నేపాల్ ప్రధాని ఓలీ, అధికార పార్టీ కో చైర్మన్ ప్రచండ చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం

ABN , First Publish Date - 2020-07-05T21:13:28+05:30 IST

నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ, అధికార పార్టీ నేషనలిస్ట్ కమ్యూనిస్ట్

నేపాల్ ప్రధాని ఓలీ, అధికార పార్టీ కో చైర్మన్ ప్రచండ చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం

ఖాట్మండు : నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ, అధికార పార్టీ నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) కో చైర్‌పర్సన్ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో సమష్టి నిర్ణయం కుదరలేదు. దీంతో సోమవారం కూడా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. 


నేపాల్ మీడియా కథనం ప్రకారం, కేపీ శర్మ ఓలీ, ప్రచండ ఆదివారం జరిపిన చర్చల్లో ఇరువురికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం జరగలేదు. దీంతో వీరిద్దరూ సోమవారం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. 


అధికార పార్టీలో అగ్ర నేతల మధ్య అభిప్రాయ భేదాలను తొలగించుకునేందుకు ప్రచండ ముందుగా దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారీతో సమావేశమయ్యారు. శీతల్ నివాస్‌లో బిద్యా దేవితో చర్చించిన తర్వాత ఆయన ఓలీ అధికారిక నివాసం బలువటర్‌కు వెళ్ళారు. అక్కడ ఓలీ, ప్రచండ చర్చలు జరిపారు. 


పార్లమెంటు సమావేశాలను ప్రొరోగ్ చేసినప్పటి నుంచి అధికార పార్టీలో భేదాభిప్రాయాలను తొలగించుకునేందుకు ఓలీ, ప్రచండ కృషి ప్రారంభించారు. 


జూన్ 30న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఓలీపై అదికార ఎన్‌సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓలీ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 


ఓలీ ప్రభుత్వం భారత భూభాగాలను నేపాల్ భూభాగాలుగా చూపుతూ మ్యాప్‌ను సవరించింది. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ కుట్ర పన్నుతున్నట్లు ఓలీ ఆరోపించారు. ఈ కుట్రలో కొందరు నేపాలీలు కూడా భాగస్వాములయ్యారన్నారు. దీంతో ఆయన సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓలీ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత దేశంపై విమర్శలు చేస్తున్నారని సొంత పార్టీ నేతల్లో అత్యధికులు ఆరోపించారు.


Updated Date - 2020-07-05T21:13:28+05:30 IST