నేపాల్ విమానం కూలిపోయిందా? ఆ శబ్దం అదేనా?

ABN , First Publish Date - 2022-05-29T21:56:32+05:30 IST

నలుగురు భారతీయులు సహా 22 మందితో ప్రయాణిస్తూ కనిపించకుండా పోయిన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం

నేపాల్ విమానం కూలిపోయిందా? ఆ శబ్దం అదేనా?

కఠ్మాండూ: నలుగురు భారతీయులు సహా 22 మందితో ప్రయాణిస్తూ కనిపించకుండా పోయిన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం 9N-AET కూలిపోయిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పర్యాటక నగరమైన పోఖరా నుంచి ఈ ఉదయం టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఆచూకీ గల్లంతైంది. 10.15 గంటలకు పోఖరాలో టేకాఫ్ అయిన విమానం 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. విమానంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీ ప్రయాణికులతోపాటు ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నట్టు విమానయాన సంస్థ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. 


2016లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇదే విమానయాన సంస్థకు చెందిన విమానం పోఖరా నుంచి జోమ్సోమ్‌కు వెళ్తూ సంబంధాలు కోల్పోయింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ చిన్న విమానం ఆ తర్వాత కూలిపోయింది. విమానంలో ఉన్న 23 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం మిస్సయిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది. నేల అస్సలు కనిపించడం లేదని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫణీంద్ర మణి పోఖరెల్ తెలిపారు.


విమానాన్ని కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే నడుపుతుండగా, కో పైలట్ ఉత్సవ్ పోఖ్రెల్, కిస్మి థాపా ఎయిర్ హోస్టెస్‌గా ఉన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులను అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠి ఉన్నట్టు విమానయాన సంస్థ విడుదల చేసిన ప్రయాణికుల జాబితాను బట్టి తెలుస్తోంది. విమానం ఘోరెపని వద్ద టవర్ నుంచి సంబంధాలు కోల్పోయింది. జోమ్సోమ్ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ కంట్రోలర్ ప్రకారం జోమ్సోమ్‌లోని ఘాసా వద్ద పెద్ద శబ్దం వచ్చింది. దీనిని బట్టి విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దీనిని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. 

Updated Date - 2022-05-29T21:56:32+05:30 IST