న్యుమోనియా చికిత్సతో నయం చేశాం

ABN , First Publish Date - 2020-03-26T09:06:08+05:30 IST

కరోనా బారిన హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌..! గత నెల చివర్లో ఈ విషయం గుప్పుమనడంతో ఒక్కసారిగా కలకలం..! రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు ఇదే కావడంతో...

న్యుమోనియా చికిత్సతో నయం చేశాం

  • యాంటిబయాటిక్స్‌, ఫ్లూయిడ్స్‌ స్వైన్‌ ప్లూ చికిత్స మందులు కూడా..
  • వైరస్‌ లక్షణాలు 4రోజుల్లోనే కట్టడి.. గాంధీ వైద్యుల చికిత్స తీరిది

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌..! గత నెల చివర్లో ఈ విషయం గుప్పుమనడంతో ఒక్కసారిగా కలకలం..! రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు ఇదే కావడంతో.. చికిత్సపరంగా వైద్యులకు పెద్ద సవాల్‌! ఏ మందులు వాడాలి? రోగిని ఎలా చూసుకోవాలి? ఇలా అనేక సంక్లిష్టతలు..! అయితే, వీటన్నిటిని విజయవంతంగా అధిగమించారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. వైరస్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పది రోజుల్లో బయటపడేశారు. మరో నాలుగు రోజులు పర్యవేక్షించి ఆరోగ్యవంతుడిగా మార్చి ఇంటికి పంపారు. ఈ మొత్తం ప్రక్రియలో వైద్యుల స్ఫూర్తిదాయక కృషిని పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మురళీకృష్ణ.. ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారిలా..


చికిత్సపై సందిగ్ధతను అధిగమించి..

దుబాయ్‌ వెళ్లి బెంగళూరు మీదుగా ఫిబ్రవరి 27న హైదరాబాద్‌ చేరిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ .. జ్వరం రావడంతో తొలుత ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. రెండ్రోజులైనా తగ్గకపోవడం, వైరస్‌ అనుమానాలుండటంతో మార్చి ఒకటో తేదీన గాంధీలో చేర్పించారు. ఓవైపు విపరీతమైన ఆయాసం, దగ్గుతో ఇబ్బందిపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో న్యుమోనియాతో కరోనా నిర్ధారణ అయింది. చికిత్సపై సందిగ్ధత నెలకొన్న ఇలాంటి సమయంలో వైద్యులు మనో నిబ్బరంతో వ్యవహరించారు. రోగి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా వెంటిలేటర్‌ అమర్చకుండా మందులపైనే ఆధారపడ్డారు. ఈ క్రమంలో అతడి ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతుండటం ధైర్యాన్నిచ్చింది.


న్యుమోనియా మందులతో..

స్పష్టమైన మందులు లేని నేపథ్యంలో కరోనా నిర్ధారణ తర్వాత వైద్యుల కర్తవ్యం రోగి జబ్బులను నయం చేయడం, రోగ నిరోధక శక్తిని పెంచడం. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, న్యుమోనియా నయమయ్యేలా మందుల చికిత్స ప్రారంభించారు. ఒకవైపు యాంటిబయాటిక్స్‌, ఫ్లూయిడ్స్‌ ఇస్తూనే.. మరోవైపు పిపరాసిలిన్‌, టాజోబాక్టమ్‌, క్లారిత్రోమైసిన్‌ వాడి న్యుమోనియా తగ్గించారు. స్వైన్‌ ఫ్లూను నిరోధించడానికి వాడే ‘ఒసాల్టా’ మందులను కూడా ఇచ్చారు. చేరిన మూడు, నాలుగు రోజులకే రోగిలోని కరోనా లక్షణాలకు కళ్లెం పడింది. వారం, పది రోజుల్లో రెండుసార్లు ఎక్స్‌రే తీశారు. అప్పటికే న్యుమోనియా నియంత్రణలోకి వచ్చినట్లు స్పష్టమైంది. అయితే, ఇతడికి  ఇచ్చినట్లే మిగతా పాజిటివ్‌ రోగులందరికీ చికిత్స అందించలేం. తీవ్రతను బట్టి చికిత్స తీరు ఆధారపడి ఉంటుంది.


Updated Date - 2020-03-26T09:06:08+05:30 IST