మళ్లీ నెతన్యాహూ...?

ABN , First Publish Date - 2022-07-08T06:23:30+05:30 IST

బెంజమిన్ నెతన్యాహూ ఇజ్రాయెల్ రాజకీయాల్లో కొనసాగుతున్నంత కాలం అక్కడి ప్రభుత్వాలు కూలుతూనే ఉంటాయన్న రాజకీయ విశ్లేషకుల వెటకారపు వ్యాఖ్యని అంటుంచితే...

మళ్లీ నెతన్యాహూ...?

బెంజమిన్ నెతన్యాహూ ఇజ్రాయెల్ రాజకీయాల్లో కొనసాగుతున్నంత కాలం అక్కడి ప్రభుత్వాలు కూలుతూనే ఉంటాయన్న రాజకీయ విశ్లేషకుల వెటకారపు వ్యాఖ్యని అంటుంచితే, ఇజ్రాయెల్ మళ్ళీ ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు పోబోతున్నది. నాలుగేళ్ళలో ఐదోసారి జరగబోతున్న ఆ ఎన్నికల తరువాత నెతన్యాహూ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ప్రస్తుతానికైతే ఏడాదిపాటు అధికారంలో కొనసాగిన నాఫ్తాలీ బెన్నెట్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇక ఎంతమాత్రం కథ నడపలేనంటూ చేతులెత్తేసింది. అంతర్గతపోరుతో అది చతికిలబడటంతో పార్లమెంటు రద్దయి, నవంబరు 1 ఎన్నికలయ్యే వరకూ యాయేర్ ల్యాపిడ్ ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించబోతున్నారు. ఈ మాజీ జర్నలిస్టు మొన్నటివరకూ విదేశాంగమంత్రి కూడా.


