కదం తొక్కిన రైతన్నలు

ABN , First Publish Date - 2021-01-27T05:25:25+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీలో మంగళవారం చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి మద్దతుగా నెల్లూరులోనూ భారీ ర్యాలీ జరిగింది.

కదం తొక్కిన రైతన్నలు
వీఆర్సీ సెంటర్‌లో మాట్లాడుతున్న రైతు సంఘ ప్రతినిధులు

నెల్లూరులో ట్రాక్టర్‌, ఆటో, ఎడ్లబండ్లతో ప్రదర్శన

రైతు నల్లచట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ 


నెల్లూరు(వైద్యం) జనవరి 26 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీలో మంగళవారం చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి మద్దతుగా నెల్లూరులోనూ భారీ ర్యాలీ జరిగింది. రైతులు, కార్మికులు ట్రాక్టర్‌, ఎడ్లబండి, ఆటోలతో నగరంలో నిరసన ప్రదర్శన చేశారు. అయ్యప్పగుడి నుంచి ఆర్టీసీ వరకు, శెట్టిగుంట రోడ్డు నుంచి వీఆర్సీ వరకు రెండు బృందాలు ఈ నిరసన ప్రదర్శన చేపట్టాయి. టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వమే కనీస మద్దతు ధర కల్పించకపోతే ప్రైవేట్‌ వ్యాపారులు ఎలా న్యాయం చేస్తారని పేర్కొన్నారు. రైతు కంటతడి పెడితే అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడ ఉండవని హెచ్చరించారు. అంబానీ, ఆదానీల కోసం రైతుల భవిష్కత్తును శాసించటం దుర్మార్గమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, రైతు సంఘం రాష్ట్ర నేత శ్రీరాములు, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి, బలిజేపల్లి వెంకటేశ్వర్లు, కిశోర్‌బాబులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాజీ లేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు అజయ్‌కుమార్‌, శ్రీనివాసులు, నాగేశ్వరరావు, మూలం రమేష్‌, కత్తి శ్రీనివాసులు, షేక్‌ మస్తాన్‌బీ, శివకుమారి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం, కావలి, అనంతసాగరం తదితర ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరిగాయి.  

Updated Date - 2021-01-27T05:25:25+05:30 IST