భారత్‌ను ఎప్పటికీ తక్కువగా అంచనా వేయొద్దు: ఆస్ట్రేలియా హెడ్ కోచ్

ABN , First Publish Date - 2021-01-20T01:49:20+05:30 IST

భారత్‌తో గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టు తర్వాత ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌కు

భారత్‌ను ఎప్పటికీ తక్కువగా అంచనా వేయొద్దు: ఆస్ట్రేలియా హెడ్ కోచ్

బ్రిస్బేన్: భారత్‌తో గబ్బా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టు తర్వాత ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌కు జ్ఞానోదయం అయినట్టు ఉంది. ‘అమ్మో.. భారత్‌ను తక్కువగా అంచనా వేయొద్దు’ అని మనసులో మాటను బయటపెట్టేశాడు. ఈ సిరీస్ నుంచి తాను పాఠాలు  నేర్చుకున్నానని పేర్కొన్న లాంగర్.. ‘ఎప్పటికీ, ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని’ అన్నాడు.


ఆ దేశం (భారత్)లో చాలా కఠినమైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పుకొచ్చాడు. సిరీస్ విజయం సాధించిన భారత జట్టును లాంగర్ ప్రశంసించాడు. ఇది చాలా గొప్ప సిరీస్ అని, చివరికి ఒకరు విజేతలుగా, మరొకరు పరాజితులుగా నిలుస్తారని అన్నాడు. ‘‘ఈ రోజు టెస్టు క్రికెట్ విజయం సాధించింది. ఓటమి మమ్మల్ని బాధించినా, విజయానికి భారత జట్టు పూర్తిగా అర్హురాలే. ఈ గొప్పతనమంతా వారిదే. వారు చాలా గొప్పగా ఆడారు. మేం ఈ సిరీస్ నుంచి పాఠాలు నేర్చుకున్నాం’’ అని ‘చానల్ 7’తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.  


‘‘మొదటి విషయం ఏమిటంటే.. తొలుత దేనినీ తేలిగ్గా తీసుకోవద్దు. రెండోది.. ఎప్పటికీ, ఎప్పుడూ భారత్‌ను  తక్కువగా అంచనా వేయొద్దు. అక్కడ 1.5 బిలియన్ల మంది ఇండియన్లు ఉన్నారు. వారిలో 11 మందితో ఆడుతున్నప్పుడు మీరు మరింత కఠినంగా ఉండాలి, కాదంటారా?’’ అని ప్రశ్నించాడు. 


తాను భారత జట్టును పెద్దగా అభినందించబోనని  పేర్కొన్న లాంగర్, తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిందని, భారత జట్టును 30 పరుగులకే అవుట్ చేశామని గుర్తు చేశాడు. అయినప్పటికీ వారు తిరిగి పుంజుకుని, పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. ఆ గొప్పతనమంతా వారిదేనన్నాడు. దేనినీ తేలిగ్గా తీసుకోవద్దన్న గుణపాఠాన్ని ఈ సిరీస్ నుంచి తాము నేర్చుకున్నామని పేర్కొన్నాడు.  అలాగే, అద్భుతంగా  రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్‌ అద్భుతంగా పోరాడారని ప్రశంసించాడు.

Updated Date - 2021-01-20T01:49:20+05:30 IST