Maharashtra Crisis: ఆ హోటల్ బిల్లులు మేమెందుకు చెల్లిస్తాం: హిమంత బిశ్వ శర్మ

ABN , First Publish Date - 2022-06-25T22:56:28+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) తన మద్దతుదారులైన ఎమ్మెల్యేతో

Maharashtra Crisis: ఆ హోటల్ బిల్లులు మేమెందుకు చెల్లిస్తాం: హిమంత బిశ్వ శర్మ

గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) తన మద్దతుదారులైన ఎమ్మెల్యేతో కలిసి తొలుత సూరత్‌ (Surat)లోని ఓ హోటల్‌లో క్యాంపు వేశారు. శివసేన నేతల నుంచి ప్రలోభాలు ఉండొచ్చన్న అనుమానంతో ఆ తర్వాత తమ మకాంను బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలోని గువాహటి (Guwahati)కి మార్చారు. అక్కడి రాడిసన్ బ్లూ హోటల్‌లో క్యాంపు వేసి రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక బీజేపీ ఉందన్న వార్తల నేపథ్యంలో ఆ హోటల్ బిల్లులను బీజేపీ చెల్లిస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. 


ఈ వార్తలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) స్పందించారు. ఆ బిల్లులను తాను కానీ, అసోం ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ చెల్లించబోదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ మద్దతు ఉందా? లేదా? అన్న విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు. అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉందని, రేప్పొద్దున్న కాంగ్రెస్ వారొచ్చినా తాను ఇలాగే స్పందిస్తానని చెప్పుకొచ్చారు. 


హోటల్ బిల్లులు చెల్లింపు విషయమై మాట్లాడుతూ.. బీజేపీ  కానీ, అసోం ప్రభుత్వం కానీ హోటల్ బిల్లులు ఎందుకు చెల్లిస్తుందని జర్నలిస్టును సీఎం ప్రశ్నించారు. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు రాష్ట్రానికి వచ్చారు కాబట్టే వరదల గురించి మీడియా పట్టించుకుంటోందంటూ జర్నలిస్టులకు సీఎం చురకలంటించారు.

Updated Date - 2022-06-25T22:56:28+05:30 IST