పని చూపమంటే పడుపు వృత్తిలోకి దించారు

ABN , First Publish Date - 2020-06-01T17:27:39+05:30 IST

బతకడానికి ఏదైనా పని చూపమని కోరితే..

పని చూపమంటే పడుపు వృత్తిలోకి దించారు

బాలిక ఫిర్యాదుతో నలుగురి అరెస్టు

ఆ ఎస్‌ఐపై ఆరోపణలు అవాస్తవం

రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌ రెడ్డి


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): బతకడానికి ఏదైనా పని చూపమని కోరితే ఎక్కువ డబ్బులు వస్తాయంటూ ఆశచూపి ఓ బాలికను కొందరు వ్యభిచార కూపంలోకి దించారని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఓ బాలిక ఆర్థిక ఇబ్బందుల కారణంగా విజయవాడలోని ఆమె పిన్ని ఇంటికి చేరింది. అక్కడ బాలికకు కృష్ణ, సోనీ దంపతులు పరిచయమయ్యారు. వారిని ఏదైనా పని చూపమని అడిగితే, ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చంటూ వ్యభిచారంలోకి దించారు.


ఈ ఏడాది జనవరిలో నెల్లూరుకు తీసుకువచ్చి హరనాథపురంలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్న లావణ్య, ఆమె తమ్ముడు పృధ్వీ, మరిది వినయ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆ బాలికతో లావణ్య వ్యభిచారం చేయిస్తోంది. అయితే బాలికకు సరిగా నగదు ఇవ్వకపోవడంతోపాటు తల్లితో మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు పెట్టేవారు. ఈ క్రమంలో మే 29వ తేదీ బాలికను ఇందుకూరుపేట మండలంలోని విటుల వద్దకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ఆదేశాలతో విచారణ చేపట్టి ఆదివారం సాయంత్రం విటులతో పాటు నిర్వాహకులను ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ హరినాథ్‌ రెడ్డి తెలిపారు.


అరెస్ట్‌ చేసిన వారిలో కడియాల లావణ్య, కొత్తపల్లి పృధ్వీరాజ్‌, యూ వినయ్‌ కుమార్‌, రెవెన్యూ శాఖ ఉద్యోగి కొనెట్టి శ్రీనాథ్‌ ఉన్నారన్నారు. బాలికను వ్యభిచారంలోకి దించిన బావిశెట్టి రామకృష్ణ, షేక్‌ సోనీలు పరారీలో ఉన్నారని, విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సీఐ కే రామకృష్ణ, ఎస్‌ఐ పీ నరేష్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కాగా, ఈ కేసులో ఓ ఎస్‌ఐకూ సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై రూరల్‌ డీఎస్పీ మాట్లాడుతూ, ఆ ఎస్‌ఐపై ప్రాథమిక విచారణ జరిపామని, ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారు. అయితే ఈ విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయని, పోలీసులు కావాలనే సదరు ఎస్‌ఐ పేరును తప్పించారని, ఆయన కోసమే కేసును తారుమారు చేశారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2020-06-01T17:27:39+05:30 IST