Advertisement
Advertisement
Abn logo
Advertisement

సందిగ్ధ దశలో నియోలిబరలిజం

స్వాతంత్ర్యానంతరం పౌర సమాజం నుంచి ఒక సంవత్సర కాలం లక్షలాది మంది రైతులు ఎండకు, వానకు, చలికి వెరవకుండా వ్యవసాయ చట్టాలని రద్దుచేయాలని ఒక రాజీలేని పోరాటాన్ని చేస్తున్నారు. ఒకే ఒక్క నాయకుడు కాక నలభై మంది ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్‌ మోర్ఛ నాయకత్వం ఈ ఉద్యమాన్ని నడుపుతున్నది. ఇది ఒక కొత్త ప్రజాస్వామ్య ప్రయోగం. ఈ ఉద్యమం కేవలం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం కాదు. ఇది గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న ‘నియోలిబరల్‌’ వృద్ధి నమూనాని ప్రశ్నిస్తున్నది. ఆర్థిక వ్యవస్థ కార్పొరేటీకరణకు వ్యతిరేకిస్తూ, దీని అమలుకు ప్రభుత్వం ఉపయోగిస్తున్న నిర్బంధాన్ని ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలని కూడా వాదిస్తున్నారు.


స్వాతంత్రోద్యమ కాలంలో ఉబికి వచ్చిన ప్రజల ఆశలను, ఆశయాలను, విలువలను, విశ్వాసాలను గుర్తిస్తూ, సెక్యులర్‌, సోషలిస్టు, డెమోక్రటిక్‌ విలువలే కాక స్వేచ్ఛ, స్వాతంత్రం, సమభావం, సోదరత్వం లాంటి సమున్నత విలువలను ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగం రూపొందింది. అన్నింటికి మించి మనకు వారసత్వంగా వచ్చిన ఎగుడు దిగుడు నిచ్చెన మెట్ల సమాజాన్ని మార్చవలసిన బాధ్యతను రాజ్యం మీద పెట్టింది. రాజ్యం సామాజిక మార్పునకు ఒక సాధనమా అన్న మౌలిక ప్రశ్న ఎలాగూ చర్చలో ఉంది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యం సామాజిక ఆర్థిక వ్యవస్థను మార్చలేకపోతే ప్రజలే ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొడతారు అని నిర్మొహమాటంగా చెప్పాడు. నిజానికి జరుగుతున్నదదే. ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక మార్పును చేపట్టేబదులు క్రమక్రమంగా బలమైన ఆర్థిక శక్తులకు ఆయుధంగా మారుతూ వచ్చాయి. గత మూడు దశాబ్దాలలో మరింత దూకుడుగా సామాజిక న్యాయం, సమానత్వ భావనకు పూర్తిగా వ్యతిరేకమైన ‘నియోలిబరలిజాన్ని’ అమలు చేయడం వలన ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరగడం వల్ల బలహీన వర్గాలు సంక్షోభంలో పడ్డాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవితాలలో ప్రజల శ్రమతో నిర్మించబడ్డ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడంతో ఈ వృద్ధి నమూనా పరాకాష్ఠకు చేరుకున్నది. రాజ్యం సమాజానికి, ప్రజలకు సేవ చేసే బదులు మార్కెట్‌కు దాసోహం అనడం వల్ల భిన్న ప్రజా ఉద్యమాలు ఏదో రూపంలో ముందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితి వల్లే ఎన్‌ఐఏ అధిపతి అజిత్‌ దోవల్‌ పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో మూడు యుద్ధాలు జరిగాయి, నాల్గవ యుద్ధం పౌరసమాజంతోనే అనే ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశారు.


ఈ నేపథ్యంలోనే రైతాంగ ఉద్యమాన్ని ఉద్యమ ఆకాంక్షలను అర్థం చేసుకోవలసి ఉంటుంది. నియోలిబరలిజం బలాన్ని రైతులు బాగా అర్థం చేసుకున్నారు. కనుకనే ఉద్యమ ప్రారంభంలోనే ఇది ఒక్కరోజు ఉద్యమం కాదని దీనిని నెలల తరబడి జరపవలసి ఉంటుందని ప్రకటించారు. ఉద్యమానికి రావడమే ఆరు నెలలకు సరిపోను ఆహార వస్తువులను ఇతర సామగ్రిని ట్రక్కులల్లో తీసుకుని ఒక సుదీర్ఘ పోరాటానికి సంసిద్ధులై వచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఉపయోగించిన చాలా వ్యూహాలను ప్రయోగించినా అవి పనిచేయలేకపోయాయి. ఇది లక్షలాది మంది రైతుల భాగస్వామ్యంతో, శాంతియుత పద్ధతుల ద్వారా సాగడంతో ప్రభుత్వం ఎక్కువ బలప్రయోగాన్ని కూడా ప్రయోగించలేకపోయింది. మోతాదుకు మించి బలాన్ని ప్రయోగిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం గ్రహించింది. ఉద్యమం సంవత్సర కాలం జరగడంతో ఒక కఠిన ప్రభుత్వం కూడా దిగిరావలసి వచ్చింది. తిరుగులేని నాయకుడు అని భావించిన నరేంద్రమోదీ లాంటి ప్రధానమంత్రి చట్టాలను రద్దుచేస్తామని ప్రకటించక తప్పలేదు. 


