పొరుగు పోటు!

ABN , First Publish Date - 2022-05-19T05:10:09+05:30 IST

పొరుగు పోటు!

పొరుగు పోటు!
నాపరాయిని లోడింగ్‌ చేస్తున్న కూలీలు


  • పక్క రాష్ట్రానికి తరలుతున్న నాపరాయి, సుద్ద వ్యాపారం 
  • రాయల్టీల్లో భారీ తేడా 
  • కర్ణాటకలో నెల రోజుల్లోనే లీజు అనుమతులు 
  • ఇక్కడ మూడేళ్లయినా ఇవ ్వని వైనం
  • కర్ణాటక నుంచి వచ్చే నాపరాయి, సుద్ద రాయల్టీ ఎగవేస్తున్న వ్యాపారులు

తాండూరు, మే 18 : నాపరాయి, సుద్ద వ్యాపారులు తమ వ్యాపారాల రూటు మార్చారు. రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో  నాపరాయి, సుద్ధ, ఎర్రమట్టి తవ్వకాలకు అక్కడి ప్రభుత్వం సులువుగా అనుమతులు ఇవ్వడంతో పాటు రాయల్టీ తక్కువ ఉండటంతో తాండూరు ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారులు తమ వ్యాపారాన్ని అక్కడికి మార్చేశారు. కర్ణాటక రాష్ట్రం మిర్యాణం, కల్లూరు నుంచి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.  అయితే పెద్ద ఎత్తున నాపరాయి లారీలు పాలిషింగ్‌ కోసం తాండూరుకు వస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలో నాపరాతి, సుద్ధ, ఎర్రమట్టి తదితర తవ్వకాల కోసం అనుమతి ఇవ్వాలని మూడేళ్లుగా దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ పర్యావరణ అనుమతులు తప్పనిసరి కావడంతో ఇప్పటి వరకు కొత్త లీజులకు అనుమతులు ఇవ్వలేదు. దాదాపు వంద దర ఖాస్తుల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోనే అక్కడి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తుంది. ఎర్రమట్టికి తాండూరు ప్రాంతంలో టన్నుకు రూ.130 రాయల్టీ ఫీజు చెల్లించడంతోపాటు పర్మిట్‌ ఫీజు రూ.104 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కర్ణాటకలో మాత్రం రాయల్టీ టన్నుకు సుమారు రూ.60 వరకే ఉండటంతో రాయల్టీ చెల్లింపుల్లో భారీ తేడాలున్నాయి. కర్ణాటకలో ఒక్కసారి మంజూరైన లీజు 20ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో ఈ ప్రాంత వ్యాపారులు కర్ణాటక ప్రాంతంలో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాండూరులో ప్రతి ఏడాది రూ.3కోట్ల మేరకు రాయల్టీ రూపేణా ఆదాయం ఇచ్చేది. ఇప్పుడు పెద్ద మొత్తం ఆదాయం కర్ణాటకకు వెళ్లనుంది. అయితే రాయల్టీల ఎగవేతతో రెండు రాష్ట్రాలకు నష్టం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

అక్రమ రవాణాకు సెటిల్‌మెంట్లు

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని మిర్యాణం నుంచి పెద్ద ఎత్తున నాపరాయి, సుద్దకు డిమాండ్‌ ఉండటంతో ఇటీవలి కాలంలో రాయల్టీ లేకుండా అక్రమంగా నాపరాతి, సుద్ద లారీలు తరలుతున్నాయి. అయితే ఈ ప్రాంతం మీదుగా అక్రమ రవాణాకు తాండూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి పెద్ద ఎత్తున మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం జినుగుర్తి గేటు వద్ద మైనింగ్‌, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో రాయల్టీ  చెల్లించకుండా పెద్ద  ఎత్తున నాపరాయి, సుద్ద రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. వాస్తవంగా కర్ణాటక రాష్ట్రం మిర్యాణంలో రాయల్టీని చెల్లించి వాహనాలు తరలాలి. అయితే అక్కడి నాపరాతిని తాండూరులో పాలిషింగ్‌ చేయించి వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం వ్యాపార ప్రతినిధితో ఇక్కడ ఈప్రాంత ప్రజా ప్రతినిధి మామూళ్లు మాట్లాడుకుని ముఖ్యమైన ప్రజా ప్రతినిధులకు నెలనెలా మామూళ్లు అందజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కర్ణాటక నాపరాయి లారీలు తాండూరు మీదుగా వెళ్లేందుకు ఒక్కోక్క లారీ నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల చొప్పున గుడ్‌విల్‌ ఇవ్వాలని సదరు ప్రజాప్రతినిధి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కర్ణాటకలో వ్యాపారం నిర్వహిస్తూ తాండూరు మీదుగా లారీలు వెళ్లేందుకు అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారు. తాజాగా ప్రజా ప్రతినిఽధులు కూడా కండీషన్‌ విధించడంతో అక్కడి వ్యాపారులు ఎబోదిబోమంటున్నారు.

Updated Date - 2022-05-19T05:10:09+05:30 IST