నేత్రపర్వంగా ఊంజల్‌ సేవోత్సవం

ABN , First Publish Date - 2022-05-21T06:13:30+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగాయి.

నేత్రపర్వంగా ఊంజల్‌ సేవోత్సవం
స్వామివారి నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, మే 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను వేకువజామున సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు బిందెతీర్థంతో నిత్యారాధనలు నిర్వహించారు. గర్భాలయంలోని ప్రతిష్ఠా అలంకార కవచమూర్తులను 108 సువర్ణ పుష్పాలతో అర్చించారు. మూలమూర్తులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలు, కుంకుమలతో అర్చించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు, ముఖమండపంలో ఉత్సవమూర్తులచెంత సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాల్లో భక్తులు పాల్గొన్నారు. అనుబంధ ఆలయం రామలింగేశ్వరుడికి, ముఖమండపంలోని స్పటిక లింగానికి నిత్య పూజాకైంకర్యాలు, కొండకింద పాత గోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. సాయంత్రం ప్రధానాలయంలో కొలువుదీరిన ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగాసాగింది. ప్రధానాలయ అష్టభుజి అంతర్‌ ప్రాకార మండపంలోని అద్దాల మండపంలో అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు. అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహుడి సన్నిధిలో స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం శాస్త్రోక్తంగా కొనసాగింది. స్వామి వారిని ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రెటరీ ఆర్‌.కరికల్‌ వెలవెన్‌ దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.33,69,790 ఆదాయం సమకూరింది. 

Updated Date - 2022-05-21T06:13:30+05:30 IST