Modi : నూతన విద్యా విధానం దేశ గతిని మార్చేస్తుంది

ABN , First Publish Date - 2021-07-29T23:14:06+05:30 IST

జాతి నిర్మాణంలో జాతీయ నూతన విద్యా విధానం ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ కలలను సాకారం

Modi : నూతన విద్యా విధానం దేశ గతిని మార్చేస్తుంది

న్యూఢిల్లీ : జాతి నిర్మాణంలో జాతీయ నూతన విద్యా విధానం ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ కలలను సాకారం చేసేందుకు జాతి మొత్తం తమకు సహకరిస్తుందన్న భరోసా యువతకు వచ్చిందన్నారు. ‘నూతన జాతీయ విద్యా విధానా’నికి ఏడాది పూర్తైన సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. యువతకు సదావకాశాలు లభించడంతో పాటు తమ కలలకు తామే ఓ రోడ్ మ్యాప్‌ను రూపొందించేందుకు వీలుగా ఈ నూతన విద్యా విధానం ఉంటుందన్నారు. నూతన విద్యా విధానం రూపొందించడానికి నిపుణులు ఎంతో కష్టపడ్డారని, దీని ఆధారంగా ఎన్నో నిర్ణయాలు కూడా తీసుకున్నామని పేర్కొన్నారు.


మిగతా అన్ని అంశాల కంటే ఇదే చాలా ముఖ్యమైన అంశమవుతుందని, నూతన విద్యా విధానం భవిష్యత్ భారతానికి ఆధారభూతంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు ఎలాంటి విద్యను అందిస్తున్నామన్న అంశంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, యువత స్వేచ్ఛను కోరుకుంటున్నారని,  పది మందిలో గుర్తింపు రావాలని కోరుకుంటుందని, అందుకు ఈ నూతన విద్యా విధానం ఎంతో ఉపకరిస్తుందని మోదీ నొక్కి వక్కానించారు. యువత పరివర్తనాన్ని కోరుకుంటోందని, వేచి చూడడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదన్నారు. కోవిడ్ కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అయినా... మారిన పరిస్థితులను విద్యార్థులందరూ బాగా పుణికిపుచ్చుకున్నారని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. 


నూతన విద్యా విధానంలో సాంకేతికతను కూడా జోడించామని, సంకేత భాషకు ‘బోధన భాష హోదా’ను కల్పించామని, ఇలా కల్పించడం ఇదే ప్రథమమని ఆయన వివరించారు. ఇకపై దీనిని ఇంగ్లీష్, హిందీ, మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ బోధించే వీలుంటుందని, దీని ద్వారా భారతీయ సంకేత భాష మరింత పరిపుష్టమవుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ లాంటి ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో అందించడం వల్ల గ్రామీణులు, ఆంగ్లంపై పట్టులేని వారు కూడా విద్యను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. భాష ఆధారంగా ఎవరూ వివక్షకు గురి కాకూడదన్నదే తమ అభిమతమని మోదీ వివరించారు. మరిన్ని కోర్సులను కూడా ప్రాంతీయ భాషల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రాంతీయ భాషల ద్వారా విద్యా బోధన జరుగుతోందని మోదీ తెలిపారు. నూతన విద్యా విధానం కేవలం విద్యార్థుల భవిష్యత్తునే మార్చడం కాకుండా, దేశ చిత్రపటాన్నే పూర్తిగా మార్చేస్తుందని మోదీ ప్రకటించారు. విద్యార్థులు తమ తమ ఆశయాలను సాధించుకోడానికి ఎంతో ఉపకరిస్తుందని మోదీ తెలిపారు. నూతన విద్యా విధానంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ ను ప్రవేశపెట్టామని, దీని ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడి, పరిపుష్టమైన ఆర్థిక వ్యవస్థకు ఓ మార్గం ఏర్పడుతుందని మోదీ పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-29T23:14:06+05:30 IST