కాలాపానీ జైలుని తలపిస్తున్న నెల్లూరు కోవిడ్ సెంటర్

ABN , First Publish Date - 2020-07-05T19:50:55+05:30 IST

కోవిడ్ రోగితో కాదు.. వ్యాధితో పోరాడాలి.. నిత్యం మనకు ఫోన్లో వినిపించే మాటలు. కానీ..

కాలాపానీ జైలుని తలపిస్తున్న నెల్లూరు కోవిడ్ సెంటర్

నెల్లూరు: కోవిడ్ రోగితో కాదు.. వ్యాధితో పోరాడాలి.. నిత్యం మనకు ఫోన్లో వినిపించే మాటలు. కానీ నెల్లూరు జీజీహెచ్‌లో మాత్రం ఆహారం కోసం పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది. ఎండిపోయిన చపాతీలు, ఉప్పు, కారంలేని పప్పు, నీళ్ల సాంబారే వాళ్లకు గతి అవుతోంది. ఏపీలో మొట్టమొదటి కరోనా కేసు నెల్లూరులోనే నమోదయింది. ఇటలీ దేశంలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థి ఒకరు మార్చి నెలలో నెల్లూరుకు రాగా.. కరోనా లక్షణాలు కనిపించాయి. మార్చి 9, కరోనా రోగిని గుర్తించారు. అప్పటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో రోగులు రావడం ఆరంభమైంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో 64 మంది, క్వారంటైన్‌లో సుమారు 50 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు. జిల్లాలో కరోనా రోగుల సంఖ్య వెయ్యికి చేరేలా ఉంది.


నెల్లూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్‌ను స్టేట్ కోవిడ్ కేంద్రంగా మార్చారు. నెల్లూరు జిల్లాతోపాటు ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే రోగులందరికీ సేవలందించాలి. కోవిడ్ రోగులకు మంచి ఆహారం ఇవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతున్న కథ వేరేలా ఉంది. ఒక్కో రోగికి ప్రభుత్వం ఇచ్చే రూ. 340 తీసుకుంటున్నారు. కానీ సరైనా ఆహారం పెట్టడంలేదు. ఉదయం ఎండిపోయిన చపాతీలు, మధ్యాహ్నం సుద్దయిన అన్నం, ఉప్పు, కారం లేని పప్పు, పచ్చడి, నీళ్ల సాంబారు ఇస్తున్నారు. అక్కడున్నవాళ్లు ఆ భోజనం తినలేక బయటపడేస్తున్నారు. ఒక్క పూట కూడా మంచి భోజనం ఇవ్వడంలేదని రోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా లోపలకు రావడంలేదని, సరిగా వైద్య సేవలు అందడంలేదంటూ ఆందోళన చెందుతున్నారు. మరుగుదొడ్ల పరిస్థితి మరీ దారుణమని, శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వస్తుందని రోగులు చెబుతున్నారు. కోలుకుని ఇంటికి తిరిగి వెళతామో లేదోనని భయపడుతున్నారు.

Updated Date - 2020-07-05T19:50:55+05:30 IST