Jul 4 2021 @ 00:11AM

నెర్వస్‌గా ‘డార్లింగ్స్‌’తో తొలిరోజు!

హిందీ సినిమా ‘డార్లింగ్స్‌’ చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. సెట్‌లో ఆలియా భట్‌ అడుగుపెట్టారు. ఆమెతో పాటు విజయ్‌ వర్మ, షెఫాలీ షా, రోషన్‌ మాథ్యూ సినిమాలో ప్రధాన తారాగణం. అయితే, ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ‘డార్లింగ్స్‌’తో ఆలియా భట్‌ నిర్మాతగా మారుతున్నారు. షారూఖ్‌ ఖాన్‌తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇన్నాళ్లూ సెట్స్‌లో నటిగా అడుగుపెట్టిన ఆలియా భట్‌, తొలిసారి నిర్మాతగా అడుగుపెట్టారు. అందుకని, కొంచెం నెర్వస్‌గా ఉందట. ‘‘డార్లింగ్స్‌తో తొలిరోజు. నిర్మాతగా నా తొలి సినిమా. అయితే, నేనెప్పుడూ ముందు నటి అనే చెబుతా. ఎప్పటికీ నటిగానే ఉంటా. కానీ, ఈ సినిమా విషయంలో నటిగా నెర్వస్‌కు లోనవుతున్నా. అదేమిటో తెలియదు గానీ... కొత్త సినిమా ప్రారంభించే ముందు నెర్వస్‌ ఫీలవుతా. రాత్రంతా ఆలోచిస్తా. నా శరీరమంతా ఏదో అవుతున్నట్టు ఉంటుంది. సెట్‌కు ఆలస్యం అవుతుందేమోననే భయంతో పదిహేను నిమిషాల ముందే చేరుకుంటా. ఈ ఫీలింగ్‌ ఎప్పటికీ పోదు అనుకుంటా. కానీ, నేను అలా ఉండకూడదు’’ అని ఆలియా భట్‌ పేర్కొన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ‘గంగూబాయి కతియావాడి’ చిత్రీకరణ పూర్తి చేసిన ఆమె, ‘డార్లింగ్స్‌’ ప్రారంభించారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌కు రానున్నారు. పాట చిత్రీకరణలో పాల్గొంటారు.

Bollywoodమరిన్ని...