Abn logo
Oct 19 2020 @ 01:19AM

నెట్టింట... రీమేకులంట!

Kaakateeya

థియేటర్లకు రీమేకులు కొత్త కాదు!

ప్రతి భాషలోనూ....

ఎవరో ఒకరు రీమేకులు చేసినోళ్లే!!

మరి, ఓటీటీలో...?

రీమేక్‌ సంస్కృతి మెల్లగా మొదలవుతోంది!

వీక్షక స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.


భారతీయులకు వినోదం అంటే థియేటర్లు, అందులో విడుదలయ్యే చిత్రాలే! లాక్‌డౌన్‌లో వాటి స్థానాన్ని ఓటీటీ వేదికలు, అందులో విడుదలయ్యే వెబ్‌ సిరీ్‌సలు, ఒరిజినల్‌ చిత్రాలు కొంతవరకూ భర్తీ చేశాయి. అయితే... థియేటర్లు, ఓటీటీ వేదికల మధ్య ప్రధానంగా ఓ వ్యత్యాసం గురించి చెప్పుకోవాలి. ఓటీటీ వేదికల్లో అయితే... అనకాపల్లిలో ఉన్నోళ్లు సైతం అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌ సిరీ్‌సలు చూడొచ్చు. సిద్ధిపేటలో ఉన్నప్పటికీ స్పానిష్‌ సిరీ్‌సలు, కొత్తపేట కుర్రాళ్లు కొరియన్‌ డ్రామాలు చూడొచ్చు. థియేటర్ల విషయానికి వస్తే... ప్రేక్షకులకు ఆప్షన్లు ఉండవు. తమ ప్రాంతంలోని థియేటర్లలో ప్రదర్శిస్తున్న చిత్రాల్లో ఏదో ఒక చిత్రానికి వెళ్లాలి. మెట్రో నగరాల్లో తప్ప పల్లెటూళ్లలో పరభాషా చిత్రాలు విడుదల కావడం తక్కువ కాబట్టి... పలువురు రీమేకులు చేశారు. మరి, నెట్టింట ప్రపంచమంతా గుప్పెటలోకి అందివచ్చిన ఈ రోజుల్లో... ఓటీటీ వేదికలు ఓ భాషలో సిరీ్‌సలను ఇతర భాషల్లో అనువాదం చేయడమో, సబ్‌ టైటిల్స్‌ అందివ్వడమో చేస్తున్న తరుణంలో... వెబ్‌ సిరీ్‌సలను రీమేక్‌ చేస్తుండటం విశేషమే.


పంకజ్‌ త్రిపాఠీ, విక్రాంత్‌ నటించిన ‘క్రిమినల్‌ జస్టీస్‌’ అదే పేరుతో రూపొందిన బ్రిటీష్‌ సిరీ్‌సకి రీమేక్‌. జిమ్మీ షర్గిల్‌ నటించిన ‘యువరానర్‌’ ఓ ఇజ్రాయెల్‌ సిరీ్‌సకి రీమేక్‌. ‘హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌’ని మరాఠీలో రీమేక్‌ చేస్తున్నట్టు టాక్‌. ఇవి కాకుండా మరికొన్ని రీమేకులు ఉన్నాయి. విదేశీ సిరీ్‌సలు వీక్షకులకు అందుబాటులో ఉన్నప్పటికీ... ఆ కథలకు భారతీయత జోడించడం వలన కొత్త రూపు సంతరించుకుంటాయనీ, ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాయని కొందరు చెబుతున్న మాట. ప్రస్తుతానికి కొన్ని మాత్రమే రీమేక్‌ అయ్యాయి కనుక భవిష్యత్తులో రీమేక్‌ సిరీ్‌సలకు వీక్షకుల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.


హృతిక్‌ రోషన్‌...

నైట్‌ మేనేజర్‌!

