టీడీపీకి పూర్వవైభవం తెస్తాం: మాజీమంత్రి నెట్టెం, ఎంపీ కేశినేని

ABN , First Publish Date - 2020-09-29T15:45:39+05:30 IST

గత ఎన్నికల్లో పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తామని..

టీడీపీకి పూర్వవైభవం తెస్తాం: మాజీమంత్రి నెట్టెం, ఎంపీ కేశినేని

విజయవాడ(ఆంధ్రజ్యోతి) : గత ఎన్నికల్లో పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తామని విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా నియమితులైన మాజీమంత్రి నెట్టెం రఘురామ్‌, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన నెట్టెం రఘురామ్‌కు సోమవారం కేశినేని భవన్‌లో అభినందన కార్యక్రమం జరిగింది. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు, నాయకులు, కార్యకర్తలు రఘురామ్‌ను పూలమాలలు, దుశ్శాలువాతో సత్కరించారు.


అనంతరం నెట్టెం రఘురామ్‌ మాట్లాడుతూ తాను ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి దాదాపు 35 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చానన్నారు. విజయవాడ పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాలపైన తనకు అవగాహన ఉందని, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులతో కలిసి గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే పార్లమెంట్‌ నియోజకవర్గానికి పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటుచేసి అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 2024లో గానీ, అంతకుముందే ఎన్నికలు జరిగినా విజయవాడ పార్లమెంట్‌లో టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించి పార్టీకి పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలు వంచనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఒక్క చాన్స్‌.. అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అడుగడుగునా మాట తప్పారని, మడమ తిప్పారని విమర్శించారు.


అమరావతిని మూడు ముక్కలు చేసి ఈ ప్రాంతానికి తీరని ద్రోహం తలపెడుతున్న జగన్‌ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు. రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ కలిసి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తే వైసీపీ బీజేపీకి మద్దతుగా నిలిచిందని దుయ్యబట్టారు. నెట్టెం రఘురామ్‌ను విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించిన అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను ఎదుర్కొంటూ, ప్రజల్లో పార్టీని బలోపేతం చేసేందుకే అధిష్ఠానం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కొంతమంది నాయకులు పార్టీ మారినా కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్‌ తాతయ్య, నల్లగట్ల స్వామిదాస్‌ తదితర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T15:45:39+05:30 IST