రైతాంగం వృద్ధి నమూనా తీరుతెన్నులని ఆరేడేళ్లుగా చాలా నిశితంగా గమనిస్తూనే ఉంది. నగదు రద్దు, జీఎస్టీ, స్వతంత్ర సంస్థల పాత్ర తగ్గించడం, రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించడం... ఇలా ఉదార ప్రజాస్వామ్య పునాదులు కదలడం వారు చూస్తూనే ఉన్నారు. ఆ అవగాహన వల్లే ఏ శక్తి కూడా ఈ ప్రతిఘటనని అడ్డుకోలేకపోయింది. ప్రతిపక్ష పార్టీలు కూడా దాదాపు నియోలిబరలిజానికి కట్టుబడి ఉండడం వల్ల, ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోవడం వల్ల, పార్లమెంటరీ రాజకీయాలలో ఒక ఖాళీ ఏర్పడింది. కొంత వరకు అస్తిత్వ, ప్రాంతీయ, ఉపప్రాంతీయ, కుల ఆధారిత రాజకీయాలు ముందుకు రావడంతో మత అస్తిత్వం బలమైన శక్తిగా ఎదిగింది. కాని ఈ అస్తిత్వ రాజకీయాలలో ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలూ, సామాజిక న్యాయం లాంటివి లేకపోవడం ఆ రాజకీయాల పరిమితులను చాటుతున్నవి. ఈ రాజకీయ వాతావరణం కార్పొరేట్లకు ఎంతో అనుకూలంగా మారింది. దీంతో భిన్న ఆర్థిక రంగాలని ఏ ప్రతిఘటన లేకుండా ఆక్రమిస్తూ పోతున్న ఈ ప్రక్రియ వ్యవసాయ రంగ కార్పొరేటీకరణను కూడా చేపట్టింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలని కార్పొరేట్లు ఆశ్చర్యపడే రీతిలో రైతాంగం వ్యతిరేకించడంతో మార్కెట్‌ కేంద్రితలియోలిబరలిజానికి కొంత బ్రేక్‌ పడింది. 


గత ఏడు దశాబ్దాలలో ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. రాజ్యం నయానో భయానో వాటిని దాటగలిగింది. కాని ఒక సంవత్సరం నుండి రాజీ లేకుండా, చాలా సాహసంగా రైతాంగం మూడు చట్టాలనే గాక మౌలికంగా నియోలిబరలిజాన్ని ప్రశ్నిస్తున్నా పాలకులు ఈ ఉద్యమ లోతులని అంచనా వేయలేకపోయారు. దీనితోబాటు ఒక మూడు నాలుగు నెలల్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అలాగే మరో నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు రావడంతో అధికార పార్టీ తీవ్ర సందిగ్ధంలో పడింది. కార్పొరేట్ల ఒత్తిడి ఎంత ఉన్నా తమ అధికారానికే ముప్పు ఏర్పడే స్థితిలో ప్రభుత్వం ఈ చట్టాలని వెనక్కి తీసుకోక తప్పలేదు.


ఈ ప్రకటనకి సమాజం నుంచి రెండు స్పందనలు స్పష్టంగా ముందుకు వచ్చాయి. ఒకటి: దాదాపు ఇరవై రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌తో సహా ప్రధానమంత్రి ప్రకటనను ఆహ్వానించాయి. భిన్న ప్రజా సంఘాలు కూడా తమ హర్షాన్ని ప్రకటించాయి. మీడియా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియా, లోతైన విశ్లేషణ లేకుండా ఇటుగా అటుగా సందిగ్ధ చర్చలను జరిపింది. రెండవది: కార్పొరేట్‌ మద్దతుదారులు, సిద్ధాంతకర్తలు, భావజాల సమర్థకులు ఈ చర్యలపై తీవ్రమైన విమర్శ పెట్టారు. ప్రభుత్వ విధానాలను గత ఆరేడేళ్లుగా సమర్థిస్తున్నవారు, ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని పొగిడినవాళ్లు ఈ నిర్ణయాన్ని హర్షించలేకపోతున్నారు. ఇందులో ప్రధానంగా అశోక్‌ వి. దేశాయ్‌ గతంలో ఆర్థిక మంత్రిత్వశాఖకి ముఖ్య సలహాదారు, నీతి ఆయోగ్‌లో కీలకపాత్ర నిర్వహిస్తున్న పనగారియా, సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో ప్రముఖుడు అనిల్‌ గన్వత్, పదిహేనవ ఫైనాన్స్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఎన్‌.కె. సింగ్‌ లాంటి వారున్నారు.


ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదిస్తూ వాళ్లు చేసిన వాదనలు ఆసక్తికరంగా ఉన్నాయి. వేగంగా వృద్ధిచెందుతున్న దేశానికి ఇది తీరని నష్టాన్ని కలిగిస్తుందని, దేశం ఒక దశాబ్దకాలం వెనక్కిపోయిందని, ఇలాంటి నిర్ణయాల వల్ల ఇక వచ్చే యాభై ఏళ్లలో దేశానికి భవిష్యత్తు లేదని, ఇలా పంటలకు మద్దతు ధర ఇస్తే దేశం దివాళా తీస్తుందని, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ నిర్ణయాలని పదిమంది రోడ్డు ఎక్కి అల్లరి చేయగానే వెనక్కి తీసుకుంటే ఇక ప్రజాస్వామ్య ప్రక్రియకు అర్థం ఏమిటని, ఇంతకాలం మార్కెట్‌కు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాల వల్ల బలహీనపడతాయని, అంతర్జాతీయ పెట్టుబడి రావడం కష్టమని, దేశ దశ దిశ గందరగోళంలో పడిపోయాయని చాలా బాధ వ్యక్తపరిచారు.


ఈ మద్దతుదార్ల బాధ వాళ్ల వ్యక్తిగత బాధకాదు. ఇది కార్పొరేట్ల బాధ. వృద్ధికి మార్కెట్‌ పాత్ర తప్ప వేరే మార్గం లేదని, రాజ్యం పాతకాల దిశలో పోతున్నదన్నది వాళ్ల బాధ. ప్రజాస్వామ్యంలో శాంతియుత ప్రజా ఆందోళనలు ఒక అంతర్భాగమని, ప్రభుత్వాల విధానాలను ప్రశ్నించే హక్కు ప్రజలకుంటుందనే ప్రజాస్వామ్య మౌలిక విలువలని అంగీకరించే పరిస్థితిలో వాళ్లు లేకపోవడం నియోలిబరలిజం పట్టును తెలుపుతున్నది. ఇంకా ముందుకు వెళ్లి దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్యమే పెద్ద అడ్డంకి అని వాదించే దశకి చేరవచ్చు. వృద్ధి లక్ష్యమేమిటన్న స్పష్టత వీళ్లకు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, విద్యారోగ్యాలు అందుబాటులో లేకపోవడం లాంటి సవాళ్లకు జవాబు లేకుండా వృద్ధి నమూనా పేరిట సిద్ధాంతీకరించడం భావజాలాన్ని పెంపొందించడంలో వీళ్లు మునిగితేలుతున్నారు. అసలు మనుషులు లేకపోతే ఆ వృద్ధికి అర్థమేమిటి, లక్ష్యమేమిటి అనే మౌలిక ప్రశ్నలను అడగవలసిన దశ ఇది.


నియోలిబరలిజం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో పడింది. ఈ నమూనాకి అగ్రనాయకత్వం వహిస్తున్న అమెరికా సంక్షేమ కార్య్రకమాలను చేపట్టక తప్పడంలేదు.  ఈమధ్యే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దాదాపు రెండు ట్రిలియన్‌ డాలర్లు సామాజిక సంక్షేమానికి కేటాయించాలని ప్రతిపాదించాడు. ఈ నమూనాకి ఇరుసులా ఇంతకాలం పనిచేస్తున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (WTO) చైనా, అమెరికా బలాబలాల పోటీలో చిక్కుకుంది. ఈమధ్యే ఉత్పత్తిని పెంచడానికి కృషిచేసిన యుని లీవర్‌ సంస్థ అధిపతి ‘వృద్ధి’ యువకులకు అవకాశాలు పెంచాలని, లేకుంటే అసంతృప్తి పెరిగి సమాజంలో తీవ్ర అలజడులు జరుగుతాయని హెచ్చరించారు. మొత్తంగా నిన్నటి దాకా నియోలిబరలిజం దారి తప్ప వేరే ఏ మార్గం లేదనే చర్చ దిశను మార్చుకున్నది. సంపద సృష్టి దేశానికి అవసరమే కావచ్చు, కాని ప్రజలను బలిపెట్టి ముందుకు సాగడం సాధ్యం కాదని రైతాంగ ఉద్యమం స్పష్టపరిచింది. మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నా ఇంకా నెరవేరని డిమాండ్స్‌ ఉన్నాయి. అందుకే ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ తీవ్రమవుతున్న వైరుధ్యాన్ని పాలకులు ఎలా పరిష్కరిస్తారోనని ఆసక్తిగా చరిత్ర ఎదురుచూస్తున్నది.

ప్రొ. జి. హరగోపాల్‌

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...