బీజేపీ నేత వీడియో వైరల్.. నెటిజెన్ల విమర్శలు

ABN , First Publish Date - 2021-04-17T00:55:43+05:30 IST

ఈ ర్యాలీకి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. ఇందులో చాలా మందికి మాస్క్‌లు లేవు. ర్యాలీకి వచ్చిన ప్రజలకే కాకుండా మనోజ్ తివారీ కూడా మాస్క్ లేకుండానే ఉన్నారు. దీంతో నెటిజెన్లు.. ప్రజలకు నిబంధనలు చెబుతూ

బీజేపీ నేత వీడియో వైరల్.. నెటిజెన్ల విమర్శలు

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ నేత మనోజ్ తివారీ షేర్ చేసిన వీడియోపై నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ప్రజలను ఇళ్లు దాటి బయటికి రావద్దని పెద్ద పెద్ద రోడ్‌షోలు నిర్వహించి చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా మాస్క్‌ కూడా లేకుండా జన సమూహంతో ర్యాలీలు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


విషయం ఏంటంటే.. పశ్చిమ బెంగాల్‌‌లోని బైరక్‌పూర్‌లో ఏప్రిల్ 15న మనోజ్ తివారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ఒకటి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అనంతరం కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా అత్యంత అవసరం అయితే మినహా ప్రజలు ఎవరూ ఇళ్లుదాటి బయటికి రావద్దని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఎన్నికల కారణంగా తాము ప్రచారం నిర్వహించాల్సి వస్తుందని ఎన్నికల కంటే ముఖ్యమైనదేదీ లేదనే అర్థంలో తివారీ చెప్పుకొచ్చారు.


ఈ ర్యాలీకి ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. ఇందులో చాలా మందికి మాస్క్‌లు లేవు. ర్యాలీకి వచ్చిన ప్రజలకే కాకుండా మనోజ్ తివారీ కూడా మాస్క్ లేకుండానే ఉన్నారు. దీంతో నెటిజెన్లు.. ప్రజలకు నిబంధనలు చెబుతూ తాను పాటించడం మర్చిపోయాడంటూ మనోజ్ తివారీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ నేతలకు ప్రజల ప్రాణాలకంటే ఎన్నికలే ఎక్కువయ్యాయని, ఈ విషయాన్ని మనోజ్ తివారీ బాహాటంగానే చెబుతున్నారని ట్రోల్ చేస్తున్నారు.



Updated Date - 2021-04-17T00:55:43+05:30 IST