హిందీ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నారు. ఆయనకు తొలి సిరీస్‌ ఇది. సుమారు రూ. 80 కోట్లు పారితోషికం అందుకుంటున్నారని బీటౌన్‌ ఖబర్‌. అంత భారీ మొత్తం ఇవ్వడానికి విదేశీ కథపై ఉన్న నమ్మకమే కారణమట. టామ్‌ హిడిల్‌స్టన్‌ నటించిన బ్రిటీష్‌ టీవీ సీరియల్‌ ‘ద నైట్‌ మేనేజర్‌’ను హృతిక్‌తో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో హీరో ఓ హోటల్‌లో నైట్‌ మేనేజర్‌. హృతిక్‌ ఆ పాత్ర చేస్తే... భారతీయ ప్రేక్షకులకు సిరీస్‌ మరింత చేరువ అవుతుందని ఓటీటీ కోసం సిరీస్‌ తీస్తున్న దర్శక, నిర్మాతలు సహా ఓటీటీ ప్రతినిధుల ఆశ! 


షాద్‌ అలీ...

కాల్‌ మై ఏజెంట్‌!

‘దిస్‌ పౌర్‌ సెంట్‌’... ఇదొక ఫ్రెంచ్‌ సిరీస్‌. నెట్‌ఫ్లిక్స్‌లో ‘కాల్‌ మై ఏజెంట్‌’గా విడుదలైంది. దీనిని మణిరత్నం శిష్యుడు, దర్శకుడు షాద్‌ అలీ సెహగల్‌ రీమేక్‌ చేస్తున్నారు. గతంలో ఆయన ‘బంటీ ఔర్‌ బబ్లీ’, ‘కిల్‌ దిల్‌’, ‘సూర్మ’, ‘ఓకే జాను’, ‘సాతియా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నం చిత్రాలను హిందీలో రీమేక్‌ చేసిన షాద్‌ అలీ, ఓ విదేశీ సిరీస్‌ రీమేక్‌ బాధ్యతలను భుజాన వేసుకోవడం ఇదే తొలిసారి. ఆయన వెబ్‌ సిరీస్‌ తీస్తుండటమూ ఇదే తొలిసారి. 

అవుట్‌ ఆఫ్‌ లవ్‌ ఫ్రమ్‌

డాక్టర్‌ ఫాస్టర్‌!

హిందీ దర్శకుడు తిగ్మంన్షు ధూలియా, మరో దర్శకుడు ఐజాజ్‌ ఖాన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన సిరీస్‌ ‘అవుట్‌ ఆఫ్‌ లవ్‌’. దీనికి ఐదేళ్ల క్రితం బీబీసీ రూపొందించిన ‘డాక్టర్‌ ఫాస్టర్‌’ ఆధారం. భారతీయ నేపథ్యానికి తగ్గట్టు కథ, కథనాల్లో కొన్ని మార్పులు చేశారు. ఈ సిరీ్‌సలో నటించిన రసికా దుగల్‌ ఓటీటీ రీమేకుల గురించి మాట్లాడుతూ ‘‘విదేశీ సిరీ్‌సలు వీక్షకులకు అందుబాటులో ఉండొచ్చు. కానీ, మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసిన సిరీస్‌ చూడటానికి భారతీయ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. క్యారెక్టర్లకూ ఇండియన్‌ టచ్‌ ఇవ్వడం వలన ఎక్కువ కనెక్ట్‌ అవుతారు’’ అని పేర్కొన్నారు.


సుస్మితా ‘ఆర్య’...

డచ్‌ ‘పెనోజా’

‘ఆర్య’ వెబ్‌ సిరీ్‌సతో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ ఓటీటీ విశ్వంలోకి అడుగుపెట్టారు. ఇదీ అరువు తెచ్చుకున్న కథే... ఒరిజినల్‌ కాదు! డచ్‌ డ్రామా సిరీస్‌ ‘పెనోజా’ ఆధారంగా ‘ఆర్య’ తీశారు. హిందీ సిరీ్‌సను తెలుగులోనూ అనువదించారు. ఇండియాలో దీనికి చక్కటి ఆదరణ లభించింది. ఇప్పుడు సెకండ్‌ సీజన్‌ ‘ఆర్య ఓఎ్‌సటీ’ తీస్తున్నారు. డచ్‌లో మొత్తం ఐదు సీజన్లు వచ్చాయి. హిందీలోనూ అన్ని తీసే అవకాశాలను తీసి పారేయలేం!

Advertisement
Advertisement
Advertisement