Abn logo
Feb 22 2020 @ 02:19AM

కారుతో గుద్ది.. 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..

మద్యం మత్తులో ఉన్మాది ఘాతుకం

భార్య కాపురానికి రాననడంతో ఆగ్రహం

కూతురిని కిడ్నాప్‌ చేసి.. కారులో పరారీ

వద్దన్నందుకు భార్య మేనమామ హత్య

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఘటన


నేరేడుచర్ల, ఫిబ్రవరి 21: తరచూ భార్యతో కట్నం కోసం గొడవపడేవాడు. ఆమెను పుట్టింటికి పంపేవాడు. కొంతకాలానికి మళ్లీ వచ్చి తీసుకెళ్లేవాడు. కానీ ఈ సారి భార్య రానని మొండికేసింది. అంతే.. తన మూడేళ్ల కూతురిని కిడ్నాప్‌ చేసి, తీసుకెళ్లాలనుకున్నాడు. అడ్డుపడ్డ తన భార్య మేనమామను కారుతో గుద్దేశాడు. రెండు కిలోమీటర్లు బానెట్‌పైనే ఈడ్చుకెళ్లి చంపేశాడు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. నేరేడుచర్లకు చెందిన లారీ డ్రైవర్‌ గుంజ శంకర్‌(31) అక్క యాదమ్మ కూతురు శ్రీదేవిని ఐదేళ్ల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన  సుజయ్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. అదనపు కట్నం కోసం అత్తింటివారు ఆమెను వేధించేవారు. ఈ క్రమంలో శ్రీదేవి తరచూ పుట్టింటికి రావడం.. సుజయ్‌ తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఈ నెల 18న వీరి మధ్య గొడవ జరిగింది.  శ్రీదేవి హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరి రాజేశ్వరి ఇంటికి వెళ్లింది. 20న నేరేడుచర్లకు వచ్చిన సుజయ్‌.. తన భార్యతో మాట్లాడాలంటూ గొడవపడ్డాడు. శుక్రవారం శ్రీదేవిని నేరేడుచర్లకు పిలిపించారు. తాను భర్తతో కాపురానికి వెళ్లేది లేదని ఆమె తేల్చిచెప్పడంతో.. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. మద్యం మత్తులో ఉన్న సుజయ్‌ తమ కూతురు శాన్విత(3)ను కారులోకి బలవంతంగా ఎక్కించుకుని, కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో శంకర్‌ కారుకు అడ్డుపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న సుజయ్‌.. శంకర్‌ను ఢీకొట్టి, కారును వేగంగా ముందుకు కదిలించాడు. శంకర్‌ ఎగిరి.. బానెట్‌పై పడ్డాడు. అలా.. జాన్‌పహాడ్‌ రోడ్డు వరకు (2 కిలోమీటర్లు) వెళ్లాడు. ఆ తర్వాత శంకర్‌ ముందుకు ఎగిరిపడ్డాడు. సుజయ్‌ అతడి మీద నుంచే కారును పోనిచ్చాడు. అలాగే ఈడ్చుకెళ్లాడు. తీవ్రగాయాలైన శంకర్‌ను మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. శంకర్‌ భార్య శైలజ ఫిర్యాదు మేరకు నేరేడుచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. పిడుగురాళ్ల వైపు వెళ్తున్న సుజయ్‌ని పాలకవీడు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సుజయ్‌ వారిపైనుంచి కూడా కారును పోనిచ్చేందుకు ప్రయత్నించాడు. తృటిలో పోలీసులు తప్పించుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement