అస్తవ్యస్తంగా రోడ్డు విస్తరణ!

ABN , First Publish Date - 2022-06-19T03:37:04+05:30 IST

నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల నుంచి డైకస్‌ రోడ్డు వరకు నెల్లూరు - పొదలకూరు రోడ్డు 4లైన్ల విస్తరణ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

అస్తవ్యస్తంగా రోడ్డు విస్తరణ!
పొదలకూరు రోడ్డు మార్జిన్‌లో పారుతున్న నీరు

తొలగించని ఆక్రమణలు

రహదారిపైనే మురుగు, వర్షం నీరు

అవస్థల్లో వాహన చోదకులు

నెల్లూరు(సాంస్కృతికం), జూన్‌ 18 : నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల నుంచి డైకస్‌ రోడ్డు వరకు నెల్లూరు - పొదలకూరు రోడ్డు 4లైన్ల విస్తరణ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దాదాపు 18 నెలలుకుపైగా ఆ ప్రాంత ప్రజలు ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే నరకం కనిపించేలా గుంతలు ఉండేవి. అలాంటి రోడ్డును 4లైన్ల రోడ్డుగా విస్తరించారు. కానీ ఈ రోడ్డు ఎంత కాలం ఉంటుంది అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఈ రోడ్డుకు ఇరువైపుల ఆక్రమణలు కారణంగా వర్షం వస్తే డ్రైనేజీ కాలువలు లేక నీరంతా రోడ్డుపైనే వరదలా పారుతుంది. రోడ్డు విస్తరణకు ముందు, తర్వాత గానీ అధికారులు రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలు తొలగించలేదు. రోడ్డుకు రెండు వైపులా డ్రైనేజీ, వర్షం నీరు పారుదలకు ఏర్పాటు చేయకపోవడంతో మురుగునీరంతా రోడ్డుమీదకు చేరుతోంది. అలాగే ఎస్పీ బంగ్లా వద్ద ఉన్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద విద్యుత్‌ స్తంభాలు అస్తవ్యస్తంగా ఏర్పాటు చేయడంతో అక్కడ 4లైన్ల రోడ్డు వేయలేకపోయారు. పైగా అక్కడ మలుపు ఉండడం వలన  ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. ఆ విద్యుత్‌ స్తంభాలను క్రమబద్ధీకరిస్తే అక్కడ దాదాపు 20 అడుగుల మేరకు రోడ్డు విస్తరించవచ్చు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోలేదు. డైకస్‌రోడ్డు నుంచి కొత్తూరు వరకు ఉన్న 2లైన్ల రోడ్డు అధ్వానంగా ఉంది. ఆ రోడ్డుపై ప్రయాణించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు 3 కిలోమీటర్ల దూరం రోడ్డుకి రెండు వైపుల ఆక్రమణలు ఉండడంతో వర్షం నీరు రోడ్డుపైనే పారుతుంది. దీని వలన మరమ్మతులు చేసిన కొన్ని వారాలకే ధ్వంసం అవుతోంది. రూరల్‌ ఎమ్మెల్యే ఈ రోడ్డు కొంత భాగం మరమ్మతులు చేయిస్తున్నా మిగిలిన రోడ్డు గతుకులమయమై నరకం చూపిస్తోంది. ఈ రోడ్డు వెంబడి ఆక్రమణలతో వర్షం నీరు వెళ్లేందుకు దారిలేక రామకోటయ్యనగర్‌ సెంటర్‌ చెరువులా మారింది. రోడ్డు వెంబడి రెండు వైపులా ఆక్రమణలు పూర్తిగా తొలగించి, డ్రైనేజీ కాలువలు తీయకుంటే కొత్తగా వేసిన రోడ్డు మూణ్ణాళ్ల ముచ్చటవుతోంది. ఈ రోడ్డు వెంబడి దాదాపు 6 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-19T03:37:04+05:30 IST