నెల్లూరు: అసాని తుఫాన్ నెల్లూరు జిల్లాకు తీరని నష్టాన్ని మిగిల్చి, రైతుల కష్టాన్ని నీటి పాలు చేసింది. బుధవారం రాత్రి తుఫాన్ తీరం దాటినప్పటికీ గురువారం కూడా జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగం తాజా తుఫాన్ దెబ్బకు మరింత కుదేలైంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం గురువారం నాటికి జిల్లాలో 12,292 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా 10,456 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. వరి 795 ఎకరాలు, వేరుశనగ 697 ఎకరాలు, మినుము 230 ఎకరాలు, నువ్వులు 84 ఎకరాలు, మొక్కజొన్న పంట 30 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రధానంగా ఉదయగిరి, వరికుంటపాడు, లింగసముద్రం, గుడ్లూరు, బోగోలు, జలదంకి, వలేటివారిపాలెం, కందుకూరు, సంగం, ఉలవపాడు, పొదలకూరు మండలాల్లో నష్టం జరిగింది. అలానే ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు మండలాల్లో కోత కోసి రోడ్లపై ఉంచిన 63 మొట్రిక్ టన్నుల ధాన్యపు రాశులు వర్షానికి తడిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే వర్షం తగ్గాక పూర్తిస్థాయిలో అంచనా వేస్తే పంట నష్టం మరింత పెరిగే అవకాశముంది.
ఇవి కూడా చదవండి