అక్రమాల నిగ్గు తేల్చారా ?

ABN , First Publish Date - 2020-08-08T08:18:15+05:30 IST

జిల్లాలో నేతన్న నేస్తం పథకంలో అక్రమాలు బయట పడ్డాయా ? నిజా లు నిగ్గుతేల్చారా ? అవినీతికి పాల్పడిన ..

అక్రమాల నిగ్గు తేల్చారా ?

నేతన్న నేస్తం అవకతవకలపై రాష్ట్రస్థాయి అధికారుల విచారణ

జిల్లాలో రహస్య పర్యటన.... నివేదికలు రెడీ

సొమ్ము రికవరీకీ రంగం సిద్ధం

అవినీతి అధికారుల్లో గుబులు


అనంతపురం అర్బన్‌, ఆగస్టు 7 : జిల్లాలో నేతన్న నేస్తం పథకంలో అక్రమాలు బయట పడ్డాయా ? నిజా లు నిగ్గుతేల్చారా ? అవినీతికి పాల్పడిన అధికారులపై వే టుకు రంగం సిద్ధం చేశారా ? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం ఆ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  నేతన్న నేస్తం పథకంలో అనర్హులను అందలమెక్కించారనే విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అర్హులు కూడా తమ గోడును అధికారుల వద్ద వెలిబుచ్చారు. ఈ తతంగం రాష్ట్రస్థాయికి చేరిన నేపథ్యంలో అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు రాష్ట్రస్థా యి అధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా నే జిల్లాలో ఎక్కడెక్కడ అవినీతి జరిగింది...? ఈ అక్రమా లలో ఏఏ అధికారులు పాలుపంచుకున్నారు...? ఎంత సొ మ్మును పక్కదారి పట్టించారు...? అనర్హుల జాబితా తదిత ర విషయాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సిద్ధం చేసుకుని వెళ్లినట్లు సమా చారం. అయితే ఈ రహస్య పర్యటనపై జిల్లా శాఖకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అదే ఇప్పుడు ఆ శాఖలోని అవినీతికి పాల్పడిన కొందరి అధికారుల్లో గుబు లు రేపుతోంది. 


నేతన్న నేస్తం అమలు తీరిది...

జిల్లాలో నేతన్న నేస్తం కింద 2019-20లో  27,338 మంది, 2020-21గాను 21,850మంది చేనేతలు లబ్ధిపొందా రు. ఈ మేరకు ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ.24వేల చొప్పున మొత్తం 49,188మందికి 118.05కోట్లు అందజేశారు. ఈ మొత్తం మొదటి విడలోని లబ్ధిదారులకు మాత్రమే. రెం డవ విడతలో గత ఏడాది 2,986, ఈ సంవత్సరంలో 2,393 మంది మొత్తం 5,379మంది అర్హులైన నేతన్నలు న్నారు. ఒక్కొక్కరికి రూ.24వేల చొప్పున రూ.12.09కోట్లను వారి ఖాతాల్లోకి జమచేయాల్సి ఉంది. 


విచారణలో బట్టబయలైన అంశాలివేనా...?

జిల్లాలో నేతన్న నేస్తంలో జరిగిన అక్రమాలను నిగ్గుతే ల్చేందుకు గత నెలలో రాష్ట్రస్థాయి అధికారులు జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ), అడిషనల్‌ డైరెక్టర్‌(ఏడీ)లు ఓ కమిటీగా ఏర్పడి శాఖాధికారులతోనూ క్షేత్రస్థాయిలోనూ విచారణ చేపట్టారు. ఈ విచారణలో రూ. కోట్లలోనే అవినీతికి పా ల్పడినట్లు వెల్లడైందని సమాచారం.  కొందరు అధికారులు అనర్హులకు పెద్దపీట వేసినట్లు తెలిసింది. ఒకే మగ్గంపై పదుల సంఖ్యలో అనర్హులను చేర్చి లబ్ధి చేకూర్చినట్టు గుర్తించారు. ఈ అవినీతిలో కొందరు రాజకీయ నాయకులు కూడా భాగస్వాములైనట్టు గుర్తించినట్టు తెలిసింది. విచారణ నివేదికలో ఇదే ప్రధాన అంశంగా చేర్చినట్లు సమాచారం. ఈ విచారణంతా గుట్టుగా సాగించి నివేదికను విజయవాడలోని కమిషనరేట్‌ ఎదుట ఉంచినట్లు సమాచారం. ఈ అవినీతిపై కమిషనర్‌ సీరియస్‌ అయి నట్లు తెలిసింది. జిల్లాస్థాయి అధికారులకు ఈ అవినీతిపై క్లాస్‌ పీకినట్లు సమాచారం. అనర్హులకు కట్టబెట్టిన సొ మ్మును రికవరీ చేయాలని గట్టిగానే చురకలంటించినట్లు తెలిసింది.  దీంతో అధికారులు ఆ అనర్హుల జాబితాను వెతికేపనిలో పడ్డారు. ఎవరెవరు అనర్హులున్నారో వారి చిరునామా, బ్యాంకు ఖాతా నెంబర్లు, మండలం, గ్రామం ఇలా అన్ని వివరాలు సేకరించి ఇచ్చిన సొమ్మును రికవరీ చేసేందుకు జుట్టుపీక్కుంటున్నారు. 


మారని అధికారుల తీరు

జిల్లాలో చేనేత, జౌళిశాఖలో రోజురోజుకు అవినీతి, అక్ర మాలు బయటపడుతూనే వస్తున్నాయి. వీటిపై ఎప్పటి కప్పుడు పత్రికల్లో కథనాలు వస్తున్నా ఆశాఖ అధికారుల్లో చలనం లేదు. రాష్ట్రస్థాయి నుంచి ఆ అవినీతి అధికారుల కు సస్పెన్షన్‌ ఉత్తర్వులు వచ్చినా...మళ్లీ ఏదో ఒక దొడ్డిదా రిలో ఆర్డర్‌ తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది.  ఆ అవినీతి అధికారులకు రాజకీయ అండ మరింత ఊత మిస్తోంది.  


ఒకే మగ్గంతో 20 మందికి జియో ట్యాగింగ్‌ : నీలూరు రుషింగప్ప, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్‌

వలంటీర్లు, సచివాలయ అధికారులు, స్థానిక నాయ కుల ఒత్తిడికి తలొగ్గి కావాల్సిన వారికే నేతన్న నేస్తాన్ని కట్టబెట్టారు. ఇందులో భాగంగా ఈ రెండు సంవత్సరాల్లో అత్యధికంగా అనర్హులకు రూ. 24 వేలు ఆర్థికసాయం వారి ఖాతాలో జమచేశారు. ఒకే మగ్గాన్ని దాదాపు 20 ఇళ్లల్లో ఉన్నట్లు ఫొటోలు తీసి జియో ట్యాగింగ్‌ చేశారు. శాఖలోని కొందరు అధికారులే ఈ పథకం పక్కదారి పట్టడానికి కారకులవుతున్నారు. వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే తప్పా... నిజమైన నేతన్నకు న్యాయం జరగదు. 

Updated Date - 2020-08-08T08:18:15+05:30 IST