సంతోషం, నిరాశ ఒకేసారి ఎన్నడూ ఎరుగను : పారాలింపియన్ సుహాస్

ABN , First Publish Date - 2021-09-05T18:54:30+05:30 IST

పారాలింపియన్ సుహాస్ యతిరాజ్‌కు ఏక కాలంలో

సంతోషం, నిరాశ ఒకేసారి ఎన్నడూ ఎరుగను : పారాలింపియన్ సుహాస్

న్యూఢిల్లీ : పారాలింపియన్ సుహాస్ యతిరాజ్‌కు ఏక కాలంలో సంతోషం, నిరాశ అనుభవంలోకి వచ్చాయి. ఇదివరకెన్నడూ ఇలా లేదని ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్4 ఈవెంట్ ఫైనల్‌లో ఆయనకు బంగారు పతకం చేజారి, రజత పతకం దక్కడంతో ఈ మిశ్రమ భావోద్వేగానికి గురయ్యాడు. 


భారత దేశ పారా షట్లర్ సుహాస్ యతిరాజ్ టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్4 ఈవెంట్ ఫైనల్‌లో ఆదివారం రజత పతకం సాధించాడు. ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మజుర్ చేతిలో పరాజయంపాలవడంతో బంగారు పతకం చేజారింది. 21-15, 17-21, 15-21 తేడాతో యతిరాజ్ పరాజయం చవి చూశాడు. సుహాస్ సాధించిన పతకంతో ఈ పారాలింపిక్స్‌లో భారత దేశ పతకాల సంఖ్య 18కి చేరింది. 


రజత పతకాన్ని సాధించిన తర్వాత సుహాస్ మాట్లాడుతూ, ‘‘ఏక కాలంలో చాలా సంతోషం, తీవ్ర నిరాశ కలిగిన సందర్భం గతంలో ఎన్నడూ లేదు. రజత పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది, తృటిలో బంగారు పతకం చేజారినందుకు నిరాశగా ఉంది’’ అని చెప్పాడు. 


సుహాస్ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఓ ఐఏఎస్ అధికారి పారాలింపిక్స్‌లో ఓ పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి ఐఏఎస్ అధికారిగా సుహాస్ రికార్డు సృష్టించారు.


Updated Date - 2021-09-05T18:54:30+05:30 IST