పోటీ లేకపోయినా ఓటమి భయం.. వైసీపీ పతనానికి ఇదే సాక్ష్యం!

ABN , First Publish Date - 2022-06-22T23:57:13+05:30 IST

ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ. ప్రతిపక్షమన్నదే లేకుండా పాలించాలని కలలు కంటున్న పార్టీ కూడా. కానీ ఆ పార్టీ ఉప ఎన్నికల్లోనూ ఆపసోపాలు పడుతోంది. సహజంగా ఉప ఎన్నికలు ప్రభుత్వ అనుకూల తీర్పునే ఇస్తాయి. ఎప్పుడో ఒకటీ అరా ఫలితాలు వేరుగా వస్తాయి. కానీ నిత్యం సంక్షేమ మంత్రం జపించే వైసీపీ సర్కారుకు ..

పోటీ లేకపోయినా ఓటమి భయం.. వైసీపీ పతనానికి ఇదే సాక్ష్యం!

వైసీపీ..ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ. ప్రతిపక్షమన్నదే లేకుండా పాలించాలని కలలు కంటున్న పార్టీ కూడా. కానీ ఆ పార్టీ ఉప ఎన్నికల్లోనూ ఆపసోపాలు పడుతోంది. సహజంగా ఉప ఎన్నికలు ప్రభుత్వ అనుకూల తీర్పునే ఇస్తాయి. ఎప్పుడో ఒకటీ అరా ఫలితాలు వేరుగా వస్తాయి. కానీ నిత్యం సంక్షేమ మంత్రం జపించే వైసీపీ సర్కారుకు ఉప ఎన్నికలంటేనే గుండె గుభేలు మంటుంది. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా మొత్తం మంత్రులందరినీ దించేస్తుంది. ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ మోహరింప చేస్తుంది. ఇంతటితో ఆగుతుందా అంటే ఊహూ... వీలుంటే దొంగ ఓటర్లనూ తీసుకువస్తుంది. ఇందుకు గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికే సాక్ష్యం. గతంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసిందో ఆ పుణ్యక్షేత్రంలో ఎవరిని అడిగినా చెపుతారు. ఎక్కడికక్కడ దొంగ ఓట్లు వేయించారు. ఇందుకోసం ఏకంగా బస్సులలో దొంగ ఓటర్లను తీసుకురావడం తిరుపతి ప్రజలు ఎన్నటికీ మరువలేరు. ఆ ఎన్నికల్లో 5లక్షల మెజార్టీని టార్గెట్‌గా పెట్టుకున్నారు. సీఎం జగన్‌ పాదయాత్రలో ఫిజియోగా చేసిన డాక్టర్‌ గురుమూర్తిని బరిలోకి దించారు. మొత్తం వైసీపీ గణమంతా తిరుపతిలోనే వాలిపోయింది. ఇక పోలింగ్‌నాడు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు 2లక్షల 70 వేల ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు.  


ఇప్పడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనూ అలాంటి పరిస్థితే.  ఆత్మకూరులో ఉన్నదే 2 లక్షల 30 వేల ఓట్లు. కానీ లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంది. జనసేన తొలినుంచి ఈ ఎన్నికను పట్టించుకోలేదు. కానీ బీజేపీ రంగంలోకి దిగింది. ఏపీలో బీజేపీ వైసీపీకి సపోర్ట్‌ చేస్తోందని జనం గట్టిగా నమ్ముతున్నారు. దీంతో బీజేపీ శీల పరీక్షకు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. తాను వైసీపీకి వ్యతిరేకమని చెప్పడానికి బీజేపీకి ఆత్మకూరు ఉప ఎన్నిక ఒక అవకాశమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలోనే ఆ పార్టీ తేలిపోయిందంటున్నారు. నిజానికి మేకపాటి రాజమోహనరెడ్డి మేనల్లుడు బిజువేముల రవీంద్రనాథరెడ్డి బీజేపీ తరపున పోటీ చేయాలని భావించారు. ఇందుకోసం ఆయన నెల్లూరు బీజేపీ కార్యక్రమంలో ఆ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. కానీ సాయంత్రానికల్లా లెక్కలు మారిపోయాయి. రవీంద్రనాథరెడ్డికి టిక్కెట్‌ ఇచ్చేందుకు బీజేపీ సుముఖత చూపలేదుట.  ఈ విషయంలో  బీజేపీ ఎత్తుగడ మరొకలా ఉందని చెపుతున్నారు. అసలు ఆత్మకూరు ప్రజలతో సంబంధం లేని వ్యక్తిని నిలబెట్టడం ద్వారా వైసీపీకి ఓటింగ్‌ శాతం పెరిగేలా చేయడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్రనేతలు పనిచేస్తున్నారని చెపుతున్నారు. అందుకే బీజేపీలో సురేశ్ రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, సుధాకర్ రెడ్డి వంటినేతలకు ఎక్కువ సంఖ్యలో ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, వారిని కాదని, కావలికి చెందిన భరత్ కుమార్ ని పోటీలోకి దించారు. ఇదంతా బీజేపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందమేననే చర్చ సాగుతోంది.


ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు...మేకపాటి సొంతూరు. మేకపాటి గౌతమ్ వరసగా రెండుసార్లు గెలిచారు. మూడేళ్లు మంత్రిగా ఉన్నారు. కానీ ఆయన ఆత్మకూరుకి చేసిందేమీ లేదనే చెప్పాలి. ఐటీ, పరిశ్రమల మంత్రిగా ఒకే ఒక్క పరిశ్రమని ఆత్మకూరుకు తెచ్చినా, ఆ ఒక్క పరిశ్రమనీ కడప జిల్లాకి తరలించుకుపోయారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. టీడీపీ మహానాడుకి ఎన్నడూ లేనంతగా జనం రావడమూ వైసీపీకి మింగుడుపడటం లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలన్నీ సమస్యలుగానే ఉన్నాయి. వరదల సమయంలో తీవ్ర నష్టం జరిగినా పెద్దగా పట్టించుకున్నదీ‌ లేదు. వరి సాగు గిట్టుబాటు కాకపోవడంతో, ప్రస్తుతం రైతులు తమకి తామే క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. ఈ పరిణామాల వల్ల ఓటింగ్ శాతం బాగా తగ్గినా... మెజార్టీ రాకున్నా పరువు పోతుందని... ఆ ప్రభావం రాబోయే ఎన్నికలపై పడుతుందనే భయం వైసీపీని హైరానా పెడుతోంది. దీంతో వైసీపీ నేతలందరూ రంగంలోకి  దిగారు.అనుకున్నంత మెజార్టీ రాదనే విషయం తేలిపోవడం వలనే వైసీపీ తన బలగాన్నంతా దించిందని చెపుతున్నారు. 


ఆత్మకూరులో పోటీ పెద్దగా లేకపోయినా వైసీపీ హైరానా పడటానికి జనం వ్యతిరేకతే కారణం.  ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్‌ ప్రజలదగ్గరకు వచ్చినప్పుడు మూడుదశాబ్దాలుగా మీ కుటుంబమే అధికారంలో ఉంది, నియోజకవర్గానికి మీరేం చేశారని నిలదీస్తున్నారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో జనం ఇబ్బందులు పెరిగాయి. ఎంతో చేశామని చెప్పుకునే వైసీపీ నేతలకు జనానికి డబ్బు ఇచ్చామనే మాట తప్ప, మరొక ప్రజోపయోగమైన పనిగురించి చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ఈక్రమంలో పోటీ పెద్దగా లేకపోయినా, బంపర్‌ మెజార్టీ రావడం అసాధ్యమని వైసీపీకి అర్థమైంది. మరీ పరువు పోగొట్టుకునే మెజార్టీ రాకూడదని ఆ పార్టీనేతలంతా దేవుడిని ప్రార్థిస్తున్నారుట. అందుకే ఓటింగ్‌ శాతం పెంచాలని ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నారు. చివరకు ‌ ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలెట్టారు. ఖచ్చితంగా ఓట్లు పడుతాయన్న ప్రాంతాల్లో రూ.500లు, మరికొన్ని చోట్ల రూ.1000లు, రూ.1500లు పంపిణీ చేస్తున్నారు. బాగా క్లిష్టంగా ఉన్నచోట ఓటుకి రూ2వేలు పంపిణీ చేస్తున్నారు. పార్టీ నేతలు, వాలంటీర్ల ద్వారా బహిరంగంగా పంపిణీ చేస్తున్నా అధికారులు కొంగజపం చేస్తున్నారు.  


మొత్తం మీద ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడం అసాధ్యమేమీ కాదు. కానీ ఆ పార్టీ అదేదో అసాధ్యమైన విషయంలా భయపడుతూ ఆఖరికి డబ్బు పంపిణీకి సిద్ధమైంది.  ఉప ఎన్నిక అంటేనే సర్కారువారి సేవలో అధికారులు తరిస్తుంటారు. అయినా వైసీపీకి తనపైన తనకే నమ్మకం లేదు. ఎందుకంటే జనం వ్యతిరేకత ఏమిటో ఆపార్టీ రుచిచూస్తోంది. గడప గడపలో సెగ తగులుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నిక ఆ వ్యతిరేకతకు ఓ ఉదాహరణగా నిలుస్తుందేమోనన్న వైసీసీ అసలు భయమట. సో... ఆత్మకూరు ఉప ఎన్నిక వైసీపీకి ఓ లిట్మస్‌ టెస్ట్‌లా మారుతుందేమోనని ఆ పార్టీనే భయపడుతోంది. ప్రతిపక్షం లేని అధికారాన్ని కలలుగన్న వైసీపీ ప్రతిపక్షమే పోటీలో లేని చోట ఇంతలా మల్లగుల్లాలు పడటం దేనికి సంకేతమో ఆ పార్టీ నేతలే చెప్పాలి.



Updated Date - 2022-06-22T23:57:13+05:30 IST