కమిన్స్ అలా దంచికొడతాడని ఊహించలేదు: రోహిత్‌శర్మ

ABN , First Publish Date - 2022-04-07T23:35:18+05:30 IST

ముంబైతో బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు పాట్ కమిన్స్ మైదానంలో సునామీ

కమిన్స్ అలా దంచికొడతాడని ఊహించలేదు: రోహిత్‌శర్మ

పూణె: ముంబైతో బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు పాట్ కమిన్స్ మైదానంలో సునామీ సృష్టించాడు. 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో ఏకంగా 56 పరుగులు చేసి ముంబై చేతి నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యపోయాడు. అతడు వచ్చి అలా ఆడతాడని ఊహించలేదని, ఆ క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుందని అన్నాడు.


కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు మాత్రమే చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. అయితే, చివరి నాలుగు ఓవర్లలో మాత్రం ఏకంగా 63 పరుగులు పిండుకుంది. కీరన్ పొలార్డ్ 5 బంతుల్లో 22 పరుగులు చేయడంతో అది సాధ్యమైంది. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తాము బ్యాట్‌తో తొలుత అంతగా రాణించలేకపోయామని, అయితే చివరి నాలుగు ఓవర్లలో స్కోరును 160 దాటించడం మాత్రం కచ్చితంగా గొప్ప విషయమని అన్నాడు.


కోల్‌కతా విజయానికి చివరి ఐదు ఓవర్లలో 35 పరుగులు అవసరం. అయితే, 16 ఓవర్‌లో పాట్ కమిన్స్ చెలరేగిపోయాడు. డేనియల్ శామ్స్ వేసిన ఆ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు పిండుకుని మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. 15వ ఓవర్ వరకు గేమ్ తమ చేతుల్లోనే ఉందని అయితే, పాట్ కమిన్స్ ఆటను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని అన్నాడు. ఈ లెక్కన జట్టుపై తాము మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-04-07T23:35:18+05:30 IST