నెల్లూరు, ప్రకాశంపై తుఫాను దెబ్బ

ABN , First Publish Date - 2022-05-13T08:49:35+05:30 IST

అసాని తీవ్ర తుఫానుపై వాతావరణశాఖ అంచనాలు తప్పడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది.

నెల్లూరు, ప్రకాశంపై తుఫాను దెబ్బ

  • ఐఎండీ అంచనాలు తప్పడంతో భారీగా నష్టం
  • గమనం ఖరారులో వాతావరణశాఖ వైఫల్యం
  • ఉత్తర కోస్తాపైనే ఆ శాఖ దృష్టి
  • దక్షిణ కోస్తాలో కుంభవృష్టి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌):  అసాని తీవ్ర తుఫానుపై వాతావరణశాఖ అంచనాలు తప్పడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. అసానిపయనంపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా తప్పిందన్న వాదన వినిపిస్తోంది. ప్రధానంగా బుధవారం నుంచి దక్షిణ కోస్తాలో ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నా, అందుకు కారణాలను విశ్లేషించలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.  విశాఖపట్నం, అమరావతి వాతావరణశాఖ అధికారులు ఐఎండీ-ఢిల్లీ అధికారుల ఆదేశాలను పాటించారే తప్ప, స్థానికంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులను నివేదించలేకపోయారు. తీవ్ర తుఫాన్‌ బంగాళాఖాతంలో వాయవ్యంగా పయనించి, ఉత్తర కోస్తా వైపు వచ్చిన తరువాత దిశ మార్చుకుని తీరానికి సమాంతరంగా ఒడిసా వైపు వెళుతుందని ఐఎండీ తొలుత అంచనా వేసింది. దానికి అనుగుణంగానే మంగళవారం సాయంత్రం వరకు పయనించిన అసాని ఆ తరువాత నెమ్మదిగా దిశ మార్చుకుంది. తీరాన్ని దాటాక మళ్లీ సముద్రంలోకి ప్రవేశించి ఒడిసా వైపు వెళుతుందని ఐఎండీ చెబుతూ వచ్చింది. అయితే మంగళవారం సాయంత్రం తర్వాత దిశ మార్పు నుంచి తీరం దాటే వరకు అన్నీ దాని అంచనాకు భిన్నంగా జరిగాయి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల యంత్రాంగాలు భారీఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇటువంటి హెచ్చరికలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఇవ్వలేదు.


ప్రకాశం జిల్లా అతలాకుతలం..

 ప్రకాశం జిల్లాను అసాని అతలాకుతలం చేసింది. రెండు రోజుల్లో 100 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శింగరాయకొండ మండలంలో 371.60 మి.మీ, జరుగుమల్లిలో 267.40 మి.మీ, ఒంగోలు, కొత్తపట్నం, బి.పేటతోపాటు మరో ఏడెనిమిది మండలాల్లో 100 నుంచి 170 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మినుము పత్తి, మొక్కజొన్న, పప్పుశనగ ఇతర పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న మిర్చి తడిసిపోయింది. జామ, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన తోటలు, కూరగాయలు, ఆకుకూరల తోటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. కొత్తపట్నం, సింగరాయకొండ తదితర మండలాల్లోని దాదాపు వెయ్యిహెక్టార్లలోని ఉప్పు కొఠార్లు నీట మునిగి సాగుదారులు నష్టపోయారు.రోడ్లు చాలా చోట ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు దెబ్బతినడంతోపాటు స్తంభాలు పడిపోయి, లైన్లు తెగిపోయి ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని వందలాది గ్రామాలు మంగళ, బుధవారాల్లో రాత్రి పూట కరెంటు లేక అంధకారంలో ఉండిపోయాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో అనేక మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  బాపట్ల జిల్లాలోనూ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి ఓదెలు నీట మునిగాయి. మొక్కజొన్న తడిసిముద్దయింది.

 

నెల్లూరు జిల్లాలో 12,292 ఎకరాల్లో పంటనష్టం

ఈ జిల్లాలో 12,292 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి.  10,456 ఎకరాల్లో పత్తి, 795 ఎకరాలు వరి, వేరుశనగ 697, మినుము 230, నువ్వులు 84, మొక్కజొన్న 30 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది..  


అది మయన్మార్‌ రథం కాదు.. మందిరం..

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం యం.సున్నాపల్లి సముద్ర తీరానికి మంగళవారం కొట్టుకువచ్చినది మయన్మార్‌ రథం కాదని, మందిరం అని మెరైన్‌ పోలీసులు వెల్లడించారు. అందులో ప్రమాదకరమైన పదార్థాలు ఏమీ లేవని చెప్పారు.


నేడు కోస్తా, సీమలో వర్షాలు..

దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. ప్రస్తుతం కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో గురువారం రాయలసీమ, కోస్తాల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Read more