Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూట్రిన్‌ మధుసూదన్‌ రెడ్డి ఆకస్మిక మరణం

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 5: అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన న్యూట్రిన్‌ కన్ఫెక్షనరీ కంపెనీ, అనుబంధ సంస్థ నేచురో కంపెనీ అధినేత వారనాసి మధుసూదన్‌ రెడ్డి(73) ఆదివారం సాయంత్రం చిత్తూరు సత్యనారాయణపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. మధుసూదన్‌ హంస గ్రానైట్స్‌, బి.వి.రెడ్డి సెకండరీ గ్రేడ్‌ స్కూల్‌ను నెలకొల్పి పిల్లల చదువులకోసం తగిన సహాయం చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పులిచెర్ల మండలానికి రెండుసార్లు ఎంపీపీగా, ఒకసారి వైస్‌ఎంపీపీగా ఎన్నికై రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవలు చేసి మన్ననలు పొందారు. న్యూట్రిన్‌ ఫ్యాక్టరీ బాధ్యతలను పలు హోదాల్లో ఆయన సమర్థవంతంగా నిర్వర్తిస్తూ చాక్లెట్ల తయారీలో న్యూట్రిన్‌ కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిపారు. చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్లు ఉచితంగా అందజేశారు. సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల, కృష్ణవేణి జూనియర్‌ కళాశాలల్లో తరగతి గదులు కట్టివ్వడం, ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్ల ఏర్పాటు, పిల్లల పార్కు నిర్మించడం వంటివి న్యూట్రిన్‌ సామాజిక సేవలకు కొన్ని తార్కాణాలు.  హాకీ, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ వంటి ఆటల పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహించడం, ప్రోత్సహించడం, సైన్సు కార్యక్రమాలను ప్రోత్సహించడం, నగరంలో పలు సామాజిక కార్యక్రమాల నిర్వహణలో మధుసూదన్‌ రెడ్డి ముందుండేవారు. ఆయన మరణవార్త తెలియగానే పలువురు నగర ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా ఆయన స్వగృహానికి చేరుకుని మధుసూదన్‌ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. సోమవారం పులిచెర్లలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement