నెపోటిజమ్‌ తప్పు అని అనుకోను!

ABN , First Publish Date - 2020-07-12T05:30:00+05:30 IST

హరీశ్‌ శంకర్‌... ఆయన చిత్రాల్లో హీరోయిజమ్‌ ఉంటుంది. వినోదం, వాణిజ్య హంగులూ ఉంటాయి. కరోనా నేర్పిన పాఠం ఏంటి? జీవితంలో వచ్చిన మార్పులేంటి? కొత్తగా చదివిన పుస్తకాలేంటి? ఎన్నో విశేషాలను హరీశ్‌ శంకర్‌ ‘నవ్య’తో పంచుకున్నారు...

నెపోటిజమ్‌ తప్పు అని అనుకోను!

హరీశ్‌ శంకర్‌... ఆయన చిత్రాల్లో హీరోయిజమ్‌ ఉంటుంది. వినోదం, వాణిజ్య హంగులూ ఉంటాయి. మరింత లోతుగా వెళితే... సాహితీ స్వాప్నికుడు, అక్షర ప్రేమికుడు కనిపిస్తారు. వ్యక్తిగత జీవితానికొస్తే... సమాజ సేవకుడూ ఉన్నారు. కరోనా కాలంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు. అసలు, లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? కరోనా నేర్పిన పాఠం ఏంటి? జీవితంలో వచ్చిన మార్పులేంటి? కొత్తగా చదివిన పుస్తకాలేంటి? ఎన్నో విశేషాలను హరీశ్‌ శంకర్‌ ‘నవ్య’తో పంచుకున్నారు.


హలో హరీశ్‌ శంకర్‌గారూ... ఎలా ఉన్నారు?

బావున్నానండీ! కరోనా ప్రభావం తగ్గలేదు కదా!! అందుకని, బయటకు వెళ్లడం లేదు. ఇంటి పట్టునే ఉంటున్నా. పోలీసులకు శానిటైజర్లు ఇవ్వడానికి, ఇతరత్రా పనులకు తప్ప... గత 90 రోజుల్లో నేను బయటకు వెళ్లిన సందర్భాలు లేవు.


కరోనా తీవ్రతపై ఎప్పుడు ఓ అంచనాకు వచ్చారు?

ఇటలీ ఈజ్‌ ద మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కంట్రీ! ఎప్పుడైతే అక్కడ కేసులు పెరుగుతున్నాయని అన్నారో... అప్పుడే వైరస్‌ ప్రభావం, తీవ్రత నాకు అర్థం అయింది. అభివృద్థి చెందిన దేశంలో, అదీ జనసాంద్రత తక్కువ ఉన్న ప్రదేశంలో కరోనాను నియంత్రించలేక పోతున్నామంటే...  మన దేశంలో జనాభా ఎక్కువ. త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలన్నాయని అనుకున్నా.


ట్విట్టర్‌ ద్వారా ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రియల్లీ గ్రేట్‌!

ఇవాళ, ఈ డిజిటల్‌ యుగంలో ఓ సమాచారాన్ని పదిమందికీ చెప్పడం సులభతరమైంది. డిజిటల్‌ రివల్యూషన్‌లో ఒక సమస్యను పదిమంది దృష్టికి తీసుకురావడం ఈజీ. ప్రజాసమస్యలు పరిష్కరం అయ్యేలా కృషి చేయడం దేశపౌరుడిగా నా కనీస బాధ్యతగా భావిస్తా. పోలీసులు, జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ), ఇతర ప్రభుత్వాధికారులు చాలాసార్లు నేను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన సమస్యలకు స్పందించారు. పరిష్కరించారు. ఈ సందర్భంగా వాళ్ళకు థ్యాంక్స్‌ చెబుతున్నా. 


ప్రభుత్వాలు, మీలాంటి ప్రముఖులు చెబుతున్నా... ‘ఉప్పు, పప్పు, వడియాలు’ అంటూ కొందరు రోడ్లమీదకు వస్తున్నారు. సుదూర ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్లను చూసినప్పుడు ఏమనిపిస్తోంది?

‘ఉప్పు, పప్పు’ అంటూ బయటకు వచ్చేవాళ్లను చూసి జాలి పడాలి. అంతకు మించి చెప్పేదేమీ లేదు. కాకపోతే... ఇప్పుడు మా జీవితం, మా ఇష్టం అని అనడానికి లేదు. ఎందుకంటే... కరోనా వైరస్‌ ఒకరి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఎసింప్టమాటిక్‌ (ఎటువంటి లక్షణాలూ కనిపించకుండా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే) కేసుల దశకు వచ్చేసింది. అందువల్ల, ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించే కాకుండా... ఇతరుల గురించీ ఆలోచించండి. ఇంట్లో ఉండి దేశానికి సేవ చేసే సమయమిదే అని భావించి ఇంట్లో ఉండడం చాలా ఉత్తమం.


కరోనా తర్వాత పరిస్థితులు మీలో ఏ విధమైన మార్పు తీసుకొచ్చాయి?

నాలో ఎంపథీ(సహానుభూతి), హ్యుమానిటీ (మానవత్వం) ఇంకా పెరిగాయని అనిపించింది. చాలామంది పరిస్థితులు చూసిన తర్వాత... చాలా మందికి సహాయం చేయాలనిపించింది. వలస కార్మికులు, దినసరి కూలీలు, చిరు వ్యాపారుల పడిన ఇబ్బందులు కదిలించాయి. వాళ్ళందరూ పడిన కష్టాలు చూసిన తర్వాత డబ్బు విలువ బాగా తెలిసొచ్చింది.


చిత్రసీమలో ఎటువంటి మార్పులు వస్తాయంటారు?

ఏమో!? కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలని నేనూ మీలాగా కుతూహలంగా ఉన్నాను. ఒక ఆశావాద దృక్పథంతో, పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉన్నవాడిని కాబట్టి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నమ్ముతున్నా.


ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50మందితో చిత్రీకరణ చేయడం సాధ్యమేనా? షూటింగులో ఇబ్బందులు...

ప్రస్తుత పరిస్థితులలో నేనే కాదు... ఏ దర్శకుడైనా నిబంధనలు అన్నీ పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేస్తారని నమ్ముతున్నా. చిత్రీకరణలు ప్రారంభిస్తే గానీ, సెట్‌లో వచ్చే ఇబ్బందులు తెలియదు.


కరోనా నేపథ్యంలో కథ ఏమైనా రాస్తున్నారా?

నేను రాయడం లేదు. కానీ, చిన్న ఐడియా చెప్పి వేరే వాళ్లతో డెవలప్‌ చేయిస్తున్నా. బహుశా... ఓటీటీ వేదికలకు దాన్ని సిద్థం చేయించవచ్చు.


ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో సినిమా హాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

టీవీలు వచ్చిన కొత్తల్లో చాలామంది ‘ఇక సినిమా(హాళ్ళ)కు ఎవరు వెళతారు? ఇంట్లో హాయిగా కూర్చుని సినిమా చూడొచ్చు కదా!’ అన్నారట. అలాగే... వీసీఆర్‌లు, సీడీ ప్లేయర్‌లు వచ్చినప్పుడూ అన్నారట. అయితే, థియేటర్‌ ఇచ్చే అనుభూతి ప్రపంచంలోని ఏ వేదికా ఇవ్వలేదు. ఓటీటీలకు ఆదరణ పెరుగుతోందంటే... సినిమాలకు ఇంకా డిమాండ్‌ పెరుగుతున్నట్టే! సినిమా రంగానికి ఇంకొక మాధ్యమం దొరికిందని అనుకుంటున్నాను తప్ప... సినిమా హాళ్ళకు, సినిమాలకు ఓటీటీ వేదికలు అడ్డంకి అనుకోవడం లేదు.


బిజీగా ఉండడంతో ఇన్నాళ్లు మీలో గమనించనిదీ... లాక్‌డౌన్‌లో సమయం దొరకడంతో గుర్తించినదీ? 

లాక్‌డౌన్‌ ముందు నుంచి గమనిస్తున్నాను... నేను ఈ మధ్య పుస్తకాలు చదవడం తక్కువ అయిపోయింది. ఇంతకు ముందు ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని. ఇన్నాళ్ళూ నేను మిస్‌ అయిన పుస్తక పఠనం లాక్‌డౌన్‌లో బాగా సాగుతోంది. చాలా పుస్తకాలు చదువుతున్నాను. ఐ యామ్‌ వెరీ హ్యాపీ ఎబౌట్‌ ఇట్‌. ఈ మధ్య జపనీస్‌ పుస్తకం ‘ఐక గయ్‌’ చదివా. ఇంగ్లీషులో ఉందీ బుక్‌. అలాగే, రాబిన్‌ శర్మ రాసిన ‘ఫైవ్‌ ఏఎమ్‌ క్లబ్‌’ చదివా. అది చాలా మంచి పుస్తకం. ముళ్ళపూడి వెంకటరమణగారి ‘సాహిత్య సర్వస్వం’, ఓషో ‘క్రియేటివిటీ’ చదువుతున్నా.


హిందీ చిత్రసీమలో బంధుప్రీతి (నెపోటిజమ్‌), ఆశ్రిత పక్షపాతం (ఫేవరెటిజమ్‌) మీద పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నెపోటిజమ్‌, ఫేవరెటిజమ్‌ ఎంత వరకు ఉన్నాయి?

బంధుప్రీతి అనేది చిత్ర పరిశ్రమలోనే కాదు... అన్ని చోట్ల, అన్ని రంగాలలోనూ ఉంటుంది. ‘అది తప్పు’ అని నేను ఎప్పుడూ అనుకోను. చాలామంది దాన్ని ఒక పెద్ద కంప్లయింట్‌లాగా చెబుతున్నారు. వాళ్లతో నేను ఏకీభవించను. ప్రతిభకు బంధుప్రీతి అడ్డంకి కాదు. టాలెంట్‌ను ఏ నెపోటిజమూ ఆపలేదు. అందుకు వందల ఉదాహరణలు ఉన్నాయి. ఐ డోంట్‌ వాంట్‌ టు గెట్‌ ఇన్‌టు దట్‌ డిస్కషన్‌. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు వస్తే సరైన కారణాలు లేవు. తను సక్సెస్‌ ఫుల్‌ హీరో. చాలా సినిమాలు చేశాడు. ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ‘తను చనిపోవడానికి కారణాలు ఇవే’ అని ఎవరికివారు ఊహాగానాలు ప్రచారం చేస్తున్నట్టు ఉంది. సరైన కారణాలు తెలియకుండా మాట్లాడడం భావ్యం కాదని నా ఫీలింగ్‌. నో డౌట్‌... సుశాంత్‌ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. ఉయ్‌ మిస్‌ హిమ్‌!


ప్రతిభతో పైకొచ్చిన మీరు, అవకాశాల కోసం ప్రయత్నించే నటీనటులకు, ఇతరులకు ఇచ్చే సలహా?

కొత్తగా వచ్చేవాళ్లకి సలహాలు ఇచ్చేంత అనుభవం ఉందని అనుకోవడం లేదు. ఎవరైనా తమ ప్రతిభపై దృఢ విశ్వాసం, నమ్మకంతో ముందుకు వెళితే కళామతల్లి తప్పకుండా ఆదరిస్తుంది.


పార్ట్‌టైమ్‌ జర్నలిస్టులకు నిత్యావసరాలు, పోలీసులకు శానిటైజర్లు అందించడంతో పాటు సురభి కళాకారులకు మీరు సాయం చేశారు కదా. నాటక రంగంతో మీకున్న అనుబంధం గురించి?

నేను ఈ రోజు సినిమా రంగంలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నానంటే కారణం నాటకాలే! పరిషత్‌ నాటకాల నుంచి నా ప్రయాణం మొదలైంది. నాకు పునాది అక్కడే పడింది. అటువంటిది సురభి నాటక కళాకారులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలియగానే... ఛారిటీగానో, దానంగానో కాకుండా వాళ్లకు ఏదైనా చేయడం నా బాధ్యతగా భావించాను. ఇక ముందు కూడా నాటకరంగానికి నా వల్ల ఎంత అయితే అంత అండగా నిలబడతా.


కరోనా నుంచి మానవాళి నేర్చుకోవలసిన పాఠం??

జీవితంలో పరుగులు తీస్తున్న మనమంతా ఇప్పుడు ఆగి, నిదానంగా ఓసారి పునఃపరిశీలన చేసుకోవడానికి కరోనా అవకాశం ఇచ్చిందని పాజిటివ్‌గా తీసుకుందాం. ‘లాక్‌డౌన్‌ అని తెలియగానే మనం బంగారం, ఇళ్ళు, కార్లు కొనుక్కోవడానికో పరుగులు తీయలేదు. కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం పరుగులు తీశాం’ అని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో చాలామంది పోస్ట్‌ చేశారు. నాకది నిజమే అనిపించింది. ఇప్పటికైనా వ్యవసాయం, వ్యవసాయదారులు ప్రాముఖ్యం తెలుసుకొని... అవసరాన్ని గుర్తించి ప్రతి పౌరుడూ బాధ్యతగా ఉండాలి. ప్రాణం విలువ తెలుసుకోవాలి. ‘మన ఆరోగ్యం, తిండి, అలవాట్లు ఏంటి?’ అని పునరాలోచించుకోవడానికీ ఇదొక సదావకాశం. పాతబడ్డ ఇంటిని రెనొవేషన్‌ చేశామంటారు. అలా మన శరీరాన్ని, మనసుని రెనొవేట్‌ చేసుకుందాం. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితి త్వరలో పోయి, మళ్లీ పాత రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.


మీ శ్రీమతి చేసిన వంటలు ఫొటోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నారు!

సాధారణంగా షూటింగులు, సినిమా పనులతో బిజీగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం ఇంట్లో ఉండడం కుదరదు. పని ఒత్తిడితో సరిగా తినం కాబట్టి లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉండడంతో... నా శ్రీమతి ఎంతో ప్రేమతో, చాలా కష్టపడి ఆసక్తిగా వివిధ రకాల వంటలు చేస్తోంది. తనకు క్రెడిట్‌ రావాలి కదా! అందుకని, పోస్ట్‌ చేస్తుంటాను... ఆ ప్రశంసలు, అభినందనలు తనకు చూపిస్తే ఉత్సాహంగా ఉంటుందని!


మీరు కిచెన్‌లోకి వెళ్లడం, సాయం చేయడం...

ఇంట్లోవాళ్ల వంటను చెడగొట్టకుండా, వాళ్లను కామెంట్‌ చేయకుండా ఉండడమే నేను చేసే పెద్ద సహాయం. నిజాయతీగా చెప్పాలంటే... మా ఆవిడఇటు వైపు ఉన్న పుల్లను అటువైపు నన్ను పెట్టనివ్వదు. నేను చేస్తే డబుల్‌ పని అవుతుందనీ... పాడు చేస్తాననీ... నాపై అదొక పెద్ద కంప్లయింట్‌. తినడానికి తప్ప నేనెప్పుడూ వంటగది(కిచెన్‌)లోకి వెళ్లలేదు. వెళ్లను కూడా!


పవన్‌కల్యాణ్‌తో మీరు చేయనున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మీపై ఒత్తిడి...

‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత పవన్‌కల్యాణ్‌తో నేను చేస్తున్న చిత్రం కావడంతో అభిమానులు అందరిలో చాలా అంచనాలు ఉన్నాయి. నిజమే... ఆ అంచనాలతో పాటు నాపై ఒత్తిడి ఉంటుందని నాకు బాగా తెలుసు. అభిమానులందరూ పవన్‌కల్యాణ్‌ ఎలా ఉండాలని కోరుకుంటారో? ఎంత ఎనర్జిటిక్‌గా చూడాలని అనుకుంటారో? అలానే చూపిస్తా!  ప్రతి అభిమానీ, ప్రేక్షకుడూ మళ్లీ మళ్లీ చూసేలా పవన్‌కల్యాణ్‌గారి సినిమా ఉంటుంది.


ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ రెండు చిత్రాలు చేస్తున్నారు. చిత్రీకరణలు పునఃప్రారంభమైన తర్వాత ముందుగా అవి పూర్తి చేయాలి. మీ చిత్రం ప్రారంభమయ్యే లోపు మీరు మరో చిత్రం చేసే ఆలోచన ఉందా?

లేదండీ! పూర్తిగా నా శ్రద్ధాసక్తులు, ఏకాగ్రత పవన్‌గారి సినిమా స్ర్కిప్ట్‌ మీదే ఉన్నాయి. ఆ సినిమా తర్వాతే ఏ చిత్రమైనా ఉంటుంది.


మీ చిత్రాలలో మీ శ్రీమతికి నచ్చినది? అలాగే, మీ తల్లితండ్రులకు నచ్చినది?

నా శ్రీమతితో సహా ఆమె తరపు బంధువులు అందరికీ ‘మిరపకాయ్‌’ అంటే చాలా ఇష్టం. అలాగే, ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మా అమ్మానాన్నకు నా ప్రతి సినిమా నచ్చుతుంది. మా నాన్న పెద్దగా నా చిత్రాలు ఇష్టపడరు. (నవ్వుతూ...) ‘సర్లే! ఏదో...’ అనుకుంటారు. మా నాన్నగారికి ‘అతడు’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన త్రివిక్రమ్‌ వీరాభిమాని.

- సత్య పులగం

Updated Date - 2020-07-12T05:30:00+05:30 IST