బెన్నెట్ ప్రభుత్వం ఏడాదిపాటు నడవటమే ఓ విశేషం. విభిన్న సిద్ధాంతాలున్న పార్టీలతో ఏర్పడిన ఆయన సంకీర్ణ ప్రభుత్వం గత ఏడాది ప్రజలు ఏ పార్టీకీ ఎక్కువ ఓట్లు ఇవ్వని స్థితినుంచి పుట్టుకొచ్చింది. ఇప్పుడు కూలిపోవచ్చునేమో గానీ ఈ కూటమి ఇజ్రాయెల్ చరిత్రలోనే ఒక కొత్త ప్రయోగానికి నాంది పలికింది. మాన్సూర్‌ అబ్బాస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ అరబ్‌ లిస్ట్‌ అనే అరబ్బుల పార్టీ ఈ ప్రభుత్వంలో భాగస్వామి. హిబ్రూ భాషలో ఈ పార్టీ సంక్షిప్త రూపం రామ్. 1948లో ఇజ్రాయెల్‌ ఏర్పడిన దగ్గరనుంచి అరబ్‌ పార్టీలు అధికారానికి దూరంగానే ఉండాల్సి వచ్చింది. అధికారంలోకి ‘రామ్‌’ రావడం అందరినీ విస్మయపరచడమే కాక, ఈ ఎత్తుగడతో సదరు అరబ్ నాయకుడు నెతన్యాహూకి అధికారం దక్కనీయకుండా చేయగలిగారు. అన్ని పక్షాలూ ఇలా పొత్తులు కట్టి తనను అధికారానికి దూరం చేయడంతో నెతన్యాహూ ఈ అపవిత్ర కలయికను దూషించి, త్వరలోనే పతనం ఖాయమని శపించారు కూడా. ఇజ్రాయెలీ అరబ్బులు బాగుపడాలంటే అధికారంలో భాగస్వాములు కావాలనీ, అప్పుడే అణచివేతలనుంచి విముక్తి లభిస్తుందన్న వాదనతో ఐదుసీట్లు గెలిచిన ఈ అరబ్బు పార్టీ ప్రభుత్వంలో చేరడం మిగతా ప్రపంచానికి కొత్త ఆశలు కలిగించింది కూడా. పైగా, నెతన్యాహూలాగా తాను మతాల మధ్య మంటలు పెట్టనని బెన్నెట్ హామీ ఇవ్వడంతో ఇజ్రాయెలీ అరబ్బులూ యూదుల మధ్య ఏర్పడిన ఈ సయోధ్య పాలస్తీనాతో ఇజ్రాయెల్ వ్యవహరించే అంశంలోనూ సానుకూల ప్రభావం వేస్తుందని అత్యధికులు విశ్వసించారు. కానీ, నెతన్యాహూ శపించినట్టుగానే ఈ అపవిత్ర సంకీర్ణం ఏడాదిలోనే కూలిపోయింది. కాఠిన్యంలో తేడాలు ఉండవచ్చునేమో కానీ, సైద్ధాంతికంగా బెన్నెట్, నెతన్యాహూలు ఒక్కటే. అయినప్పటికీ, ఓ అరబ్బు పార్టీని అధికారంలో భాగస్వామిని చేసుకోవడం ఇజ్రాయెలీలకు నచ్చలేదు. సంకీర్ణాన్ని నిలబెట్టుకోవడం కోసం అరబ్బులతో సహా చాలాపార్టీలతో బెన్నెట్ సైద్ధాంతికంగా రాజీపడుతున్నారన్న అపప్రధ వెంటాడింది. యూదులు, పాలస్తీనా ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడం, దేశ జనాభాలో ఐదోవంతున్న ఇజ్రాయెలీ అరబ్బులను అనుమానంగా చూడటం ద్వారా అక్కడి పార్టీలు దశాబ్దాలుగా అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. సమాజం నిలువునా చీలిపోయిన స్థితిలో ఈ కొత్త ప్రయోగం వికటించడంలో ఆశ్చర్యమేమీ లేదు. బెన్నెట్ పార్టీలో ముసలం పుట్టింది. ఆయన మితవాదపార్టీ యామీనాకు ప్రజల్లో పరపతి తగ్గింది. ఆ పార్టీ ఎంపీ ఒకరు రాజీనామా చేయడంతో మెజారిటీ పడిపోయి ప్రభుత్వం కూలింది. నెతన్యాహూ అవినీతిపరుడు అయినప్పటికీ, ఓ అరబ్బుపార్టీ చక్రం తిప్పి ఆ యూదువీరుడిని పదవీచ్యుతుడిని చేయడం ఇజ్రాయెల్ సమాజం జీర్ణించుకోలేకపోయింది. అందువల్లనే, రాబోయే ఎన్నికల్లో నెతన్యాహూ నాయకత్వంలోని లికుడ్ పార్టీ సహా ఆయనను సమర్థించే మితవాదపక్షాలకు ఎక్కువస్థానాలు వస్తాయని అంచనా. ఎన్నికలకు ముందు దేశంలో మతవిద్వేషాలు రగల్చడం, పాలస్తీనామీద బాంబులు కురిపించడం నెతన్యాహూకు తెలిసిన విద్య. గత ఏడాది కూడా ఎన్నికల ముందు జెరూసలేంలోని అల్‌ అక్సా మసీదు వద్ద ఘర్షణలు రేగాయి, హమాస్‌తో నిర్విరామంగా పదిరోజులు భారీ యుద్ధం జరిగింది. ఇజ్రాయెలీల రక్షకుడిగా కనిపించడంలో ఆయన మిగతావారికంటే ముందంజలో ఉన్నమాట వాస్తవం. ఫలితాలు కాస్త అటూ ఇటూ అయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సమర్థత ఆయనకు ఉన్నమాట నిజమేకానీ, ఇజ్రాయెల్ తన అతిసంక్లిష్టమైన ఎన్నికల విధానాన్ని మార్చుకొనేవరకూ ఈ వరుస ఎన్నికల బాధనుంచి పూర్తిగా బయటపడే అవకాశాలైతే లేవు.

Updated Date - 2022-07-08T06:23:30+05:30 IST