Abn logo
Jun 14 2021 @ 01:12AM

పొరుగు మద్యంపై మోజు.. సరిహద్దుల్లో బెల్ట్‌షాపుల జోరు

డీ హీరేహాళ్‌, జూన 13 : రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణలో భా గంగా చేపట్టిన కట్టడి చర్యలు మద్యంప్రియులకు మింగుడుపడలేదు. దీం తో పొరుగు మద్యంపై మోజు పెంచుకున్నారు. ఇంకేముంది.. సరిహద్దున ఉన్న కర్ణాటక ప్రాంతాలకు రాత్రనక, పగలనక క్యూ కడుతున్నారు. అనుకో ని అతిథుల కోసం కుప్పలు తెప్పలుగా బెల్ట్‌షాపులు బార్లాతెరిచారు. అక్క డి మద్యం సిండికేట్‌ దళారుల పంట పండిస్తున్నారు. అంతేనా అంటే.. ఆంధ్ర లిక్కర్‌ ముట్టుకోమని భీష్మించుకున్నారో ఏమో... మండలకేంద్రమైన డీ హీరేహాళ్‌లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం దెబ్బకు శాశ్వతంగా మూ తపడింది. ఈ పరిస్థితి కర్ణాటక బెల్ట్‌షాపుల జోరుకు అద్దంపడుతోంది. ఆంధ్ర మద్యంపై ధరల మోత మోగుతోందని, మరోవైపు నచ్చిన బ్రాండ్లు మాయం కావడంతోనే మద్యంప్రియులు బార్డర్‌ దాటేస్తున్నారని తెలుస్తోం ది. కారణమేదైనా మద్య నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ... మరోవైపు ఖజానాకూ గండికొడుతున్నారు. నియంత్రించాల్సిన ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలు చేతులెత్తేశాయి.    


సరిహద్దు ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు

డీ హీరేహాళ్‌ మండలం కర్ణాటక ప్రాంతానికి ఆనుకుని ఉంది. దీంతో మందుబాబులు మద్యం కోసం బార్డర్‌ దాటేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆంధ్ర ప్రాంతానికి అనువుగా వున్న కర్ణాటక భూముల్లో మద్యం షాపులు, బెల్ట్‌షాపులను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. దీంతో మండల ప్రాంతానికి సంబంధించిన ప్రజలు రాత్రింబవళ్లు బెల్ట్‌షాపుల వద్దే ఎంజా య్‌ చేస్తున్నారు. కర్ణాటక ప్రాంతంలోని మొలకాల్మూరు, రాంపురం తదితర ప్రాంతాల్లో పరిచయాలు వున్న వారితో కొందరు సిండికేట్‌గా ఏర్పడి ఈ తతంగాన్ని నడుపుతున్నారు. నేడు పదుల సంఖ్యలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని కర్ణాటకకు వెళ్లే సరిహద్దు దారుల్లో ప్రతి చోటా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. వీటి దెబ్బకు మండలకేంద్రంలో వున్న ప్రభుత్వ మద్యం దుకాణం శాశ్వతంగా మూసేయాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే కర్ణాటక ప్రాంత బెల్టుషాపుల ప్రభావం ఏమేరకు ఉందో అర్థమవుతుంది. ఈ బెల్టుషాపుల ద్వారా మండలంలోని చాలా గ్రామాల్లో రాత్రింబవళ్లు మద్యం సులభంగా లభ్యమవుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. బెల్ట్‌షాపులకు ప్రస్తుతం కర్ఫ్యూ నిబంధనలు కూడా అడ్డులేకుండా పోవడంతో మద్యం అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. 


అక్రమ మద్యం రవాణాకూ కేంద్రాలు 

ఆంధ్ర సరిహద్దున కర్ణాటక ప్రాంతంలో బెల్టుషాపులు ఏర్పాటు చేయ డంతో మద్యం అక్రమ రవాణాదారులకు కలిసొచ్చింది. తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి మద్యాన్ని కొ నుక్కుని ఆంధ్రకు తరలిస్తున్నారు. అక్రమ మద్యం నియంత్రణలో పోలీసు లు పూర్తిగా విఫలమయార్యన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో నామమాత్రంగా తనిఖీలు, అడపాదడపా మద్యం స్వాధీనం చేసుకుంటూ అక్రమార్కులకు గేట్లు తెరిచారన్న ఆరోపణ లున్నాయి.  


నోటీసులు జారీ చేశాం : పవనకుమార్‌, సెబ్‌ సీఐ 

సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన బెల్ట్‌షాపుల కు నోటీసులు జారీ చేశాం. ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు మద్యం బాటిళ్లు మా త్రమే ఇవ్వాలని సూచించాం. అధిక సంఖ్యలో ఇస్తే బెల్టుషాపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చ రించాం. మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేం దుకు చాలాచోట్ల ఫ్లయింగ్‌ బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నాం. గ్రామాల్లో మద్యం  అక్రమంగా విక్రయిస్తూ పట్టుబడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.