కొత్త పంచాయతీలకు గూడు కరువు

ABN , First Publish Date - 2022-05-17T03:52:59+05:30 IST

పాలన సౌలభ్యం క్షేత్రస్థాయిలో గ్రామాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో 500 జనాభా ఉన్న తండాలు, గిరిజన ఆవాసాలను తెలంగాణ ప్రభుత్వం 2018లో కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.

కొత్త పంచాయతీలకు గూడు కరువు
చిన్న ధర్మారం అంగన్‌వాడీ కేంద్రంలో ఓ వైపు సర్పంచు సీటు, మరో వైపు విద్యార్థులు

- సర్పంచులపై అద్దె భారం 

- ఒకే భవనంలో మూడేసి సంస్థలు 

- పంచాయతీ సమావేశం ఉంటే బడికి సెలవే..

కాసిపేట, మే 16: పాలన సౌలభ్యం క్షేత్రస్థాయిలో గ్రామాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో 500 జనాభా ఉన్న తండాలు, గిరిజన ఆవాసాలను తెలంగాణ ప్రభుత్వం 2018లో కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.  పంచాయతీల పునర్విభజనలో భాగంగా జిల్లాలో 196 పంచాయతీలుం డగా ఇందులో నుంచి 115 పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలకు దేనికి పక్కా భవనం లేకపోవ డంతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనే సర్పంచులకు మరో సీటు కేటాయించి పరిపాలన సాగిస్తున్నారు. ఇలా అంగన్‌వాడీ సెం టర్‌లు, పాఠశాలల్లోనే పంచాయతీ నిర్వహించడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు. అత్యవసర సమావేశం ఉంటే బడికి సెలవు ప్రకటించాల్సిందే...

-సర్పంచులపై అద్దె భారం

జిల్లాలో 158 గ్రామపంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు విడుదల కాకపోవడంతో సర్పంచ్‌లపై అద్దె భారం పడుతోంది. కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో సర్పంచులపై ఇంటి యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో రికార్డులు, ఫర్నీచర్‌లను బయట పడేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. గ్రామపంచాయతీల అద్దె కోసం సర్పంచులు అప్పులు చేసి అద్దె చెల్లిస్తుండడంతో సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి యజమానులు అద్దెకు భవనాలను ఇవ్వడం లేదు. 

- అత్యవసర సమావేశం ఉంటే బడికి సెలవే...

కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం, లంబాడితండా (డి) పంచాయతీలను పాఠశాలతోపాటు అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహిం చారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలకు ఇల్లు అద్దెకు దొరక్కపోవడంతో అంగన్‌వాడీ కేంద్రంలో అదనంగా సీటు కేటాయించి పంచాయతీని నిర్వహిస్తున్నారు. పంచాయతీల అత్యవసర సమావేశం నిర్వహించాలంటే ఆ రోజు బడికి సెలవు ప్రకటించాల్సిందే. పంచాయతీల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పక్కా భవనాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

- చిక్కుల్లో చిన్న పంచాయతీలు...

పంచాయతీల పునర్విభజనలో రెవెన్యూ అధికారులు సైతం హద్దులను నిర్ణయించకపోవడంపై సమీప పంచాయతీలకు హద్దు పంచాయతీలు   పుట్టుకొస్తున్నాయి. దీని వల్ల అధికారులు, సర్పంచుల మధ్య మనస్పర్ధలు చెలరేగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 14వ ఫైనాన్స్‌, రాష్ట్ర బడ్జెట్‌ కేటాయించడంతో నిధులు సరిపోవడం లేదు. 2021 జనాభా  లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తే పంచాయతీల అభివృద్ధికి ఎంతో దోహడపడుతుంది. కానీ ప్రభుత్వం పాత గణాంకాల ప్రకారం నిధులు చెల్లించడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. అలాగే చిన్న పంచాయతీలకు వచ్చే బడ్జెట్‌ నెలకు రూ.35 వేలు దాటడం లేదు. ఇందులో పంచాయతీకి వచ్చిన ట్రాక్టర్‌ కిస్తీ చెల్లించగా మిగిలిన డబ్బులను పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సి వస్తుంది. దీంతో గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చేందుకు కష్టంగా మారిందని సర్పంచులు వాపోతున్నారు. కొత్త పంచాయతీలకు 2021 జనాభా ప్రతిపాదికన నిధులు కేటాయించాలని సర్పంచులు కోరుతున్నారు. 

సర్పంచులు మానసికంగా కృంగిపోతున్నారు 

- సాపాట్‌ శంకర్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు

గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా అప్పులు చేసి సర్పంచులు పనులను కొనసాగిస్తున్నారు. కానీ నిధులను చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి పంచాయతీ ఖాతాలను ఫ్రీజ్‌ చేస్తోంది. దీని ద్వారా గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు చేసిన అప్పులు అధికమవుతూ సర్పంచులు మానసికంగా కృంగిపోతున్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీల నిర్వహణ, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి లైట్ల నిర్వహణపై సర్పంచులపై మోయలేని భారం పడుతుంది. సర్పంచులకు ప్రత్యేక నిధులను కేటాయించాలి.  

Updated Date - 2022-05-17T03:52:59+05:30 IST