Netflix కొత్త రూల్.. పాస్‌వర్డ్ షేర్ చేస్తే..

ABN , First Publish Date - 2022-07-19T18:45:45+05:30 IST

‘పాస్‌వర్డ్ షేరింగ్’ ఆప్షన్ సంస్థను ముంచుతోందని నమ్ముతున్న స్ట్రీమింగ్, ప్రొడక్షన్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్(Netflix) కీలక ప్రకటన చేసింది.

Netflix కొత్త రూల్.. పాస్‌వర్డ్ షేర్ చేస్తే..

కాలిఫోర్నియా : ‘పాస్‌వర్డ్ షేరింగ్’ (password sharing )ఆప్షన్ సంస్థను ముంచుతోందని నమ్ముతున్న స్ట్రీమింగ్, ప్రొడక్షన్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్(Netflix) కీలక ప్రకటన చేసింది. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేరింగ్‌పై అదనపు చార్జీ విధించాలని నిర్ణయించింది. సబ్‌స్ర్కైబర్లు(subscribers) తమ ప్రాథమిక నివాసం(residency) వెలుపల 2 వారాల కంటే ఎక్కువ రోజులు అకౌంట్‌ని ఇతరులతో షేర్ చేస్తే ‘యాడ్ ఏ హోం’ (Add a Home ) నిబంధన కింద చార్జి విధించనున్నట్టు సోమవారం ప్రకటించింది. కొత్త నివాసాన్ని జత చేస్తారా లేదా ప్రైమరీ హౌస్‌హోల్డ్‌పై చార్జీ విధించాలా? అని ఇన్-యాప్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నిబంధనని తొలుత ఎంపిక చేసిన 4 లాటిన్ అమెరికా దేశాలు అర్జెంటీనా, ఎల్ సాల్వేడార్, గుటెమాలా, హోండురస్, డొమినికన్ రిపబ్లిక్ సబ్‌స్ర్కైబర్ల నుంచి ఈ చార్జీలు రాబట్టనుంచి. అడిషనల్ హోం ఫీజు అర్జెంటీనాలో 219 పెసోలు(1.70 డాలర్లు), ఇతర దేశాల్లో 2.99 డాలర్లుగా కంపెనీ పేర్కొంది. కస్టమర్ల సంఖ్య పెరుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని, అదనపు ఆదాయం సమకూరుతుందని సంస్థ ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లపై నెట్‌ఫ్లిక్స్ చూస్తున్న వారిపై ఈ ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. విహారయాత్రల్లో ఉన్నవారిపైనా ప్రభావం ఉండదని తెలిపింది. ఇళ్ల మధ్య అకౌంట్ షేరింగ్ విధానం సంస్థ వృద్ధి, పెట్టుబడుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, దీర్ఘకాల వృద్ధికి విఘాతంగా పరిణమిస్తోందని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగీ లాంగ్ చెప్పారు. ఈ మేరకు ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒకే అకౌంట్‌ని వేర్వేరు ఇళ్లల్లో వాడుతున్నవారే లక్ష్యంగా నెట్‌ఫ్లిక్స్ ఈ నిబంధన రూపొందించింది. అయితే ఇతర దేశాల్లో ఈ నిబంధన వర్తింపుపై కంపెనీ ఎలాంటి ప్రస్తావనా చేయలేదు.


లాటిన్ అమెరికా దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి కస్టమర్లు అదనపు చార్జీల చెల్లింపునకు సుముఖంగా ఉన్నారా లేదా అనేది తొలుత ఇక్కడే ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే సబ్‌స్ర్కిప్షన్ చేసుకున్నవారి విషయంలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితితో కాస్త సడలింపునివ్వాలనుకుంటోంది. 


ఇతరులు చెల్లించిన అకౌంట్లను దాదాపు 100 మిలియన్ల ఇళ్లల్లో వాడుతున్నారని నెట్‌ఫ్లిక్స్ అంచనా వేసింది. పాస్‌వర్డ్ షేరింగ్ అవకాశం సబ్‌స్ర్కైబర్ల వృద్ధి రేటుకి అవరోధంగా మారిందని తెలిపింది. కాగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లను సంస్థ కోల్పోయింది. రెండో త్రైమాసికంలో ఈ సంఖ్య 2 మిలియన్లగా ఉండబోతోందనేది అంచనాగా ఉంది. స్ట్రీమింగ్ విభాగంలో ఇబ్బందుల కారణంగా ఈ సంస్థ షేర్ ధర ఈ ఏడాది భారీగా పతనమైంది. ఎంతలా అంటే ఇప్పటివరకు ఏకంగా 65 శాతం మేర షేర్ వ్యాల్యూ దిగజారింది. 


అదనపు చార్జీలతో సబ్-అకౌంట్

అదనపు చార్జీలు విధింపు ద్వారా ఒకే అకౌంట్‌ని ఇతర సభ్యులు కూడా ఉపయోగించుకునే అవకాశాలను నెట్‌ఫ్లిక్స్ పరీశీలిస్తోంది. ఒక అకౌంట్‌కి అదనపు మెంబర్‌ని(Add Member) జతచేస్తే అదనపు ఫీజుని(Additonal Fee) విధించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన చిలీ, కోస్టారికా, పెరూ దేశాల కస్టమర్లను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కోరింది. కొత్త మెంబర్‌ని సబ్-అకౌంట్‌గా పరిగణిస్తారు. వారి సొంత ఈ-మెయిల్ అడ్రెస్ ఇచ్చి  స్ట్రీమింగ్ పొందొచ్చు. తద్వారా ప్రైమరీ అకౌంట్ హోల్డర్ ప్లాన్ పరిమితి ప్రకారం.. ఒకే టైంలో ఇద్దరూ నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు. బేసిక్ ప్లాన్ ప్రకారం కస్టమర్లు ఒక డివైజ్‌పై ఒకే సమయంలో మాత్రమే చూడాల్సి ఉంటుంది. అదనపు చెల్లింపుతో 2 వేర్వేరు డివైజ్‌లపై ఒకేసారి చూడొచ్చు. ప్రీమియం ప్లాన్‌తో ఒకేసారి నలుగురు వీక్షించవచ్చునని సంస్థ స్పష్టం చేసింది.

Updated Date - 2022-07-19T18:45:45+05:30 IST