Sep 29 2021 @ 01:42AM

నేను ఎవర్నీ విమర్శించలేదు!

‘‘నేను ఎవర్నీ విమర్శించలేదు... చిత్రంలోనూ, ప్రీ-రిలీజ్‌ వేడుకలోనూ! రాజకీయ కోణాలకు సంబంధం లేకుండా తటస్థ కథాంశంతో సినిమా తీశా. ప్రీ-రిలీజ్‌లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌లో పారదర్శకత ఉంటుంది. ఆ తర్వాతి అడుగు ఏంటని అడిగా. అందులో తప్పేముంది? మంత్రిగారిని కలిసే ఛాన్స్‌ వస్తే... ఆయన్నూ అదే అడిగేవాణ్ణి’’ అని దేవ కట్టా అన్నారు. ఆయన దర్శకత్వంలో సాయితేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. జె. భగవాన్‌, జె. పుల్లారావు నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దేవ కట్టా చెప్పిన సంగతులివీ...


‘‘రిపబ్లిక్‌’ తీయడానికి స్ఫూర్తి నా అజ్ఞానమే. ప్రజాస్వామ్యం, నియంతృత్వం గురించి మనం మాట్లాడుతుంటాం. ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఉందనే భ్రమల్లో మనం బతుకుతున్నాం. అయితే, మనకు వాటి గురించి ఎంత లోతుగా తెలుసు? నాకైతే  తెలియదు. అందుకే  సిగ్గుపడి పరిశోధన చేసి ఈ కథను సిద్ధం చేశా. ఐడియాగా ఉన్నప్పుడే తేజ్‌కు చెప్పా. ‘నేనే చేస్తా. నాతో చేయాలి’ అని ప్రామిస్‌ చేయించుకున్నాడు. పూర్తి స్వేచ్ఛనిచ్చి చిత్రం చేశాడు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ, చట్టసభ వ్యవస్థ... మూడు గుర్రాలు అనుకుంటే ఓ గుర్రం గాడి తప్పినట్టు అనిపిస్తే మిగతా రెండూ పట్టుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా ఉంటుంది. మనం ఓటు వేసిన నాయకుడు నియంతలా వ్యవహరిస్తే ఎంజాయ్‌ చేస్తున్నాం. అది తప్పు. ఇటువంటి అంశాలెన్నో సినిమాలో ఉంటాయి. ప్రధానంగా  బ్యూరోక్రాట్‌ పాయింట్‌లో ఉంటుంది.’’


పవన్‌ మనసులోంచి వచ్చిన మాటలు!

‘‘ప్రీ-రిలీజ్‌ వేడుకలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిగతం. మనం అంగీకరించినా... విభేదించినా... ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టు భయం లేకుండా మాట్లాడతారు. ఆయన వ్యాఖ్యల ప్రభావం సినిమాపై ఉంటుందని అనుకోను. ఒకవేళ వైసీపీ శ్రేణులు వందమంది దూరంగా ఉన్నా... ఒక్కరు సినిమా చూస్తే, మిగతా వందమందినీ తీసుకువెళతారు.’’ 


చంద్రబాబు-వైయస్‌ జీవితాలపై స్ర్కిప్ట్‌ రెడీ!

‘‘నారా చంద్రబాబునాయుడు, వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితాలను ఆధారం చేసుకుని స్ర్కిప్ట్‌ రాశా. ‘ఇంద్రప్రస్థం’ టైటిల్‌ అనుకున్నా. వాళ్లిద్దరి కాలేజీ జీవితం నుంచి వైయస్‌ మరణం వరకూ ఉంటుంది. మూడు భాగాలుగా లేదంటే రెండు భాగాలుగా తీయవచ్చు... ‘గాడ్‌ ఫాదర్‌’లా! వెబ్‌ సిరీ్‌సలా తీయవచ్చు. నిర్మాత విష్ణువర్ధన్‌తో ఎన్టీఆర్‌ బయోపిక్‌, ఈ కథ గురించి చర్చించా. ఆయన చంద్రబాబు, వైయస్‌ జీవితాలపై సినిమా తీస్తున్నట్టు తెలిపారు. నాకు అభ్యంతరం ఏమీ లేదు. అయితే, నా కథలోని అంశాలు తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆమధ్య చెప్పా. నా కథ గురించి పరిశ్రమలో పెద్ద హీరోలకూ తెలుసు. చంద్రబాబు... వైయస్‌... ఎవరి అభిమానులైనా మరొక నాయకుణ్ణి గౌరవించే విధంగా ‘ఇంద్రప్రస్థం’ రాశా.’’

‘బాహుబలి’ సిరీస్‌ ఎందుకు ఆగిందంటే?

‘‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ చూస్తే... చివరి సీజన్‌లో షాట్లు కూడా తొలి సీజన్‌ ఎపిసోడ్స్‌లో కనిపిస్తాయి. పదేళ్లు కథ, పదిహేనేళ్లు స్ర్కీన్‌ప్లే రాశారు. ఎంతో స్పష్టతతో, ఓ ప్రణాళికతో తీశారు. ఆ విధంగా చేయాల్సిన సిరీస్‌ ‘బాహుబలి: బిఫోర్‌ బిగినింగ్‌’. ఒకట్రెండేళ్లలో రాసేసి, తీయలేం. కానీ, మమ్మల్ని తొందరపెట్టడంతో కొంత చిత్రీకరణ చేశాం. ఆ తర్వాత నేను, ప్రవీణ్‌ (సత్తారు) సిరీస్‌ పక్కనపెట్టి... రాసిందంతా ఇచ్చి, అదే విషయం నెట్‌ఫ్లిక్స్‌ వాళ్లతో చెప్పాం. ఒకవేళ పిలిస్తే... మధ్యలో ఎపిసోడ్స్‌కి దర్శకత్వం వహిస్తా. జీవితాంతం దానిపై కూర్చోలేం. ‘రిపబ్లిక్‌’కు ముందు వచ్చిన విరామ సమయంలో సుమారు పది కథలు సిద్ధం చేశా.’’


తేజ్‌తో మాట్లాడిన తర్వాతే!

‘‘సాయితేజ్‌కు రోడ్డు ప్రమాదమైన తర్వాత అతణ్ణి కలిశా. తనతో మాట్లాడిన తర్వాతే అక్టోబర్‌ 1న చిత్రాన్ని విడుదల చేయాలని మేం నిర్ణయించాం. తను ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ కూడా చూశాడు. తేజ్‌ కోమాలో ఉన్నాడని పవన్‌కల్యాణ్‌ అన్నది మీడియాలో కథనాలు ప్రసారమైన సమయంలో! ఇప్పుడు తేజ్‌ కోలుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు. ఆహారం తీసుకుంటున్నాడు. అయితే, పూర్తి ఆరోగ్యంతో రావడానికి కొంత సమయం పడుతుంది. ‘రిపబ్లిక్‌’ లొకేషన్స్‌ కోసం బండి మీద నుంచి వెళ్తున్న సమయంలో నేను కిందపడ్డా. గాయం కాలేదు. కానీ, గట్టి దెబ్బ తగిలింది. దాన్నుంచి కోలుకోవడానికి రెండు వారాలు పట్టింది. అంత యాక్సిడెంట్‌ జరిగినప్పుడు సాయితేజ్‌ కోలుకోవడానికి సమయం పడుతుంది.’’