మగ్గం ఉంటేనే సాయం

ABN , First Publish Date - 2020-06-02T09:55:55+05:30 IST

మర మగ్గాలకు దీటుగా చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహించేందుకు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవో

మగ్గం ఉంటేనే సాయం

కూలికి నేస్తే కుదరదు

అనుబంధ వృత్తులకు అనర్హత

కొందరికే వైఎస్సార్‌ నేతన్న హస్తం


ఎమ్మిగనూరు, జూన్‌ 1: మర మగ్గాలకు దీటుగా చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహించేందుకు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 89ని జారీ చేసింది. మగ్గాల ఆధునికీకరణకు అవసరమైన పరికరాలను కొనేందుకు ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఆర్ధికసాయం అందిస్తోంది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది లబ్ధి పొందారు. ఈ ఏడాది 43,795 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం సాయం అందించాల్సి ఉంది. కానీ లబ్ధిదారుల ఎంపిక కోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. జియో ట్యాగింగ్‌ పేరుతో చేనేత కుటుంబాల సర్వే చేయిస్తోంది. ఇంట్లో మగ్గం ఉందా, ఎవరు నేస్తున్నారు అనే వివరాలను సేకరిస్తున్నారు. దీంతో కూలి మగ్గాలు నేసే కార్మికులు తమకు సాయం అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.


నిబంధనలు ఇవే..

  • సొంత మగ్గంపై పని చేస్తూ, జీవనోపాధి పొందే చేనేత కార్మికులు అర్హులు. 
  • కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నా.. ఒకరికే ఆర్థిక సాయం
  • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులు మాత్రమే ఆర్హులు. 
  • ప్రాథమిక చేనేత సంఘాలు, మాస్టర్‌ వీవర్స్‌ షెడ్డులో పనిచేసే వారికి ఈ పథకం వర్తించదు.
  • చేనేత అనుబంధ వృత్తులలో పనిచేసే కార్మికులు అనర్హులు. 
  • కొత్తగా మగ్గాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఏడాది తరువాత అర్హత వస్తుంది. 

వీరి పరిస్థితి ఏమిటి..?

ఎమ్మిగనూరు, నందవరం, నాగలదిన్నె, గుడికల్లు, గోనెగండ్ల, కోసిగి, గూడూరు, కోడుమూరు, ఆదోని, కల్లూరు ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఎక్కువ. చాలా మంది ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు మగ్గాలు ఏర్పాటు చేసుకున్నారు. స్థోమత లేనివారు ఇతరుల వద్ద కూలికి మగ్గం నేస్తున్నారు. ఆరకొర ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారు ఎమ్మిగనూరు ప్రాంతంలో 2 వేలకు పైగా ఉంటారు. జిల్లా వ్యాప్తంగా ఐదువేల వరకూ ఉంటారు. కొత్త నిబంధనల కారణంగా ఇలాంటి వారు ఆర్థిక సాయాన్ని కోల్పోతారు. పక్కపక్కనే చేనేత మగ్గాలు ఉన్న ఇళ్లకు జియో ట్యాగింగ్‌లో ఒక మగ్గంగానే నమోదు అవుతోంది. దీంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.


ఇల్లు కూడా లేదు

ఉండటానికి ఇల్లు లేదు. గుడిసేలో అద్దెకు ఉంటున్నాను. సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థొమత లేదు. మరొకరి దగ్గర కూలికి మగ్గం నేసి బతుకుతున్నాం. వచ్చే అరకొర ఆదాయంతో నా కుమారుడిని చదివిస్తున్నాను. మా లాంటి వారికి పథకం వర్థింపజేయాలి. 

 - బండా యల్లేశ్వరీ, ఎమ్మిగనూరు 


గత ఏడాదీ రాలేదు 

కొన్నేళ్లుగా కూలి మగ్గం నేస్తున్నాం. నా భర్త అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ భారమంత నాపైనే ఉంది. గత ఏడాది నేతన్న హస్తం రాలేదు. ఈ ఏడాదైనా వస్తుందనుకుంటే కూలి మగ్గం నేసేవారికి ఇవ్వరని అంటున్నారు. మగ్గం నేసేవారందరికీ నేతన్న హస్తం కింద సాయం అందించాలి. 

- శ్యామల, ఎమ్మిగనూరు 


చిన్నచూపు సరికాదు..

పొంతమగ్గం నేసేవారైనా, కూలి మగ్గం నేసేవారైనా చేనేత కార్మికులే. అలాంటప్పుడు సొంత మగ్గాలు ఉన్నవారికే పథకం వర్తింపజేయడం సరికాదు. కౌలు రైతులకు ఎలా రైతుభరోసా ఇస్తున్నారో, అలాగే కూలి మగ్గం నేసే వారికీ వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం వర్తింపజేయాలి. 

 - మల్లికార్జున, టీడీపీ చేనేత విభాగం నాయకులు, ఎమ్మిగనూరు 


అందరికీ ఇవ్వాలి..

మగ్గం నేసే చేనేత కార్మికులందరికీ వైఎస్‌ఆర్‌ నేతన్న హస్తం పథకాన్ని వర్తింపజేయాలి. నిబంధనలు పెట్టి కొందరికే సాయం అందించం సరికాదు. పక్క రాష్ట్రంలో అనుబంధ పనులు చేసే కార్మికులకు కూడా ఇస్తున్నారు. చేనేత కార్మికుల్లో చాలా మందికి మగ్గం ఏర్పాటు చేసుకునే స్థోమత ఉండదు. అలాంటివారు ఎక్కడో ఒక చోట కూలి తీసుకుని మగ్గం నేస్తుంటారు. అలాంటి వారందరికీ ఆర్థిక సాయం అందించాలి. 

- శంకరన్న, చేనేత జన సమాఖ్య నాయకులు, ఎమ్మిగనూరు 

Updated Date - 2020-06-02T09:55:55+05:30 IST