రం ఇవ్వబోనని శాంసన్ స్పష్టం చేశాడు. ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా మోరిస్ ఒక్క సిక్సరైనా కొట్టాలని డ్రెస్సింగ్ రూమ్‌లో దేవుడిని ప్రార్థించానని పేర్కొన్నాడు. ఏదేమైనా శాంసన్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ యువ వికెట్ కీపర్‌కు సమస్యలు తెచ్చిపెట్టిందనడంలో మాత్రం సందేహం లేదు.

Updated Date - 2021-04-17T11:03:04+05:30 IST